e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, August 1, 2021
Home నల్గొండ వేల కుటుంబాల్లో వెలుగులు నింపిన ‘గిఫ్ట్‌ ఎ స్మైల్‌'

వేల కుటుంబాల్లో వెలుగులు నింపిన ‘గిఫ్ట్‌ ఎ స్మైల్‌’

వేల కుటుంబాల్లో వెలుగులు నింపిన ‘గిఫ్ట్‌ ఎ స్మైల్‌'
  • అత్యవసర సేవలో మంత్రి కేటీఆర్‌ బర్త్‌డే కానుకలు
  • సూర్యాపేటలో 1, నల్లగొండలో 3 అంబులెన్సులు
  • 3వేల మందికిపైగా మెడికల్‌ సర్వీస్‌ కృతజ్ఞతలు చెప్తున్న జనం

నల్లగొండ ప్రతినిధి, జూలై 18 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ గతేడాది తన జన్మదినం సందర్భంగా ఇచ్చిన పిలుపు ఎన్నో ప్రాణాలకు భరోసానిచ్చింది. జన్మదిన కానుకలకు బదులు ‘గిఫ్ట్‌ ఎ స్మెల్‌’ పేరుతో ప్రజలకు అత్యవసర సమయాల్లో ఉపయోగపడే అంబులెన్స్‌లను అందుబాటులోకి తేవాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఆయన పిలుపు మేరకు నల్లగొండ జిల్లాలో మూడు, సూర్యాపేట జిల్లాలో ఒక అంబులెన్స్‌ ప్రజలకు వైద్యసేవలు అందించేందుకు అందుబాటులోకి వచ్చాయి. హుజూర్‌నగర్‌లో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, చండూరులో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, మునుగోడులో టీఆర్‌ఎస్‌ నేత వేమిరెడ్డి నర్సింహారెడ్డి, నాంపల్లిలో కర్నాటి విద్యాసాగర్‌ అత్యాధునిక సౌకర్యాలతో కూడిన అంబులెన్స్‌లను అందజేశారు. వీటి ద్వారా ఇప్పటి వరకు 3,060 మందికి అత్యవసర సమయాల్లో అక్కడికక్కడే వైద్యసేవలు అందించి మెరుగైన వైద్యసేవల కోసం ప్రధాన ఆస్పత్రులకు తరలించారు. ఇందులో కొవిడ్‌ పేషెంట్లతో పాటు రోడ్డు, ఇతర ప్రమాదాల్లో గాయపడిన వారు, ప్రసూతి, ఆత్మహత్యాయత్నం బాధితులు ఉన్నారు. వీటి ద్వారా తక్కువ సమయంలోనే మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని రోగులు, వారి బంధువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మంత్రి కేటీఆర్‌ తన జన్మదినం సందర్భంగా గత ఏడాది వినూత్నంగా ‘గిఫ్ట్‌ ఎ స్మైల్‌’ పేరుతో ప్రజాసేవకు పిలుపునిచ్చారు. తనకు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన పార్టీ నేతలు, అభిమానులకు వ్యక్తిగత కానుకలు వద్దు… ప్రజలకు ఉపయోగపడే అంబులెన్స్‌లను బహుకరించాలని సూచించారు. కేటీఆర్‌ ఇచ్చిన పిలుపునకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనూ పలువురు ముందుకు వచ్చారు. అప్పటికే 108 వాహనాలు నల్లగొండ జిల్లాలో 18, సూర్యాపేటలో 11 అందుబాటులో ఉన్నాయి. వీటికి గిఫ్ట్‌ ఎ స్మైల్‌ పేరుతో అదనంగా మరో నాలుగు అంబులెన్స్‌లు తోడయ్యాయి. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి రూ..21లక్షల విలువ చేసే అత్యాధునిక సౌకర్యాలతో కూడిన అంబులెన్స్‌ను ఏర్పాటు చేశారు. హుజూర్‌నగర్‌ ఏరియా ఆస్పత్రి కేంద్రంగా ఈ అంబులెన్స్‌ ప్రజలకు సేవలు అందిస్తున్నది. దీని ద్వారా ఇప్పటి వరకు మొత్తం 1016 మంది పేషెంట్లను అత్యవసర సమయాల్లో దగ్గరలోని ఆస్పత్రులకు తరలించారు. వీరిలో ఎక్కువ మంది అంబులెన్స్‌లో ప్రథమ చికత్స ద్వారా ప్రాణాల నుంచి బయటపడిన వారు ఉన్నారు. ఇందులో కొవిడ్‌ సంబంధిత వైద్య సేవల కోసం 600 మంది, రోడ్డు ప్రమాద బాధితులు 100 మంది, మెడికల్‌ ఎమర్జెన్సీ కింద గర్భిణులతోపాటు ఇతర రోగులు 316 మంది ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది మెరుగైన, తక్షణ సేవలతో కోలుకున్నవారే ఉండడం విశేషం.

