e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, August 6, 2021
Home నల్గొండ ఏడాదంతా జల సవ్వడి

ఏడాదంతా జల సవ్వడి

ఏడాదంతా జల సవ్వడి

అటవీ శాతం తక్కువ ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఏటా లోటు వర్షపాతమే నమోదయ్యేది. ప్రాజెక్టుల్లో నీటి కేటాయింపులు సరిగ్గా వినియోగించకపోవడంతో ఆయకట్టు ప్రాంతం సైతం తడారిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఏర్పాటు అనంతరం 2014నుంచి మూడేండ్ల పాటు నీటి వాటాను నిక్కచ్చిగా వినియోగించుకోగా.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన హరితహారంతో అటవీ శాతం పెరిగింది. ఈ ఆరున్నరేండ్లలో జిల్లా వ్యాప్తంగా 12కోట్ల మొక్కలు నాటుకున్నాయి. గడిచిన మూడేండ్లుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అదనపు వర్షపాతం నమోదవుతున్నది. 2018-19లో 18శాతం, 2019-20లో 26శాతం, 2020-21లో 31శాతం, ఈ ఏడాది ఇప్పటికే 60శాతం అదనపు వర్షపాతం నమోదైంది.

నల్లగొండ, జులై 16 : కురిసిన ప్రతి వర్షపు నీటి బొట్టునూ సద్వినియోగం చేయడంలో సర్కారు ప్రయత్నాలు ఫలించాయి. మిషన్‌ కాకతీయ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4,160 చెరువులను పునరుద్ధరించారు. పూడిక తీయడం తో పాటు కట్టలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం రూ.722 కోట్లు ఖర్చు చేసింది. మరోవైపు సాగర్‌ ప్రాజెక్టుతో పాటు ఏఎమ్మార్పీ, మూసీ, కాళేశ్వరం, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టుల ఆధునీకరణతో నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది.

- Advertisement -

ఆరంభంలోనే అలుగు..
ఇప్పటికే ఇటీవల కురిసిన వర్షాలతో చెరువులు మత్తడి దుంకుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4,160చెరువులుండగా ఇందులో ఇప్పటి వరకు 61చెరువులు మత్తడి దుంకగా… మరో 605 చెరువుల్లోకి 75శాతం నుంచి వంద శాతానికి నీరు చేరింది. మూసీనది పరవళ్లు తొక్కుతుండడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వందలాది చెరువులు నిండుకుండల్లా మారాయి. చెరువుల పరిధిలో 1.18లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నది. మూడేండ్లుగా వానకాలం, యాసంగి సీజన్లలో పంటలు పండిస్తున్నారు. వర్షాలకు తోడు ప్రాజెక్టుల ద్వారా నీటిని విడుదల చేస్తుండడంతో రెండు పంటలకు ఢోకా లేకుండాపోయింది.

భూగర్భ జలాలకు కొదువే లేదు..
జిల్లా వ్యాప్తంగా భూగర్భ నీటి మట్టం ఆశాజనకంగానే కొనసాగుతున్నది. వేసవిలోనూ కరువు ఛాయలు కనిపించకపోవడం గణనీయమైన మార్పునకు అద్దం పడుతున్నది. గతంలో 200నుంచి 300ఫీట్ల లోతు వరకు బోరు వేసినా చుక్కనీరు పడని పరిస్థితి. కానీ, మూడేండ్లుగా భూగర్భ జలాలు సగటును 15మీటర్ల లోపే అందుతున్నాయి. దేవరకొండ ప్రాంతంలోనూ నేడు 7.12 మీటర్లలోనే భూగర్భ జలాలున్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. గతేడాది జూలైలో 11.23 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉండగా ఈ ఏడాది 7.68 మీటర్ల లోతులోనే ఉన్నాయి.

మిషన్‌ కాకతీయ ఫలితాలు
రెండ్రోజులపాటు కురిసిన భారీ వర్షాలకు చెరువులు ఉప్పొంగుతున్నాయి. మత్తడి దుంకుతూ జల సరాగాలు వినిపిస్తున్నాయి. కానీ, ఏ ఒక్క చెరువు కట్ట కూడా తెగిపోలేదు. మిషన్‌ కాకతీయలో భాగంగా పూడిక తీసి కట్టలను బలోపేతం చేసిన ఫలితమే ఇది.

