e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 27, 2021
Home నల్గొండ ఆపన్నులకు తారక రాముడై..

ఆపన్నులకు తారక రాముడై..

  • స్వామి సొంతింటి కల నెరవేరుతున్నది
  • కష్టాల కడలిని దాటిస్తున్న మంత్రి కేటీఆర్‌
  • విన్నపం ఏ రూపంలో వెళ్లినా క్షణాల్లో పరిష్కారం
  • ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురి జీవితాల్లో కొత్త వెలుగులు
  • ఫ్లోరైడ్‌ బాధితుడి దీనస్థితికి చలించిన మంత్రి కేటీఆర్‌
  • గతంలోనే హెయిర్‌ కటింగ్‌ సెలూన్‌కు రూ.4లక్షలు అందజేత
  • ఇంటి నిర్మాణానికి రూ.5.4 లక్షల చెక్కు అందించిన కలెక్టర్‌
  • ఇంటి నిర్మాణ బాధ్యతలు తీసుకున్న టీఆర్‌ఎస్‌ నేత విద్యాసాగర్‌

మర్రిగూడ, జూలై 23 : ఫ్లోరైడ్‌ బాధితుడు, ఫ్లోరోసిస్‌ విముక్తి పోరాట సమితి నాయకుడు అంశల స్వామికి మంత్రి కేటీఆర్‌ అండగా నిలిచారు. స్వామి జీవనోపాధి కోసం గతంలోనే హెయిర్‌ కటింగ్‌ సెలూన్‌కు రూ.4లక్షలు అందించిన కేటీఆర్‌.. డబుల్‌ బెడ్రూం ఇంటి నిర్మాణానికి సైతం కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటి రూ.5.4లక్షల చెక్కును స్వామికి అందించారు. మంత్రి జన్మదినం సందర్భంగా చేపట్టిన గిఫ్ట్‌ ఎ స్మైల్‌లో భాగంగా స్వామి ఇంటి నిర్మాణానికి సహాయం చేస్తానని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు కర్నాటి విద్యాసాగర్‌ ముందుకు వచ్చారు.

కాళ్లు, చేతులు వంకర్లు పోయి జీవనోపాధిలేక తాను పడుతున్న ఇబ్బందులను తెలియజేస్తూ 2019సంవత్సరంలో వాట్సప్‌ మెస్సేజ్‌ ద్వారా మంత్రి కేటీఆర్‌కు స్వామి విన్నవించుకున్నాడు. దాంతో స్పందించిన మంత్రి కేటీఆర్‌ అప్పటి కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ ఆధ్వర్యంలో రూ.4.20లక్షలతో స్వామికి హెయిర్‌ కటింగ్‌ సెలూన్‌ నిర్మించి ఇచ్చాడు. తిరిగి ఈ ఏడాది జనవరి 29న స్వామికి డబుల్‌ బెడ్రూం ఇంటిని నిర్మించాలని రాష్ట్ర నాయకుడు కర్నాటి విద్యాసాగర్‌ ముందుకురాగా ప్రభుత్వం తరఫున రూ.5.4లక్షలు అందించారు. ఫ్లోరోసిస్‌ విముక్తి పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్‌ కంచుకట్ల సుభాశ్‌ స్వామి ఇంటి పనులను దగ్గరుండి చూసుకుంటున్నాడు. 1000చదరపు అడుగుల విస్తీర్ణంలో చేపట్టిన డబుల్‌బెడ్రూం ఇల్లు నిర్మాణం స్లాబ్‌ పూర్తయ్యింది. అతి త్వరలో స్వామి సొంతింటి కల నెరవేరనుంది.

- Advertisement -

అనాథ చిన్నారులకు ఆపన్న హస్తం
తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు చిన్నారులకు మంత్రి కేటీఆర్‌ అండగా నిలిచారు. ట్విట్టర్‌ పోస్టు ద్వారా విషయం తెలిసిన వెంటనే స్పందించి వారికి ప్రభుత్వ పరంగా ప్రతి నెలా ఆర్థిక సాయంతోపాటు నిత్యావసర సరుకులను అందిస్తూ మానవత్వాన్ని చాటుకున్నారు. నిడమనూరు మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన చిలుకల వెంకన్న తొమ్మిది నెలల కిందట విద్యుదాఘాతంతో మృతి చెందగా రెండు నెలల కిందట తల్లి స్వప్న కరోనాతో కన్నుమూసింది. దీంతో ఒంటరివాళ్లయిన వారి కూతురు నేహా(4), కుమారుడు వర్షిత్‌(2) బంధువుల ఇంట్లో గడుపుతున్నారు. ఇద్దరు చిన్నారుల దీనస్థితిపై ట్విట్టర్‌ ద్వారా సమాచారం అందుకున్న మంత్రి కేటీఆర్‌ వెంటనే స్పందించారు. చిన్నారులను సంరక్షణ కేంద్రంలో చేర్పించాల్సిందిగా ఐసీడీఎస్‌ అధికారులను ఆదేశించారు. కరోనా సమయంలో నాయినమ్మ సంరక్షణలో ఉన్న చిన్నారులకు నిత్యావసర సరుకులు అందించారు. ఆ ఇద్దరి సంరక్షణకు ప్రతి నెలా రూ.4వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారు. మంత్రి కేటీఆర్‌ మానవతా దృక్పథంతో స్పందించడంపై చిన్నారుల బంధువులు ఆనందం వ్యక్తం చేసుత్న్నారు. చిన్నారులకు గురుకుల పాఠశాలల్లో ప్రవేశం కల్పించాలని కోరుతున్నారు.

