ఆదివారం 29 మార్చి 2020
Nalgonda - Jan 12, 2020 , 03:17:06

అటవీశాఖ పనులను అడ్డుకున్న కొట్టాలగడ్డ రైతులు

అటవీశాఖ పనులను అడ్డుకున్న కొట్టాలగడ్డ రైతులు
  • -సాగు చేసుకున్న భూములను అప్పగించాలని వినతి


పెద్దఅడిశర్లపల్లి : ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూముల్లో అటవీశాఖ అధికారులు శనివారం కందకాలు తవ్వడంతో కొట్టాలగడ్డ రైతులు పనులను అడ్డుకున్నారు. అజ్మాపురం రెవెన్యూ కొట్టాలగడ్డ సమీపంలోని 118సర్వే నెంబరులో ఇటీవల రెవెన్యూ, అటవీశాఖ జాయింట్‌ సర్వే చేపట్టి అటవీ శాఖకు చెందిన భూమిగా గుర్తించి వారికి అప్పగించడంతో అటవీశాఖ కందకాలు తవ్వడం ప్రారంభించారు. గ్రామస్తులు మాత్రం ఇదేప్రాంతంలో 96సర్వే నెంబరులో వంద ఎకరాలకుపైగా రెవెన్యూ భూమి ఉన్నందున అది అటవీశాఖకు అప్పగించి 118సర్వే నెంబరులో రైతులు సాగు చేసుకునే అవకాశం కల్పించాలని స్థానిక సర్పంచ్‌ అదిరాల నగేష్‌ అటవీశాఖ అధికారులను కోరారు. ఇప్పటికే రైతులు ఇందిర జలప్రభ, ఉపాధిహామీ ద్వారా బోర్లు వేసుకుని సాగు చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని రైతులకు సర్ధిచెప్పారు. ఈ సందర్భంగా ఫారెస్టు సెక్షన్‌ ఆఫీసర్‌ పార్వతిదేవి మాట్లాడుతూ ప్రస్తుతం 118 సర్వేనెంబర్‌ తమ ఆధీనంలో ఉన్నందున ఖచ్చితంగా కందకాలు తవ్వుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు కంబాలపల్లి ఆనంద్‌, పెరిక విజయ్‌కుమార్‌, ఉప సర్పంచ్‌ గోవర్థన్‌ ఉన్నారు.

అటవీ జంతువులను వేటాడితే    కఠిన చర్యలు : పార్వతీదేవి

రైతులు అడవి జంతువులను  వేటాడితే  కేసులు నమోదు చేస్తామని ఫారెస్టు సెక్షన్‌ అధికారి పార్వతీదేవి హెచ్చరించారు. శనివారం పీఏపల్లి మండలంలోని కొట్టాలగడ్డ సమీపంలో అటవీ భూములకు ఏర్పాటుచేసిన ఫెన్సింగ్‌ దిమ్మెలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మట్లాడుతూ అటవీ భూములను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. అడవి పందులు పంట భూములను నాశనం చేస్తుంటే తమకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. తాము వాటిని మత్తు ఇంజక్షన్‌ సహాయంతో పట్టుకుని అటవీప్రాంతంలో వదిలివేస్తామని తెలిపారు.


logo