కృష్ణా, గోదావరి పరవళ్లు
ప్రాజెక్టుల పరిధిలో ఏడాది పొడవునా నీరు విడుదలవుతున్నది. నాగార్జునసాగర్‌, మూసీ, ఎస్సారెస్పీ పరిధిలోని అన్ని కాల్వల్లో కృష్ణా, గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. వాటి పరిధిలోని చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి.

పాతాళం నుంచి పైపైకి..
గతంలో వేసవిలో చెరువులు ఎండిపోయి నెర్రెలు బారేవి. బోర్లు అడుగంటేవి. తాగునీటికీ కటకటే. కానీ, మూడేండ్లుగా అదనపు వర్షపాతం నమోదవుతున్నది. భూగర్భ జలాలు పైపైకి ఉబికి వస్తున్నాయి. సగటును 5మీటర్లలోతులోనే నీళ్లు అందుతున్నాయి.
పచ్చ తోరణం
తెలంగాణకు పచ్చలహారం.. హరితహారం అద్భుత ఫలితాలను నమోదు
చేస్తున్నది. అటవీ శాతం పెరగడంతో
పచ్చదనం కనువిందు చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి తోడు ప్రజల్లో పెరిగిన అవగాహన ఫలితమే ఇది.

నీటి నిల్వలకు దోహదపడిన అంశాలు..
హరితహారంలో కోట్లాది మొక్కలు నాటుకుని పచ్చదనం, అటవీ శాతం పెరిగింది.
మూడేండ్లుగా అదనపు వర్షపాతం నమోదవుతున్నది.
మిషన్‌ కాకతీయ కార్యక్రమంలో చెరువులు పునరుద్ధరించారు.
ప్రతి చెరువునూ ప్రాజెక్టుల ద్వారా నింపేలా కాల్వలకు అనుసంధానం చేశారు.
ఉపాధి హామీ పథకం ద్వారా మైనర్ల పూడిక తీయిస్తున్నారు.

మత్స్యశాఖ సన్నాహాలు..
ఏటా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 50శాతానికి పైగా చెరువుల్లో నీలివిప్లవం పథకం కింద మత్స్యశాఖ యంత్రాంగం చేపపిల్లలను విడుదల చేస్తుంది. ప్రస్తుతం చెరువుల్లో నీటి నిల్వలు క్రమంగా పెరగుతుండడంతో ఆ శాఖ యంత్రాంగం చేపపిల్లల విడుదలపై దృష్టి సారించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.7.25కోట్లు వెచ్చిస్తున్నది. జిల్లా మొత్తంగా తొమ్మిది కోట్ల చేప పిల్లలను వదులుతున్నారు.

రెండ్రోజుల్లో వరద పెరిగింది
జిల్లాలో ఇప్పటికే చాలా చెరువుల్లో నీరు ఉన్నప్పటికీ రెండ్రోజులుగా కురిసిన వర్షాలతో అలుగుపోస్తున్నాయి. ఏఎమ్మార్పీ కాల్వలకు ఏడాది పొడవునా నీటిని విడుదల చేస్తుండడంతో దాదాపుగా అన్ని చెరువుల్లో నీళ్లున్నాయి. మిషన్‌ కాకతీయ కార్యక్రమంలో అన్ని చెరువులను పూడిక తీయించి బలోపేతం చేయడంతో నీటి వృథాకు అడ్డుకట్ట పడింది.

  • శ్రీకాంత్‌రావు, సీఈ ఇరిగేషన్‌ సర్కిల్‌, నల్లగొండ

ఆరు గేట్ల ద్వారా మూసీ నీటి విడుదల
మూసీ ప్రాజెక్టు ఆరు గేట్ల ద్వారా శుక్రవారం నీటి విడుదల కొనసాగింది. గురువారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఉధృతంగా వచ్చిన ఇన్‌ఫ్లో క్రమేపీ తగ్గుముఖం పట్టింది. దీంతో ఆరు గేట్లను 6అడుగుల మేర ఎత్తి నీటిని వదిలేస్తున్నారు. 13,469 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా అంతే మొత్తంలో దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645అడుగులు(4.46 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 639 అడుగులు(2.99 టీఎంసీలు) ఉన్నట్లు ఏఈ ఉదయ్‌ వెల్లడించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఏడాదంతా జల సవ్వడి
ఏడాదంతా జల సవ్వడి
ఏడాదంతా జల సవ్వడి

ట్రెండింగ్‌

Advertisement