సోమవారం 06 ఏప్రిల్ 2020
Nalgonda - Jan 18, 2020 , 03:39:21

మున్సిపాలిటీలను తీర్చిదిద్దుతాం

మున్సిపాలిటీలను తీర్చిదిద్దుతాంమిర్యాలగూడ, నమస్తేతెలంగాణ: మున్సిపాలిటీల అభివృద్ధి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే సాధ్యమని.. సీఎం కేసీఆర్‌ ఆ దిశగా ప్రణాళికలు రూపొందించి ఆచరణలో పెడుతున్నారని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మిర్యాలగూడ మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన ప్రచార ర్యాలీలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మిర్యాలగూడ పట్టణ అభివృద్ధి కోసం గతేడాది పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ రూ.200కోట్లు మంజూరు చేశారన్నారు. ఈ నిధులతో పట్టణంలోని 48వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణం పూర్తి చేయడం జరుగుతుందని వివరించారు. గత రెండు పర్యాయాలు టీఆర్‌ఎస్‌కు ఓటు వేసిన ప్రజలకు సీఎం కేసీఆర్‌ అభివృద్ధి రూపంలో వారి రుణం తీర్చుకున్నారన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతులకు పంట పెట్టుబడుల కోసం ఎకరాకు రూ.10వేలు రైతు బంధు సహాయాన్ని అందించి ఆదుకున్న గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని కొనియాడారు. రైతులు ఆకస్మిక మృతి చెందిన రూ.5లక్షల ప్రమాదబీమా కల్పించారని, దీంతో లక్షల కుటుంబాలు లబ్ధ్దిపొందుతున్నాయన్నారు.

నియోజకవర్గంలో గత ఐదేళ్లుగా రూ.1500 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు చొరవతో నియోజకవర్గం అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుందన్నారు. మున్సిపాలిటీల్లో 48 మంది కౌన్సిలర్లను భారీ మెజార్టీతో గెలిపించి ఎమ్మెల్యే భాస్కర్‌రావుకు అండగా నిలపాలని, రాబోవు ఐదేళ్లలో మిర్యాలగూడ మున్సిపాలిటీ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఇటీవల పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎక్కడకు పోయినా వంద కోట్ల నిధులు తెస్తానని మతి స్థిమితం లేకుండా మాట్లాడుతున్నాడన్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారం లేకుండా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ద్వారా నిధులు ఎలా తెస్తారని ప్రశ్నించారు. యాభై ఏళ్ల పాటు రాష్ర్టాన్ని దేశాన్ని, రాష్ర్టాన్ని పాలించిన కాంగ్రెస్‌ నాయకులు మాయమాటలు చెప్పి ప్రజలను ఇంకా మబ్యపెట్టాలని చూస్తున్నారని, కాంగ్రెస్‌ నాయకుల మాయ మాటలు నమ్మొద్దని సూచించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపిస్తేనే మిర్యాలగూడ మున్సిపాలిటీ అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతుందన్నారు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కారు గాలి వీస్తుందని టీఆర్‌ఎస్‌ ప్రభంజనంలో ఏ పార్టీ నిలువలేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి పోటీ చేసే అభ్యర్థులు కరువై ఆంధ్రా ప్రాంతానికి చెందిన అభ్యర్థిని మున్సిపల్‌ చైర్మన్‌గా అరువు తెచ్చుకున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే రైతులకు బడుగు బలహీనవర్గాలకు న్యాయం జరిగిందని, అన్నివర్గాల వారు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరారు.

ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణం అభివృద్ధికి మంత్రి కేటీఆర్‌ రూ.200కోట్లు మంజూరు చేశారని, ఈనిధులతో పట్టణంలో రోడ్లు, డ్రైనేజీ సమస్య పూర్తిగా తీరిపోతుందన్నారు. పట్టణంలోని 18,500 గృహాలకు త్వరలో ఇంటింటికీ కృష్ణా నీటి సరఫరా చేయనున్నామని , సీఎం కేసీఆర్‌ చొరవతోనే మహిళల తాగునీటి కష్టాలు తీరుతున్నాయన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి మిర్యాలగూడ మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేసేందుకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నల్లగొండ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, మున్సిపాలిటీ ఇన్‌చార్జి గుత్తా జితేందర్‌రెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు తిరునగరు భార్గవ్‌, అన్నబీమోజు నాగార్జునాచారి, వంగాల నిరంజన్‌రెడ్డి, కుర్ర విష్ణు తదితరులు పాల్గొన్నారు.logo