e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 23, 2021
Home నల్గొండ ఒకే రోజు.. ఒకే గంటలో..

ఒకే రోజు.. ఒకే గంటలో..

  • ముక్కోటి వృక్షార్చనకు సిద్ధం
  • జిల్లా వ్యాప్తంగా సన్నాహాలు
  • ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలని పిలుపు
  • ఎక్కడికక్కడే ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు సన్నద్ధం
  • సూర్యాపేట జిల్లాలో రహదారుల వెంట భారీ ప్రణాళిక
  • మొక్కలు నాటి 9000365000 నంబర్‌కు వాట్సాప్‌ చేయండి
  • యాప్‌లో సెల్ఫీలు అప్‌లోడ్‌ చేస్తే వనమాలి బిరుదుకు ఆహ్వానం

యువనేత, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా శనివారం పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా సన్నద్ధమవుతున్నది. గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా ఒకే రోజు..ఒకే గంటలో.. ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలనే పిలుపునకు జిల్లాలో భారీ స్పందన లభిస్తున్నది. పార్టీ శ్రేణులతోపాటు అన్ని స్థాయిల్లోని ప్రజాప్రతినిధులు అందుకు సిద్ధంగా ఉన్నారు. ఎక్కడి వారు అక్కడే మొక్కలు నాటేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో దీని కోసం ప్రత్యేకంగా ప్రణాళికను రూపొందించారు. సూర్యాపేట జిల్లాలోప్రధాన రహదారుల వెంట ఒకేసారి సామూహికంగా లక్ష మొక్కలు నాటేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇక నల్లగొండ జిల్లాలోనూ పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సారి మొక్కలు నాటి సెల్ఫీలు పంపితే వారికి కేటీఆర్‌ నుంచి వనమాలి బిరుదుతో కూడిన సర్టిఫికెట్లు జారీ చేసేందుకు కూడా యాప్‌ను రూపొందించారు.

నల్లగొండ ప్రతినిధి, జూలై22(నమస్తే తెలంగాణ) : రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ నిర్వహిస్తున్న గ్రీన్‌ఇండియా చాలెంచ్‌లో భాగంగా మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా ముక్కోటి వృక్షార్చనకు ఉమ్మడి జిల్లాలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. చాలెంజ్‌లో భాగంగా శనివారం ఉదయం 10గంటలకు కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఒకే రోజు, ఒకే గంటలో ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటడం ద్వారా రాష్ట్రంలో ముక్కోటి వృక్షార్చనను పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించారు. ఉమ్మడి జిల్లాలో కొద్ద్ది రోజులుగా జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కార్యక్రమాన్ని క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లి.. ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేసేందుకు పార్టీ పరంగానూ ప్రత్యేకంగా దృష్టి సారించారు. దీంతో పాటు ఇప్పటికే కొనసాగుతున్న హరితహారంలో భాగంగా జిల్లా అధికార యంత్రాంగం కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసింది. మున్సిపాలిటీ, గ్రామపంచాయతీల్లో వేర్వురుగా మొక్కలు నాటనున్నారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో 1500 మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు.

- Advertisement -

వేర్వేరుగా ప్రణాళికలు
జిల్లా అధికార యంత్రాంగం తరుఫున మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో వేర్వురుగా ముక్కోటి వృక్షార్చనకు ప్రణాళికలు సిద్ధం చేశారు. నల్లగొండ జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నల్లగొండలో ఒకేచోట 1000 మొక్కలు, చండూర్‌లో 1900, చిట్యాలలో 300, దేవరకొండలో 1000, హాలియాలో 3000, మిర్యాలగూడలో 5000, నకిరేకల్‌లో 500, నందికొండ మున్సిపాలిటీలో 500 మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించారు. స్థానిక ఎమ్మెల్యేలు భాగస్వాములై ముక్కోటి వృక్షార్చనకు శ్రీకారం చుట్టనున్నారు. దీంతో పాటు ఆయా వార్డుల వారీగా కూడా నిర్వహిస్తారు. పార్టీ పరంగానూ నాయ కులు, కార్యకర్తలు, కేటీఆర్‌ అభిమానులు ప్రత్యేకంగా మొక్కలు నాటేందుకు సిద్ధమవుతున్నారు. ప్రతి గ్రామపంచాయతీలో 1500 మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమంలో పార్టీ శ్రేణులంతా భాగస్వాములయ్యేలా ప్రోత్సహిస్తున్నారు. అధికార యం త్రాంగం కూడా మెగా పల్లెప్రకృతి వనాల్లో, రహదారుల వెంట మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది.

రోడ్ల వెంట కూడా..
సూర్యాపేట జిల్లాలో ప్రధాన రహదారుల వెంట ఒకేసారి లక్ష మొక్కలు నాటేందుకు సిద్ధం అవుతున్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ కార్యక్రమంలో 74 కిలోమీటర్ల మేర రహదారులను గుర్తించారు. జాజిరెడ్డగూడెం నుంచి తానంచర్ల వరకు నూతనంగా నిర్మించిన జాతీయ రహదారి వెంట 40 కిలోమీటర్ల మేర 56 వేల మొక్కలను నాటాలని నిర్ణయించారు. అర్వపల్లి మండలం తిమ్మాపూరం నుంచి తిరుమలగిరి వరకు 28కిలోమీటర్లు, బరాఖత్‌గూడెం నుంచి నడిగూడెం వరకు 6 కిలోమీటర్ల పరిధిలో 44వేల మొక్కలను నాటనున్నారు. దీంతో పాటు జిల్లా అంతటా ఒకేసారి మరో లక్షన్నర మొక్కలు నాటేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తంగా ముక్కోటి వృక్షార్చనలో భాగంగా సూర్యాపేట జిల్లాలో రెండున్నర లక్షల మొక్కలు నాటేలా జిల్లా అధికార యంత్రాంగం ప్రణాళిక రూపొందించినట్లు తెలిసింది. దీంతో పాటు పార్టీ పరంగానూ ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భాగస్వాములు కానున్నారు. సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌రెడ్డి ముక్కోటి వృక్షార్చనకు శ్రీకారం చుట్టనుండగా ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులంతా తమ ప్రాంతాల్లో ప్రారంభించి మొక్కలు నాటనున్నారు.

మొక్కలు నాటితే వనమాలి బిరుదు
ముక్కోటి వృక్షార్చనలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములయ్యే వారికి వనమాలి బిరుదుతో కూడిన సర్టిఫికెట్‌ ఇవ్వాలని గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ నిర్వాహకులు నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. 9000365000 నంబర్‌ను ఏర్పాటు చేశారు. ఈ నంబర్‌కు వాట్సాప్‌లో జీఐసీ అని టైప్‌ చేసి పంపితే వెంటనే యాప్‌ లింక్‌ వస్తుంది. మొక్కలు నాటిన అనంతరం సెల్ఫీ దిగి యాప్‌ లింక్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే హరితసంకల్పంలో పాలుపంచుకున్నందుకు కేటీఆర్‌ వద్ద నుంచి వనమాలి బిరుదుతో కూడిన సర్టిఫికెట్‌ను ఈ మెయిల్‌ లేదా, మొబైల్‌కు వారం రోజుల్లో పంపిస్తారు. ఈ విషయమై కొద్దిరోజులుగా సోషల్‌ మీడియాలోనూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. సమాజం పట్ల బాధ్యతతో, పర్యావరణ పరిరక్షణపై ఆసక్తితో ఎక్కువ మంది ముక్కోటి వృక్షార్చనలో భాగస్వాములు అయ్యేందుకు సిద్ధమవుతున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana