గురువారం 02 ఏప్రిల్ 2020
Nalgonda - Jan 18, 2020 , 03:36:09

యాదాద్రిలో అమ్మవారికి ఊంజల్‌సేవ

యాదాద్రిలో అమ్మవారికి ఊంజల్‌సేవ


యాదగిరిగుట్ట, నమస్తే తెలంగాణ: శ్రీలక్ష్మీనరసింహుడి బాలాలయంలో శుక్రవారం సాయంత్రం ఊంజల్‌ సేవను కోలాహలంగా నిర్వహించారు. పరమపవిత్రంగా మహిళాభక్తులు పాల్గొనే ఊంజల్‌ సేవలో వేలాది మంది భక్తులు పాల్గొని తరించారు. బాలాలయం ముఖమండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా 516 రూపాయల టిక్కెట్‌ తీసుకున్న భక్తులకు సువర్ణపుష్పార్చన జరిపించారు. మొదటగా శ్రీమన్యుసూక్త పారాయణం జరిపారు. ప్రత్యేకంగా బంగారంతో తయారు చేసిన 108 పుష్పాలను శ్రీవారి సన్నిధిలో ఉంచి వాటితో అర్చన జరిపారు. ఉపప్రధానార్చకుడు బట్టర్‌ సురేంద్రాచార్యులు ఆధ్వర్యంలోని అర్చక బృందం వైభవంగా నిర్వహించారు. ముత్తయిదువులు మంగళహారతులతో అమ్మవారిని స్థుతిస్తూ పాటలు పాడుతూ సేవ ముందు నడిచారు. తిరువీధి సేవ అనంతరం అమ్మవారిని  బాలాలయం ముఖ మంటపంలోని ఊయలలో శయనింపు చేయించారు. గంట పాటు వివిధ రకాల పాటలతో అమ్మవారిని కొనియాడుతూ లాలిపాటల కోలాహలం కొనసాగింది. అష్టోత్తర పూజల్లో  భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 

ఆర్జిత పూజల కోలాహలం ...

యాదాద్రిలో ఆర్జిత పూజల కోలాహలం తెల్లవారు జాము 3గంటల నుంచి మొదలైంది. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవమూర్తులకు అభిషేకం జరిపారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు శ్రీలక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేధనలు అర్పించారు. ఉదయం 8 గంటలకు నిర్వహించిన  శ్రీసుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. ప్రతీ రోజు నిర్వహించే నిత్యకల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

శ్రీవారి ఖజానాకు రూ.9,40,989

శ్రీవారి ఖజానాకు రూ. 9,40,989 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రధాన బుకింగ్‌తో రూ. 1,30,040, రూ. 100ల దర్శనంతో రూ. 82,500, కల్యాణకట్ట ద్వారా రూ. 24,000, వత్ర పూజల ద్వారా రూ. 38,500, ప్రసాదవిక్రయాలతో రూ. 4,49,595, శాశ్వత పూజల ద్వారా రూ. 8,232, టోల్‌గేట్‌ ద్వారా రూ. 1,290, అన్నప్రసాదంతో రూ. 10,672, వాహనపూజల ద్వారా రూ. 11,600, ఇతర విభాగాలతో రూ.1,25,280 ఆదాయం సమకూరినట్లు తెలిపారు.


logo
>>>>>>