ఆదివారం 29 మార్చి 2020
Nalgonda - Jan 12, 2020 , 03:19:08

అద్దె ఇల్లే రెవెన్యూ కార్యాలయం

అద్దె ఇల్లే రెవెన్యూ కార్యాలయం
  • -పంపిణీకి నోచుకోని పట్టాదారు పాసుపుస్తకాలు
  • -పీఏపల్లి మండలం మేడారం వీఆర్వో నిర్వాకం

పీఏపల్లి : అద్దె ఇంటిని అడ్డాగా చేసుకున్న ఓ రెవెన్యూ అధికారి.. రైతులకు మంజూరైన పట్టాదారు పాస్‌పుస్తకాలను వారికి ఇవ్వకుండా తన వద్దే ఉంచుకున్నాడు. వారిని తన చుట్టూ తిప్పుకుంటూ ఇంటినే రెవె న్యూ కార్యాలయంగా మా ర్చుకున్నాడు. రెండు నెలలు గా ఇంటి అద్దె చెల్లించక పోవడంతో ఇంటి యజమాని దానిని ఖాళీ చేయించేందుకు తెరవగా ఈ తం తంగం బయటపడింది. పీఏపల్లి మండలం మేడారం వీఆర్వో రఫీ మండల కేంద్రంలో తిప్పర్తి రంగయ్యకు చెందిన ఇంటిని అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. ఏడాదిగా అద్దెఇంట్లో ఉంటూ తన కార్యాకలాపాలన్నీ ఆ ఇంటి నుంచే నిర్వహించే వాడు. రెండు నెలలుగా సదరు ఇంటికి రాకపోవడం, కిరాయి ఇవ్వకపోవడంతో ఇంటి యజమాని ఆ ఇంటిని వేరే వారికి అద్దెకిచ్చేందుకు నిర్ణయించుకొని శనివారం ఇంటి తాళం తెరిచాడు.

సదరు ఇంట్లో మేడారం, దుగ్యాల గ్రామాలకు చెందిన 100 మందికి చెందిన పట్టాదారు పాసుపుస్తకాలు కుప్పలుగా పడిఉండడంతో వాటిని మూటకట్టి తనింట్లో బీరువాలో భద్రపర్చాడు. అనంతరం వేరొకరికి అద్దెకిచ్చాడు. ఈ విషయంపై నమస్తే తెలంగాణ వీఆర్వో రఫీని వివరణ కోరగా..పాసుపుస్తకాల్లో సవరణ కోసం కొంత మంది రైతులు తనకు ఇచ్చారని, రెవెన్యూ కార్యాలయంలో బీరువా లేకపోవడంతో తన అద్దె ఇంట్లో ఉంచినట్లు తెలిపాడు. తాను అనారోగ్యం బారిన పడడంతో అద్దె ఇంటికి తాళం వేసి చికిత్స కోసం వెళ్లినట్లు పేర్కొన్నాడు. ఈ విషయమై పీఏపల్లి తాసిల్దార్‌ దేవదాస్‌ మాట్లాడుతూ పాసుపుస్తకాలు అద్దె ఇంట్లో ఉన్న విషయంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు.


logo