e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, August 1, 2021
Home నల్గొండ గజం రూ.23,500

గజం రూ.23,500

గజం రూ.23,500


నీలగిరి, జూలై 20 : జిల్లాలో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. తెలంగాణ రాష్ట్రం అవిర్భావం తరువాత తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ధరలను సవరించింది. పల్లెల్లో, పట్టణాల్లో ఓపెన్‌ ప్లాట్ల ధరలను కూడా మార్కెట్‌ విలువ ప్రకారంగా 30 నుంచి 50శాతం వరకు పెంచింది. గ్రామీణా ప్రాంతాల్లో సగటుగా రూ.200కు గజం ధర తగ్గకుండా పెరిగాయి. జిల్లాలో ఓపెన్‌ ప్లాట్లకు అత్యధికంగా మిర్యాలగూడ, నల్లగొండ పట్టణాల్లో 18వేలు ఉన్న గజం ధర 23,500కు పెరిగింది. అపార్ట్‌మెంట్లలో చదరపు అడుగుల ఆధారంగా సగటున వెయ్యి రూపాయలకు తగ్గకుండా 2200వరకు పెరిగింది. నల్లగొండ జిల్లా కేంద్రంలో అత్యధికంగా 2వేలు కాగా మిర్యాలగూడ పట్టణంలో 2200 వరకు పెరిగింది. పెరిగిన ధరలు గురువారం నుంచి ఉమ్మడి జిల్లాలోని 15 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అమలు కానున్నాయి.

వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులు, భూముల విలువలు, రిజిస్ట్రేషన్‌ రుసుంలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1958 చట్టం ప్రకారం భూముల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరువాత భూమలు ధరలు పెంపు, సవరణ జరుగలేదు. రిజిస్ట్రేషన్‌ చార్జీలు కూడా యథావిధిగా ఉన్నాయి. కానీ బహిరంగ మార్కెట్‌లో భూముల విలువలు బాగా పెరిగాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ప్రజలపై భారం పడకుండా పట్టణాలు, నగరాల వారీగా భూమలు విలువలు పెంచినట్లు సమాచారం. ఏడేండ్లలో తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం భూముల విలువను సవరించింది. భూములు, ఇండ్ల ప్లాట్లు, ప్లాట్ల క్రయవిక్రయాలపై ప్రస్తుతం డ్యూటీ 4శాతం ఉండగా ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ 1.5 రిజిస్ట్రేషన్‌ ఫీజు 0.5 శాతంగా ఉంది. మొత్తం 6శాతం రిజిస్ట్రేషన్‌ చార్జీలను చెల్లిస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని 15 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో పెరిగిన ఫీజుల ప్రకారం రిజిస్ట్రేషన్లు జరుగనున్నాయి.

- Advertisement -

వ్యవసాయేత భూములు ఇలా..
వ్యవసాయేతర భూముల మార్కెట్‌ విలువలను కూడా మూడు పద్ధతుల్లో పెంచారు. అత్యధికంగా రిజిస్ట్రేషన్ల అయిన ప్రాంతాల్లో 50శాతం, మిగతా ప్రాంతాల్లో 30, 40 శాతం పెంచారు. అన్ని రెవెన్యూ గ్రామాల్లో గజం ధర 100 నుంచి 150 ఉన్నదాన్ని 200లకు పెంచగా 200నుంచి 1000 వరకు ఉన్నదాన్ని 50శాతం పెంచారు. 1001 నుంచి 5వేల వరకు ఉన్న రేట్లను 30శాతం, 5వేల పైచిలుకు ఉన్న దానిపై 20శాతం పెంచారు. 50వేల జనాభా ఉన్న మండల కేంద్రాలు, మున్సిపాలిటిల్లో, 50వేల నుంచి లక్ష జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో గజం 200 ఉండగా దాన్ని 300లకు, 201 నుంచి రూ.1000 ఉంటే 50శాతం అదనంగా పెంచారు. 1001నుంచి 5వేల వరకు 40శాతం, 5వేల పైబడిన 30శాతం ధరలు పెంచారు. అదేవిధంగా పెద్ద గ్రామ పంచాయతీలతోపాటు మున్సిపాలిటీల్లో లక్ష జనాభా ఉంటే ప్లాట్లు, అపార్ట్‌మెంట్‌లపై ఎస్‌ఎఫ్‌టీ విలువర 800 ఉన్న దాన్ని 1000 రూపాయలకు, 900 నుంచి 1200, 1000 నుంచి 1300, 1100 నుంచి 1400, 1400 ఉంటే 1800, 1500 ఉంటే 2వేలు, 1600 ఉంటే 2200 రుపాయలకు పెంచారు.

