సూర్యాపేట టౌన్, జూలై 14 : స్వరాష్ట్రం సిద్ధించి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. నాటి నుంచి అన్ని రంగాల అభివృద్ధితోపాటు ప్రజలందరికీ పాలన మరింత చేరువైంది. అందులో భాగంగానే విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ప్రత్యేక చొరవతో సూర్యాపేట జిల్లా కేంద్రంగా ఏర్పడింది. అప్పటి నుంచి కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, ఇతర జిల్లా కార్యాలయాలతోపాటు సంచలనాత్మకంగా మెడికల్ కళాశాల సాధించిన విషయం తెలిసిందే. ఇలా జిల్లా ప్రజలు, రైతాంగం, విద్యార్థులకు అన్ని సౌకర్యాలు అందుబాటులోకి రాగా, తాజాగా రైతులతోపాటు వినియోగదారులకు విద్యుత్ సేవలు చేరువయ్యేలా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రత్యేక విద్యుత్ స్టోర్‌ను ఏర్పాటు చేశారు. గతంలో ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు, కండక్టర్లతోపాటు విద్యుత్ సంబంధిత పరికరాలు కావాలంటే నల్లగొండకు వెళ్లాల్సి వచ్చేది. ఇకపై అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా సూర్యాపేటలోనే లభించనున్నాయి. జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డలో ఏర్పాటు చేసిన స్టోర్‌ను విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి గురువారం ఉదయం 11.40గంటలకు ప్రారంభించనున్నట్లు విద్యుత్ ఎస్ఈ పాల్‌రాజ్ తెలిపారు.
సూర్యాపేట జిల్లాలో 4,84,596 సర్వీసులు
సూర్యాపేట జిల్లాలో ప్రస్తుతం 3,50,761 గృహ, వ్యాపార సర్వీసులు, 1,33,835 వ్యవసాయ సర్వీసులు కలిపి మొత్తం 4,84,596 కనెక్షన్లు ఉన్నాయి. అలాగే 94 సబ్ స్టేషన్లు, 232 పవర్ ట్రాన్స్ ఫార్మర్లు, 41,261 సింగిల్ ఫేజ్, త్రీ ఫేజ్ ట్రాన్స్ ఫార్మర్లు ఉన్నాయి. వీటన్నింటికి ఇకనుంచి ఎలాంటి మరమ్మతులు ఉన్నా, మార్పిడి ఉన్నా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్టోర్ అందుబాటులో ఉండడంతో అన్ని విధాలుగా ఉపయోగపడనుంది. నేటి నుంచి ప్రారంభం కానున్న స్టోర్‌లో 60 ట్రాన్స్ ఫార్మర్లు, 40 కండక్టర్లు, 30 కి.మీ కేబుల్ అందుబాటులో ఉంచారు.
నల్లగొండకు వెళ్లాల్సిన అవసరం లేదు
సూర్యాపేట జిల్లా రైతాంగానికి, వినియోగదారులకు విద్యుత్ సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విద్యుత్ స్టోర్‌ను గురువారం మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ స్టోర్ ప్రారంభంతో రైతులు, వినియోగదారులు తమకు కావాల్సిన విద్యుత్ పరికరాలను ఇక్కడే పొందవచ్చు. గతంలో ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు, కండక్టర్లతోపాటు విద్యుత్ సంబంధిత పరికరాల కోసం నల్లగొండకు వెళ్లాల్సివచ్చేది. ఇకపై ఆ అవసరం లేకుండా మంత్రి చొరవతో విద్యుత్ స్టోర్‌ను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేశారు. -సీహెచ్. పాల్‌రాజ్, ఎస్ఈ, సూర్యాపేట