శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Nalgonda - Jan 14, 2020 , 01:09:15

ప్రతి రోజూ పండగే..

ప్రతి రోజూ పండగే..


బొడ్రాయిబజార్‌ : నామినేషన్లు, స్క్రూట్నీ పూర్తయి ఇక ప్రచారానికి ఆరు రోజులే మిగిలి ఉంది. సమయం తక్కువ ఉండడంతో అభ్యర్థులు అహర్నిశలు శ్రమించినా ప్రచారం విజయవంతం కాని పరిస్థితి నెలకొంది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో 48వార్డులుండగా ప్రతి వార్డులో 2వేల పై చీలుకు ఓటర్లు ఉండగా ఒక్కో వార్డులో 20 నుంచి 35మంది అబ్యర్థులు బరిలో నిలిచారు. అభ్యర్థులెంత మంది ఉన్నా పోటీ మాత్రం ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్యే కావడంతో పార్టీ టికెట్‌లు తెచ్చుకొని బరిలో నిలిచిన అభ్యర్థులు ఎలాగైనా గెలిచి అధిష్టానం మెప్పు పొందేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. కేవలం ఆరు రోజుల్లో అందరిని కలుసుకొని ఓట్లు అభ్యర్థించడం కుదరని పని అని భావించి నూతన ప్రచారానికి తెర లేపుతున్నారు. ఇన్ని రోజులు వార్డుకు చెందిన ప్రజలెవరైనా శుభ, అశుభ కార్యాలు చేస్తే వెళ్లి ఆశీర్వచనాలు ఇచ్చి వచ్చిన నాయకులు ఇప్పుడు ఆ కార్యాలు వారే చేసేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. ఈ ఆరు రోజుల్లో వార్డులో ఎవరివైనా పుట్టినరోజులు, పెళ్లి రోజులు మరేమైన చిన్న చిన్న శుభకార్యాలు ఉన్న తేదీలను సేకరిస్తున్నారు. ఆయా తేదీల్లో వార్డులో వారి పుట్టిన రోజులు అభ్యర్థుల సొంత ఖర్చులతో జరిపించి అక్కడ వార్డు ప్రజలందరినీ ఒక దగ్గరకు చేర్చి ఓట్లు అభ్యర్థిసున్నారు. అభ్యర్థి ఎంత మంచివాడైనా ప్రత్యర్థి డబ్బులు ఆశ చూపితే ఓటరు మనసు మారే అవకాశం ఉండడంతో ఎవరెంత ఇస్తున్నారో తెలుసుకొని ఇప్పటి నుంచే ఎవరికి వారు డబ్బులు పంచేందుకు సిద్ధమని చాటింపు చేస్తున్నారు. అభ్యర్థులు ఇందుకు గాను ప్రత్యేకంగా ఆయా వార్డుల్లో కొందరు యువకులను నియమించి డైరీలు చేత బట్టించి కుటుంబం, ఓటర్ల సంఖ్య, ఫోన్‌ నెంబర్‌తో ఒక రికార్డు తయారు చేస్తున్నారు. మరి కొందరు ఉదయం, సాయంత్రం వేళల్లో దారి కాచి వార్డుకు చెందిన యువకులను, వాకింగ్‌కు వెళ్లే వారిని అప్యాయంగా పలుకరిస్తూ తమకే ఓటు వేయాలని అభ్యర్థిస్తూ ఒట్టు వేయించుకొని హామీలు తీసుకుంటున్నారు. ఏది ఏమైనా ఎన్నికల ఆరు రోజుల గడువు ఎలా ఉన్నా అభ్యర్థులు చేసే వినూత్న ప్రచార కార్యక్రమాలతో పుట్టినరోజులు, శుభకార్యాలు చేసుకుంటున్న వారు నిన్నటి వరకు వార్డులో పట్టుమని పదిమందికి తెలియకున్నా నేడు రూపాయి ఖర్చు పెట్టకుండా ఫేమస్‌ అవుతున్నారు. బరిలో నిలిచిన అభ్యర్థులు గెలిచేందుకు చేస్తున్న వినూత్న ప్రచారాలతో వార్డుల్లో ప్రతి రోజు పండుగరోజే అవుతుండగా దీన్ని ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారో వేచి చూడాల్సిందే. 

మూడు రోజుల సంక్రాంతి ఆరు రోజులు!
మున్సిపల్‌ ఎన్నికల సమయంలో వచ్చిన మూడు రోజుల సంక్రాంతి పండుగను ఆయా వార్డుల్లో ప్రజల చేత ఆరు రోజుల  చేయించేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు.  వార్డుల్లో ముగ్గుల పోటీలు నిర్వహించి మహిళా ఓటర్లను ఆకట్టుకోవడంతో పాటు యువకులు మధ్య వయస్కులకు దావత్‌లు ఇస్తూ సందడి చేస్తున్నారు. ఇప్పటికే పలు వార్డుల్లో ఆయా పార్టీల అభ్యర్థులు నువ్వా-నేనా అన్నట్లు ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.


logo