గురువారం 02 ఏప్రిల్ 2020
Nalgonda - Jan 14, 2020 , 01:12:04

తెర వెనుక దోస్తీ..!

తెర వెనుక దోస్తీ..!


నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఏడు మున్సిపాలిటీ స్థానాలు.. 162వార్డులు.. జిల్లాఅంతటా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంటోంది. నేటితో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ సైతం ముగియనుండగా.. సంక్రాంతి సంబురాలతోపాటే ఓట్ల పండుగ సైతం మరింత జోరందుకోనుంది. భారీసంఖ్యలో దాఖలైన నామినేషన్లన్నీ ఇప్పటికే కొంతవరకు ఉపసంహరించుకోగా.. నేడు పెద్దసంఖ్యలో ఉప సంహరణ జరిగే అవకాశం ఉంది. నల్లగొండతోపాటు మిర్యాలగూడ, దేవరకొండ, నందికొండ, హాలియా, చిట్యాల, చండూరు మున్సిపాలిటీల్లో.. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితి తమ అభ్యర్థులను దాదాపుగా ఖరారుచేసింది. అధికారికంగా ప్రకటించింది కూడా. ఆ పార్టీ అభ్యర్థుల పక్షాన ఎమ్మెల్యేలు సైతం ప్రచారంలో పాల్గొంటున్నారు. మిగిలిన అన్ని రాజకీయ పార్టీలూ.. పొత్తు గురించి ఆలోచిస్తున్నా టీఆర్‌ఎస్‌ మాత్రం సొంతంగానే ఉత్సాహంగా దూసుకుపోతోంది. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు తోడు.. తిరుగులేని శక్తిగా అవతరించిన టీఆర్‌ఎస్‌ రాజకీయ బలంతో ఇతర పార్టీలు చాలాచోట్ల పోటీకే జంకుతున్నాయి. ఇప్పటికే చిట్యాల మున్సిపాలిటీలోని మూడో వార్డులో టీఆర్‌ఎస్‌ మినహా మిగిలిన అభ్యర్థులందరూ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో టీఆర్‌ఎస్‌కు చెందిన కోమటిరెడ్డి చిన వెంకటరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీఆర్‌ఎస్‌ ఉత్సాహం చూస్తుంటే.. ఈరోజు మరికొన్ని వార్డులు ఆ పార్టీ ఖాతాలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.

తెర వెనుక చేతులు కలిపే ఎత్తులు...

అభ్యర్థులను ఖరారు చేయడంతోపాటు.. ప్రచారంలోనూ మిగిలిన అన్నిపార్టీల కంటే టీఆర్‌ఎస్‌ కారు వేగంతో దూసుకెళ్తుంటే.. కాంగ్రెస్‌, బీజేపీ, కమ్యూనిస్టు క్యాడర్‌లో మాత్రం ఉత్సాహం కరువైంది. కాంగ్రెస్‌ ముఖ్యనేతలు సైతం అంతగా తెర మీదికి రాకపోవడం.. ఆ పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహాన్ని కలిగిస్తోంది. ఇదిలాఉంటే.. బలమైన టీఆర్‌ఎస్‌ను ఎలాగైనా ఓడించాలనే లక్ష్యంతో అవసరమైతే బీజేపీతోనూ జట్టు కట్టేందుకు కాంగ్రెస్‌, కమ్యూనిస్టు నేతలు వార్డుస్థాయిల్లో సంప్రదింపులు జరిపారు. అయితే ఒకే ఎజెండాతో తామంతా జట్టు కట్టి జనంలోకి వెళ్తే తిరస్కరణకు గురవుతామనే భయంతో.. ప్రస్తుతానికి తెర వెనుకే ఆ పొత్తులు పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. అవగాహన మేరకు బీజేపీ బలంగా ఉన్నచోట్ల కాంగ్రెస్‌ బలహీన అభ్యర్థులను బరిలో దించడం.. ఇదే సూత్రాన్ని బీజేపీ, సీపీఎం సైతం అనుసరిస్తున్నట్లు సమాచారం. అయినా ఆ అనైతిక తెర వెనుక ప్రయత్నాలను సైతం ప్రజలు తిరస్కరిస్తారనే ధీమాతో టీఆర్‌ఎస్‌ ప్రచారం చేపడుతోంది. ఇప్పటి వరకు మిర్యాలగూడలో మాత్రమే సీపీఎం, కాంగ్రెస్‌ మధ్య అవగాహన కుదిరింది. సీపీఎంకు ఏడు వార్డు స్థానాలు కేటాయించింది. అయితే ఈరోజు నామినేషన్ల ఉపసంహరణ తర్వాత పొత్తుల అంశాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


logo
>>>>>>