- Advertisement -

నల్లగొండ జిల్లాలో మూడు అంబులెన్స్‌లు అందుబాటులోకి రాగా అవన్నీ మారుమూల ప్రాంతమైన మునుగోడు నియోజకవర్గంలో పనిచేస్తున్నాయి. చండూరులో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గిఫ్ట్‌ ఎ స్మైల్‌ కింద అంబులెన్స్‌ను అందుబాటులోకి తెచ్చారు. మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా దీన్ని ప్రారంభిస్తూ చండూరు ఆస్పత్రి కేంద్రంగా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. అత్యవసర సమయాల్లో వచ్చే ప్రతీ ఫోన్‌కాల్‌కు స్పందిస్తూ వెంటనే బాధితుల వద్దకు చేరుకుంటుంది. చండూరు కేంద్రంగా ఇప్పటివరకు 1052 మందికి తక్షణ వైద్య సేవలు అందించారు. వీరిలో కొవిడ్‌ సేవలు పొందిన వారు 91మంది, రోడ్డు, ఇతర ప్రమాద బాధితులు 278 మంది, మెడికల్‌ ఎమర్జెన్సీ సేవలు పొందినవారు 709మంది ఉన్నారు. వీరంతా గతంలో ఈ అంబులెన్స్‌ అందుబాటులో లేనప్పుడు ఇబ్బందులు పడేవారు. ఇక్కడి నుంచి నల్లగొండకు తరలించాలంటే చాలా సమయం పట్టేది.

మునుగోడు కేంద్రంగా టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నేత వేమిరెడ్డి నర్సింహారెడ్డి అత్యాధునిక టెక్నాలజీతో కూడిన అంబులెన్స్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీంతో ఈ ప్రాంత ప్రజలు అత్యవసర సమయాల్లో పడే ఇబ్బందులకు చెక్‌ పడినైట్లెంది. ఈ అంబులెన్స్‌ ద్వారా 992 మందికి వైద్య సేవలు అందించగా.. అందులో కొవిడ్‌ బాధితులు 179 మంది, వివిధ ప్రమాదాల బాధితులు 210, ఎమర్జెన్సీ సేవల బాధితులు 603 మంది ఉన్నారు. ఈ ప్రాంతంలో గతంలో అత్యవసర సమయాల్లో ఆస్పత్రికి చేరాలంటే నల్లగొండ లేదా చౌటుప్పల్‌ నుంచి 108 వాహనాలు వస్తే తప్ప వేరే ఆధారం లేదు.

అత్యాధునిక సౌకర్యాలు..
గిఫ్ట్‌ ఎ స్మైల్‌ కింద అందుబాటులోకి వచ్చిన అన్ని అంబులెన్స్‌ల్లోనూ అత్యాధునిక పరికరాలతో వైద్య సేవలు అందుతున్నాయి. ఒక్కో వాహనంలో పైలట్‌తో పాటు ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌ ఉంటారు. సాధారణ వాహనాల్లో ఒకరిని మాత్రమే తరలించే అవకాశం ఉండగా.. వీటిల్లో ఒకేసారి ఇద్దరి పెషెంట్లను తరలించే ఏర్పాట్లు ఉన్నాయి. వీటిల్లో ఆక్సిజన్‌ సౌకర్యం, పురుగుల మందు తాగిన సమయంలో కీలకమైన వాక్యూం మిషన్‌ కూడా ఉంది. శ్వాసకోశ వ్యాధులకు నెబ్‌లైజేషన్‌, బొక్కలు విరిగినప్పుడు తక్షణమే అమర్చే ప్రత్యేక క్లిప్పులు, స్టీల్‌ ప్యాచ్‌లు, థర్మామీటర్‌, ఆంత్ర బ్యాగులు వంటి అనేక సౌకర్యాలు ఉన్నాయి. అత్యవసర సమయంలో ఓ వైపు ప్రాథమిక వైద్య సేవలు అందిస్తూనే పూర్తి స్థాయి సేవల కోసం దగ్గరలోని ఆస్పత్రులకు రోగులను తరలిస్తూ ప్రాణాలను నిలుపుతున్నాయి. ఒక్కో వాహనం ఖరీదు రూ.21లక్షల వరకు ఉండగా, వీటిన్నింటినీ సొంత డబ్బుతోనే నేతలు ప్రజలకు అందుబాటులోకి తేవడం విశేషం.