కేటీఆర్‌ సారుకు రుణపడి ఉంటా..
సొంతిల్లు లేక సరంపేటలోని ఆశ్రమంలో ఉంటున్నా. జనవరి నెలలో మంత్రి కేటీఆర్‌ సారును ప్రగతి భవన్‌లో కలిసినపుడు నా పరిస్థితిని తెలుసుకొని డబుల్‌ బెడ్రూం ఇంటిని నిర్మించాలని కలెక్టర్‌కు, విద్యాసాగర్‌ సార్‌కు చెప్పిండు. వెంటనే కలెక్టర్‌ గారు పిలిపించి 5లక్షల 4వేల రూపాయల చెక్కు ఇచ్చిండు. ఇల్లు నిర్మాణం జరుగుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. గతంలో కూడా వాట్సాప్‌ మెసేజ్‌కు స్పందించి కటింగ్‌ షాపును ఏర్పాటు చేయించారు. కేటీఆర్‌ సార్‌ మంచి మనసుకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటా.

  • అంశల స్వామి, ఫ్లోరోసిస్‌ విముక్తి పోరాట సమితి ఉద్యమకారుడు

ఆపదలో అండగా..
భర్తను కోల్పోయి ముగ్గురు కూతుళ్లతో జీవనం సాగిస్తున్న ఓ ఆడబిడ్డకు మంత్రి కేసీఆర్‌ అండగా నిలిచారు. తుంగతుర్తి నియోజకవర్గం జాజిరెడ్డిగూడెం మండలం రామన్నగూడెం ఆవాసం చాకలిగూడేనికి చెందిన దర్శనం సతీశ్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. సతీశ్‌కు భార్య శిల్ప, ముగ్గురు ఆడపిల్లలున్నారు. ఇంటి పెద్ద దిక్కు కోల్పోయిన శిల్ప తమ దయనీయ పరిస్థితిని వివరిస్తూ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌ చేయించారు. దీంతో మంత్రి కేటీఆర్‌.. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌ను ట్యాగ్‌ చేస్తూ రీ ట్వీట్‌ చేయడంతో ఎమ్మెల్యే జూన్‌ 11న శిల్ప ఇంటికి వెళ్లి ముగ్గురు చిన్నారులు అక్షిత, లాస్య, బేబీ పేరిట బ్యాంకు ఖాతా తీయించి రూ.1.5లక్షలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయించారు. మరో రూ.50వేలను శిల్పకు అందించారు. ఔట్‌ సోర్సింగ్‌ ద్వారా ఉద్యోగ అవకాశం కల్పించడంతో పాటు చిన్నారులకు ఉచిత విద్య, డబుల్‌ బెడ్రూం ఇల్లు అందిస్తామని హామీ ఇచ్చారు.

మా జీవితంలో వెలుగులు నిండాయి
భర్తను కోల్పోయి ముగ్గురు ఆడపిల్లలతో జీవితం గడుపుతున్న నాకు మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ ద్వారా ఎమ్మెల్యే కిషోర్‌ సార్‌ అందించిన సాయం కొండంత భరోసా కల్పించింది. ఆ భరోసాతో అత్తగారింటి వద్దే ఉంటూ ధైర్యంగా బతుకుతున్నాను. ముగ్గురు ఆడపిల్లలకు 50వేల చొప్పున బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశాను. మరో 50 రూపాయలతోని కుటుంబాన్ని గడుపుతున్నాను. తండ్రి లేని లోటు లేకుండా నా ముగ్గురు కూతుళ్లకు చదువు నేర్పిస్తా. నన్ను, నా పిల్లలను ఆదుకున్న మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్యే కిశోర్‌కుమార్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం.

  • దర్శనం శిల్ప, లబ్ధిదారులు
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana