శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Nalgonda - Jan 17, 2020 , 00:58:16

రేపటి నుంచి తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ మహాసభలు

 రేపటి నుంచి తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ మహాసభలు


నడిగూడెం : మండల కేంద్రంలోని రాజావారి కోటలో ఈనెల 18 నుంచి డక్కన్ అర్కియాలజీ అండ్ కల్చరల్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ మహాసభలు, పరిశోధన కేంద్రం ప్రారంభమవుతున్నట్లు ఆ సంస్థ డైరక్టర్ కుర్రా జితేంద్రబాబు తెలిపారు. గురువారం కోటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నడిగూడెంకు చెందిన రాజాగారు (రాజానాయిని వెంకటరంగారావు) 1900 సంవత్సరంలో హైదరాబాద్ గ్రంథాలయం స్థాపించి దానికి  శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాష నిలయంగా పేరుపెట్టిన తర్వాత అనేక గ్రంథాలయాలు స్థాపించి తెలంగాణ గ్రంథాలయ ఉద్యమాలకు ఊపిరి పోసిన వ్యక్తి రాజాగారు అన్నారు.

ఆయన ఆశయాలకు అనుగుణంగానే నడిగూడెం రాజాగారి కోటలో తెలంగాణ గ్రంథాలయాలకు బీజం ఏర్పడిన కోటలోనే సభలు ఏర్పాటు చేసుకోవాలని కమిటీ వారు నిర్ణయించుకొని దానికి అనుగుణంగా అడుగు ముందుకు వేశామన్నారు. దానికి రాజా వారి కుటుంబీకులను సహయం కోరగా వారు అంగీకరించి కోటను తమకు స్వాధీన పర్చిన్నట్లు తెలిపారు. ఈ కోటలో 1623 సంవత్సరం నుంచి సేకరించిన పుస్తకాలు, తాళ్లగ్రంథాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా కూడా లభ్యం కాని పుస్తకాలు అనేకం ఇక్కడ అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. కోటలో 7 భాషలకు చెందిన తెలుగు, మరాఠా, కన్నడం, సంస్కృతం, పాలీ, హిందీ, ఇంగ్లీష్ 2.5 లక్షల పుస్తకాలు, 30వేల తాళ్ల పత్ర గ్రంథాలు ఉన్నాయని తెలిపారు. ఇక్కడ ఉన్న పుస్తకాలు పఠనం చేయడానికి ఇతర దేశాల నుంచి పరిశోధన స్కాలర్స్ రానున్నట్లు తెలిపారు. వారికి తగిన వసతి ఏర్పాటు చేశామన్నారు.

భారతదేశ చరిత్ర మీద పరిశోధన చేసే వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. దీని నిర్వహణ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదన్నారు. కమిటీ సభ్యుల సహకారంతో దాతల నుంచి వచ్చిన విరాళాలతోనే కోటలో అభివృద్ధి పనులు నిర్వహించిన్నట్లు తెలిపారు. 1880లో నిర్మించిన ఈ కోటలో మేము పరిశోధనకేంద్రం ఏర్పాటు చేశామని ప్రారంభ వేడుకలు ఈనెల 18, 19 తేదీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జాతీయజెండా రూపకల్పన చేసిన పింగళి వెంకయ్య పేరుతో సభా వేదిక నిర్మంచామన్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు రానున్నట్లు తెలిపారు. ప్రారంభం సందర్బంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా ప్రఖ్యాత ప్రపంచ డ్యాన్సర్ అనుపమ కైలాశ్, వారి బృందంచే నృత్యాలు ఉంటాయన్నారు. పరిశోధన కేంద్రంగా విరాజిల్లేందుకు కోటకు నూతనంగా రంగులు వేయించి, నిర్మాణ పనులు నిర్వహించిన్నట్లు తెలిపారు.  ఈ సమావేశంలో ప్రొఫెసర్ జయకిషన్, ఎల్.రామానాయుడు, స్థానిక సెక్రెటరీ హిమబిందు, ఖలీల్ పాల్గొన్నారు.logo