మంగళవారం 31 మార్చి 2020
Nalgonda - Jan 13, 2020 , 02:24:31

ముగిసిన పల్లె ప్రగతి

ముగిసిన పల్లె ప్రగతి


నల్లగొండ, నమస్తేతెలంగాణ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి-2 ఆదివారంతో ముగిసింది. జిల్లాలోని 840 గ్రామాల్లో ఈ నెల 2వ తేదీన కార్యక్రమాన్ని ప్రారంభించిన అధికార యంత్రాంగం సర్కారు సూచించిన అంశాల ఆధారంగా పలు విషయాలపై ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేశారు. అన్ని గ్రామ పంచాయతీలలో పారిశుధ్య సమస్య లేకుండా చేయడంతో పాటు శ్మశాన వాటికలు, డంపింగ్‌యార్డులకు స్థలాలు కేటాయించడం పూర్తి చేసి పలు ప్రాంతాల్లో పనులు కూడా ప్రారంభించారు. గ్రామాల్లో నిరక్షరాస్యుల వివరాలు సేకరించి వారిని అక్షరాస్యులుగా చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఆదివారం అన్ని గ్రామాల్లో పది రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించడంతో పాటు చెత్త సేకరించేందుకు బుట్టలు పంపిణీ చేశారు.

తెలంగాణ ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్‌ చట్టంలో భాగంగా రెండో దశలో చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. ఈనెల 2వ తేదీన ప్రారంభించిన జిల్లా అధికార యంత్రాంగం సర్కార్‌ సూచించిన అంశాలను దృష్టిలో పెట్టుకొని పలు విషయాలపై ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి నివేదిక రూపొందించింది. ప్రధానంగా జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య సమస్యలు లేకుండా చూడటంతో పాటు శ్మశానవాటికలు, డంపింగ్‌యార్డులను గుర్తించి నిరక్షరాస్యుల వివరాలను సేకరించింది.

అన్ని గ్రామపంచాయతీల్లోను పారిశుధ్య పనులు...

జిల్లా వ్యాప్తంగా 844 గ్రామపంచాయతీలుండగా అన్ని గ్రామపంచాయతీలకు సంబంధించి పారిశుధ్య సమస్యల విషయంలో సర్కార్‌ సూచన మేరకు జిల్లా అధికార యంత్రాంగం ప్రధానంగా దృష్టి సారించింది. 844 పంచాయతీల్లో ఉన్నటువంటి 10,389 కి.మీ. పరిధికి గాను 10,199 కి.మీ.కు సంబంధించి రోడ్లు శుభ్రం చేయగా 9820కి.మీ. డ్రైన్లకు గాను 8569 కి.మీ.శుభ్రం చేశారు. ఇక నర్సరీల విషయంలోను 844 గ్రామ పంచాయతీలకు గాను 840 గ్రామపంచాయతీల్లో స్థలాలను గుర్తించారు. అదే విధంగా శ్మశానవాటికలకు సంబంధించి 839 స్థలాలను గుర్తించి ఇప్పటికే పలు ప్రాంతాల్లో నిర్మాణం ప్రారంభించగా 841 డంపింగ్‌ యార్డులకు సైతం స్థలం గుర్తించి పనులు ప్రారంభించారు. ఇక 843 గ్రామ పంచాయతీల్లో వీధి లైట్లు వేయగా 839 గ్రామ పంచాయతీల్లో దాతలు పంచాయతీల అభివృద్ధి కోసం ఆర్థిక సాయం అందజేశారు.


logo
>>>>>>