మంగళవారం 31 మార్చి 2020
Nalgonda - Jan 15, 2020 , 03:40:40

కమననీయం..

కమననీయం..
  • - వైభవంగా గోదా రంగనాథుల కల్యాణంధనుర్మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం గోదాదేవి, రంగనాథుల కల్యాణం జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి పాలెం గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహుడిని దర్శించుకుని కల్యాణమహోత్సవాన్ని తిలకించారు. శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్ర కుమార్‌, ఎమ్మెల్సీ తేర చిన్నపరెడ్డి దేవరకొండ పట్టణంలోని గురుడాద్రి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో తిరుకల్యాణోత్సవంలో
పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీసీతారామ చంద్రస్వామి ఆలయంలో కల్యాణోత్సవం కనులపండువగా జరిగింది.

నల్లగొండకల్చరల్‌: నల్లగొండ పట్టణంలోని రామగిరిలో గల శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో గోదాదేవి రంగమన్నార్‌ల కల్యాణం మంగళవారం రాత్రి వైభవంగా జరిగింది. శ్రీరంగం దేవస్థానం స్థానాచార్యులు శ్రీ లక్ష్మీ నర్సింహా భట్టర్‌ పర్యవేక్షణలో యాజ్ఞికులు శ్రీమన్నారాయణ శిష్య బృందం ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛరణాల మధ్య కనుల పండువగా జరిపించారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా తిరుప్పావై కార్యక్రమం అనంతరం భోగి పర్వదినం నాడు మంగళవాయిద్యాల నడుమ కల్యాణం నిర్వహించారు. ఈ కల్యాణోత్సవానికి 500మంది దంపతులతో పాటు భక్తులు  భారీసంఖ్యలో హాజరై తిలకించారు. విష్ణు చిత్తుడు కుమార్తె గోదాదేవితో అవతారమూర్తి పాండురంగనాథస్వామి కల్యాణోత్సవాన్ని పంచరాత్ర ఆగమశాస్త్ర రీతిలో వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ కనుల పండువగా జరిగింది. వివిధరకాల పుష్పాలు, పట్టువస్ర్తాలు, బంగారు ఆభరణాలతో దివ్యమనోహరంగా అలంకరించబడిన గోదాదేవి రంగమన్నారులను ఆలయ కల్యాణ మండపంపై ఆసీనులను చేశారు. స్వస్తి వాచనం అనంతరం విష్వక్సేనుడిపూజతో కల్యాణ తంతు ప్రారంభించారు.

జీలకర్రబెల్లం అనంతరం భక్తజనుల గోవింద నామస్మరణల మద్య గోదాదేవి మెడలో రంగనాధస్వామి మంగళసూత్రధారణ కార్యక్రమం నిర్వహించారు. కల్యాణం సందర్భంగా రామాలయం అంతా విద్యుత్‌దీపాలతో అలంకరించారు. భక్తులు ఇబ్బందిపడకుండా కల్యాణం వీక్షించడానికి స్క్రీన్‌ ఏర్పాటుచేశారు. పోలీసు బందోబస్తు ఏర్పాట్లుచేశారు. ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా పోలీసులు పర్యవేక్షించారు. ఈ కల్యాణ వేడుకలో జిల్లా నుంచి  అధికసంఖ్యలో  దంపతులు పాల్గొని పూజలు చేయించడం విశేషం. తిరుకల్యాణ మహోత్సవానికి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి రమాదేవి దంపతులు, ఆలయ చైర్మన్‌ చకిలం వేణుగోపాలరావు -సంధ్యారాణి దంపతులు వేరువేరుగా వారి ఇంటి నుంచి  స్వామివారికి పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు మేళతాళాల మధ్య ఆలయానికి తీసుకొచ్చి సమర్పించారు. ఈ కల్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి,  ఆలయ ఈఓ మొకిరాల రాజేశ్వరశర్మ, చైర్మన్‌ చకిలం వేణుగోపాలరావు, డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, ఆలయ మాజీ చైర్మన్‌ మద్ది విద్యాసాగర్‌రెడ్డి, చిలుకలగోవర్ధన్‌, కంచనపల్లి రవీందర్‌, బుక్క ఈశ్వరయ్య, మెరుగుగోపి, రాములు, రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, పారేపల్లి శ్రీనివాస్‌, మిర్యాలస్వామి, రామాలయ స్థానాచార్యులు అంగలూరి రంగాచార్యులు, ఆలయ ప్రధాన అర్చకులు యాదగిరాచార్యులు, శఠగోపాలచార్యులు, రాము, శేఖర్‌ పాల్గొన్నారు.logo
>>>>>>