‘గిఫ్ట్‌ ఎ స్మైల్‌’ వినూత్న కార్యక్రమం
నాయకులు తమ జన్మదినం సందర్భంగా ప్రజలకు అత్యవసర సమయంలో ఉపయోగపడే అంబులెన్స్‌ను అందజేసే ‘గిఫ్ట్‌ ఎ స్మైల్‌’ వినూత్న కార్యక్రమం. మంత్రి కేటీఆర్‌ ముందుచూపుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘గిఫ్ట్‌ ఎ స్మైల్‌’ కింద టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు వేమిరెడ్డి నర్సింహారెడ్డి అందజేసిన అంబులెన్స్‌కు నేను డ్రైవర్‌గా పనిచేస్తున్నా. గత ఏడాది అక్టోబర్‌ నుంచి ఈ అంబులెన్స్‌ ఎంతో మందికి పునర్జన్మను ప్రసాదించింది.

  • ఎం.కోటేశ్వర్‌రావు,అంబులెన్స్‌ డ్రైవర్‌, మునుగోడు

నర్సింహారెడ్డికి రుణపడి ఉంటాం
గతంలో మా గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అక్కడే ఉన్న నేను అంబులెన్స్‌కు సమాచారమిచ్చా. నిమిషాల వ్యవధిలోనే వచ్చిన ‘108’ వాహనం క్షతగాత్రులను దవాఖానకు తీసుకెళ్లింది. అది ‘గిఫ్ట్‌ ఎ స్మైల్‌’ కార్యక్రమం ద్వారా వేమిరెడ్డి నర్సింహారెడ్డి అందజేసిన అంబులెన్స్‌ అని తెలిసింది. మునుగోడు మండలానికి అధునాతన అంబులెన్స్‌ అందజేసిన నర్సింహారెడ్డికి రుణపడి ఉంటాం.

  • ఎస్‌.రాములు,రావిగూడెం, మునుగోడు మండలం

పేదల ప్రాణాలు కాపాడటం ఆనందంగా ఉంది
మంత్రి కేటీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి గత సంవత్సరం అంబులెన్స్‌ను హుజూర్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి అందించారు. అది గత ఏడాది అక్టోబర్‌ 24 నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. పేదల ప్రాణాలు కాపాడేందుకు ఎమ్మెల్యే అందించిన వాహనం నడపటం, దాని ద్వారా ప్రజలకు సేవలు అందించడం ఆనందంగా ఉంది. హుజూర్‌నగర్‌ మండలంతోపాటు అత్యవసర సమయంలో నియోజకవర్గంలోని ఇతర ప్రాంతాలకు కూడా సేవలు అందించేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాం.

  • మధుసూదన్‌, అంబులెన్స్‌ డ్రైవర్‌, హుజూర్‌నగర్‌
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వేల కుటుంబాల్లో వెలుగులు నింపిన ‘గిఫ్ట్‌ ఎ స్మైల్‌'
వేల కుటుంబాల్లో వెలుగులు నింపిన ‘గిఫ్ట్‌ ఎ స్మైల్‌'
వేల కుటుంబాల్లో వెలుగులు నింపిన ‘గిఫ్ట్‌ ఎ స్మైల్‌'

ట్రెండింగ్‌

Advertisement