e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 25, 2021
Home నల్గొండ కచలాపురం.. కష్టాలన్నీ దూరం

కచలాపురం.. కష్టాలన్నీ దూరం

  • పల్లె ప్రగతితో సమస్యలు పరిష్కారం
  • మెరుగుపడ్డ మౌలిక వసతులు
  • వైకుంఠ ధామంతో సజావుగా అంతిమయాత్ర

మునుగోడు, జూలై 25:విస్తీర్ణం, జనాభా పరంగానూ చిన్నదైన ఆ గ్రామం ఏనాడూ అభివృద్ధికి నోచుకోలేదు. పాలకవర్గాలు మారినా, లక్షలాది నిధులు ఖర్చయినా ఆ ఊరి రాత మారలేదు. దశాబ్దాలుగా తీరని సమస్యలకు కేసీఆర్‌ సర్కారు అమలు చేసిన పల్లె ప్రగతి ద్వారా పరిష్కారం దొరికింది. మౌలిక వసతులు మెరుగుపడ్డాయి. ఏండ్ల తరబడి గ్రామస్తులంతాఎదురుచూస్తున్న వైకుంఠ ధామం నిర్మాణం పూర్తయ్యింది. వెరసి మునుగోడు మండలం కచలాపురం కష్టాలన్నీ దూరమయ్యాయి.

కచలాపురం జనాభా 679. సుమారు 180కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటున్నాయి. మండల కేంద్రానికి కేవలం 5కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం గతంలో సరైన మౌలిక వసతులకు నోచుకోలేదు. శ్మశాన వాటిక లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. 50ఏండ్ల కిందట ఉన్న కాష్టాల గడ్డ కాస్తా గత ప్రభుత్వాలు ఇండ్ల స్థలాలకు కేటాయించడంతో కనుమరుగైంది. దీంతో వేరే స్థలంలో అంతిమ సంస్కారాలు నిర్వహించేవారు. అది కూడా క్రమంగా ఆక్రమణకు గురైంది. తెలంగాణ సర్కారు గతేడాది చేపట్టిన పల్లె ప్రగతి ద్వారా సర్వే నంబర్‌ 23లో రూ.12.6లక్షలతో వైకుంఠధామాన్ని నిర్మించారు. మొత్తం ఎకరం విస్తీర్ణంలో సకల వసతులతో కూడిన వైకుంఠధామం అందుబాటులోకి రావడంతో గ్రామస్తుల కష్టాలు తీరాయి.

- Advertisement -

వెల్లివిరిసిన పచ్చదనం..
గ్రామంలోని సర్వే నంబర్‌ 23లో అరెకరం విస్తీర్ణంలో రూ.1.5లక్షలతో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. 15రకాలకు చెందిన 2,500 మొక్కలు నాటారు. మరో ఎకరం విస్తీర్ణంలో ప్రత్యేకంగా 1,330 సీతాఫలం మొక్కలను పెంచుతున్నారు. ఎవెన్యూ ప్లాంటేషన్‌ కింద గ్రామంలో ప్రధాన రహదారి వెంట నాటిన మొక్కల సంరక్షణకు రూ.52వేలతో 400ట్రీగార్డులు ఏర్పాటు చేశారు. గ్రామ కో-ఆప్షన్‌ సభ్యుడు అందించిన రూ.39వేలతో 300మొక్కలకు ట్రీగార్డులు అమర్చారు. మొక్కల పెంపకం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నర్సరీలో 11వేల మొక్కలను సిద్ధం చేస్తున్నారు. గతేడాది 3వేల మొక్కలను గ్రామస్తులకు పంపిణీ చేశారు. పల్లె ప్రకృతి వనం, ఎవెన్యూ ప్లాంటేషన్‌ మొక్కలతో గ్రామంలో పచ్చదనం వెల్లివిరిసింది.

ట్రాక్టర్‌ ద్వారా చెత్త సేకరణ…
రూ.8.5లక్షలతో ట్రాక్టర్‌, ట్రాలీ, ట్యాంకర్‌ను కొనుగోలు చేసి ఇంటింటికీ తిరిగి చెత్త సేకరణ చేస్తున్నారు. రూ.2.5లక్షలతో నిర్మించిన కంపోస్టుషెడ్డులో చెత్తతో సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నారు. వీధుల్లో పరిశుభ్రత కోసం రూ.40వేలతో బ్లీచింగ్‌ పౌడర్‌, సోడియం హైపోక్లోరైట్‌ పిచికారీ చేస్తున్నారు. 8పాత విద్యుత్‌ స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసి లూజ్‌ వైర్లకు మరమ్మతులు చేశారు.

ఊరు రూపురేఖలు మారాయి…
రాష్ట్ర సర్కారు అమలు చేసిన పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామం రూపురేఖలు మారాయి. కచలాపురంలో సుదీర్ఘ కాలంగా ఉన్న సమస్యలను గ్రామసభ ద్వారా గుర్తించాం. ప్రభుత్వం అందించిన, పంచాయతీలో అందుబాటులో ఉన్న నిధులతో వాటిని పరిష్కరించుకున్నాం. గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యమిచ్చాం. ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు మా వంతు కృషి చేస్తా.

  • ఎస్‌.ఆర్‌.వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి

ప్రభుత్వ కృషి అభినందనీయం…
శ్మశాన వాటిక లేక తీవ్ర ఇబ్బందులు పడ్డాం. ఎవరైనా చనిపోయినపుడు సొంత జాగలో అంత్యక్రియలు చేసుకునేవారు. జాగ లేనివారు ఆర్‌అండ్‌బీ రోడ్డు పక్కనే శవాన్ని పూడ్చి పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా వైకుంఠ ధామాన్ని ఏర్పాటు చేయడంతో ఏండ్ల నాటి సమస్యకు పరిష్కారం లభించింది. గ్రామాల్లో మౌలిక వసతులు మెరుగుపర్చేందుకు ‘పల్లె ప్రగతి’ కార్యక్రమాన్ని అమలుచేసిన ప్రభుత్వ కృషి అభినందనీయం.

  • గురిజ అరుణ, సర్పంచ్‌, కచలాపురం
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana