శనివారం 04 ఏప్రిల్ 2020
Nalgonda - Jan 14, 2020 , 01:09:49

మున్సిపల్‌ ఎన్నికల్లో బోణీ కొట్టిన టీఆర్‌ఎస్‌

మున్సిపల్‌ ఎన్నికల్లో బోణీ కొట్టిన టీఆర్‌ఎస్‌

చిట్యాల : మున్సిపల్‌ ఎన్నికల్లో నామినేషన్‌ ఉపసంహరణ ప్రక్రియ ముగియకముందే జిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీ బోణీ కొట్టింది. చిట్యాల మూడవ వార్డు నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి చినవెంకట్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వెంకట్‌రెడ్డిపై పోటీగా నామినేషన్‌ వేసిన వారందరు వెంకట్‌రెడ్డికి ఉన్న ప్రజాదరణను గుర్తించి ముందుగానే తమ నామినేషన్లను ఉపసంహరించుకోవటంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇక అధికారికంగా ప్రకటించటమే మిగిలింది. వెంకట్‌రెడ్డిపై సీపీఐ, టీడీపీ, బీజేపీలతోపాటు ఇండిపెండెంట్‌ అభ్యర్థులు కూడా నామినేషన్లు వేసినప్పటికి వారెవరు పోటీలో నిలువలేదు. పార్టీకి, ప్రజలకు అండగా చినవెంకట్‌రెడ్డి మొదటి నుంచి ఆ ప్రాంతంలోని ప్రజలకు, పార్టీ అండగా ఉంటూ తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రతి ఎన్నికలలోను పార్టీ కోసం పనిచేస్తూ అభ్యర్థుల ఎంపిక, గెలుపులలో తనదైన పాత్ర పోషించి ప్రత్యేక గుర్తింపు పొందిన వెంకట్‌రెడ్డి ఈసారి తానే ప్రత్యక్షంగా పోటీ చేయవలసి రావటంతో అందరిలో ఉత్కంఠ నెలకొన్నది. గెలుపు ఖాయమైనప్పటికి మెజార్టీపైనే అందరు చర్చించుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణ మొదటిరోజునే వెంకట్‌రెడ్డిపై పోటీగా నామినేషన్‌ వేసిన ఆరుగురిలో ఐదుగురు ఉపసంహరించుకోగా సోమవారం మిగిలిన ఒక వ్యక్తి కూడా తన నామినేషన్‌ ఉపసంహరించుకున్నాడు.
చైర్మన్‌ పదవికి మార్గం సుగమం : మున్సిపల్‌ కౌన్సిలర్‌గా వెంకట్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికకావటంతో మున్సిపల్‌ చైర్మన్‌ పదవికి కూడా మార్గం సుగమమైందని పలువురు చర్చింకున్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమని తెలుస్తుండటంతో ఆ పార్టీ నుంచి చైర్మన్‌గా ఇద్దరు వ్యక్తుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా అందులో ఒకరైన వెంకట్‌రెడ్డి కౌన్సిలర్‌గా ఎన్నికకావటంతో చైర్మన్‌కు మార్గం సులభమైందని పలువురు అనుకుంటున్నారు.
అభినందనల వెల్లువ : మిత్రులు, శ్రేయోభిలాషులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు వెంకట్‌రెడ్డికి మిఠాయిలు తినిపించి, శాలువాలు కప్పి అభినందనలు తెలిపారు. శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌, జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యలతోపాటు పలువురు స్థానిక నాయకులు ఆయనకు అభినందనలు తెలిపారు.

టీఆర్‌ఎస్‌పై ఆదరణకు గుర్తింపు : ఎమ్మెల్యే

చినవెంకట్‌రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక టీఆర్‌ఎస్‌ పార్టీపై ప్రజలకున్న ఆదరణకు గుర్తింపు అని, అధికార పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు గుర్తించి స్వాగతం పలికారని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. పార్టీతోపాటు వెంకట్‌రెడ్డికి ఉన్న ఆదరణను గుర్తించే నామినేషన్‌ వేసినవారందరు ఉపసంహరించుకున్నారని తెలిపారు ప్రజాసంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లకు ప్రజల్లో రోజురోజు ఆదరణ పెరుగుతుందని ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాల అడ్రసు గల్లంతు అవుతుందన్నారు. చిట్యాలలోని అన్ని వార్డులను గెలుచుకొని మున్సిపాలిటీని కైవసం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తంచేశారు. కేసీఆర్‌, కేటీఆర్‌తోపాటు జిల్లా మంత్రి సహాయ సహకారాలతో చిట్యాల మున్సిపాలిటీని అన్నిరంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతానని తెలిపారు.logo