అత్యధికంగా మిర్యాలగూడ, నల్లగొండలో..
జిల్లాలోని 847గ్రామ పంచాయతీలు, ఎనిమిది మున్సిపాలిటీలుండగా మిర్యాలగూడతోపాటు, నల్లగొండ జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో అత్యధికంగా రేట్లు పెరిగాయి. నల్లగొండ, మిర్యాలగూడ పట్టణాల్లోని విలీనమైన గ్రామాల్లో రేట్ల తక్కువగా ఉన్నప్పటికీ నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఆరు ప్రాంతాల్లో, మిర్యాలగూడ పట్టణంలోని ఎనిమిది ప్రాంతాల్లో 18వేలు ఉన్న గజం 23,500లకు పెరిగింది. మిర్యాలగూడలో అత్యల్పంగా 1000 నుంచి రూ.1500, నల్లగొండలో అత్యల్పంగా 700 నుంచి రూ.1250లకు పెరిగింది.

వ్యవసాయ భూముల ధరలు..
జిల్లాలో గతంలో రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల పరిధిలోనే వ్యవసాయ భూమలు రిజిస్ట్రేషన్లు జరిగేవి. తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చిన తరువాత వ్యవసాయ భూముల బాధ్యతలను తాసీల్దార్లకు అప్పగించింది. సంవత్సర కాలంగా వ్యవసాయ భూములను తాసీల్దారులే రిజిస్ట్రేషన్లతోపాటు మ్యుటేషన్‌లను చేస్తున్నారు. నల్లగొండ జిల్లాలో ప్రస్తుతం లక్ష రూపాయల వరకు ఎకరం ఉన్న భూమిని కనిష్టంగా 1.5లక్షల రూపాయలకు పెంచింది. లక్షకు పైబడిన ప్రతి ఎకరాకూ 50శాతం చొప్పున రేట్లను పెంచింది.

సూర్యాపేటలో ఓపెన్‌ ప్లాట్‌ గజం 22,500

అపార్ట్‌మెంట్‌ చదరపు అడుగుకు రూ.15 వేలు

ఓపెన్‌ ప్లాట్లు, వ్యవసాయ భూముల ధరలను ఆయా ప్రాంతాలను బట్టి 30, 40, 50 శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో సూర్యాపేటలో అత్యల్పంగా 200 ఉన్న ఓపెన్‌ ప్లాట్‌ ధర గజం ఒక్కంటికి 50శాతం పెరుగగా 300కు చేరింది. అత్యధికంగా రూ.19,500 నుంచి రూ.22,500కు పెరిగింది. ఇదే స్థాయిలో పట్టణాలు, మండలాల్లో ధరల పెంపు ఉంది. వ్యవసాయ భూములు కనిష్ఠంగా ఎకరానికి రూ.1.50 లక్షలు ఉండగా.. అత్యధికంగా సూర్యాపేట జిల్లా కేంద్రం సమీపంలోని కుడకుడలో రూ.33.88లక్షలుగా ఉంది. స్టాంప్‌ డ్యూటీ ఇప్పటి వరకు 6శాతం ఉండగా, 7.5శాతానికి చేరింది.

వ్యవసాయ భూముల విలువలను అత్యధికంగా 50 శాతం వరకు పెంచగా.. అభివృద్ధి చెందని వ్యవసాయ భూముల విలువను 40 శాతం వరకు పెంచారు. 30 నుంచి 50శాతం రిజిస్ట్రేషన్‌ ధరలు పెంచినప్పటికీ ఓపెన్‌ మార్కెట్‌ విలువకు ఊహించనంత స్థాయిలో తేడా ఉంది. పట్టణాలు, మండల కేంద్రాల్లో ఎకరం ధర రూ.కోట్లల్లో ఉండగా వ్యవసాయ భూములు రూ.20లక్షలకు తక్కువ దొరికే పరిస్థితి లేదు. అలాగే వ్యవసాయేతర భూములు, ఇళ్లు, ఓపెన్‌ ప్లాట్లు, అపార్ట్‌మెంట్‌ ధరలను గజం, చదరపు అడుగుకు 30 నుంచి 50 శాతం వరకు పెంచారు. అపార్ట్‌మెంట్లు తక్కువలో తక్కువగా చదరపు అడుగు ఒక్కంటికి రూ.1000 ఉండగా అత్యధికంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో రూ.15వేల వరకు ఉంది.

2013లో అప్పటి ప్రభుత్వం భూములు, ఓపెన్‌ ప్లాట్ల ధరలు పెంచింది. ప్రతి రెండేండ్లకోసారి ధరలు పెంచుకునే అవకాశం ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఎనిమిదేండ్ల తర్వాత అమలు చేసింది.

పెరిగిన ధరల ప్రకారం రేపటి నుంచి రిజిస్ట్రేషన్లు
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారమే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రిజిస్ట్రేషన్లు జరుగనున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరువాత తొలిసారిగా రేట్లను పెంచింది. పెరిగిన ధరల ప్రకారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 15 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో గురువారం నుంచి రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి.

  • బి.ప్రవీణ్‌కుమార్‌, జిల్లా రిజిస్ట్రార్‌, నల్లగొండ
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
గజం రూ.23,500
గజం రూ.23,500
గజం రూ.23,500

ట్రెండింగ్‌

Advertisement