e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home నాగర్ కర్నూల్ వ్యవసాయంలో నూతన విప్లవాన్ని సృష్టిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు

వ్యవసాయంలో నూతన విప్లవాన్ని సృష్టిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు

వ్యవసాయంలో నూతన విప్లవాన్ని సృష్టిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు

కల్వకుర్తి రూరల్‌, ఏప్రిల్‌ 28: ఆయన సాదాసీదా వ్యవసాయ కుటుంబానికి చెందిన వ్యక్తి.. ఆలోచనలు, అభిరుచులు విభిన్నంగా ఉండడంతో వ్యవసాయంలో నూతన విప్లవాన్ని సృష్టిస్తున్నాడు.. అందరిలా సాధారణ వ్యవసాయం చేయకుండా ఓ యజ్ఞంలా.. కొత్తదనం ఉట్టిపడేలా సాగు చేస్తున్నాడు. వృత్తిరీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. ప్రవృత్తి వ్యవసాయ రైతు. కల్వకుర్తి మండలం రఘుపతిపేటకు చెందిన అనంత ప్రవీణ్‌కుమార్‌రెడ్డి వంగూరు మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా సేవలందిస్తున్నారు. చిన్నప్పటి నుంచి తన తండ్రితో కలిసి పొలంలో తిరగడంతో వ్యవసాయంపై ఆసక్తి పెరిగింది. తన 28ఎకరాల్లో 12ఎకరాల్లో వరిసాగు చేస్తున్నాడు. శాస్త్రవేత్తలు నూతనంగా కనిపెట్టిన వంగడాలతో అత్యధిక దిగుబడి సాధించి అందరినీ అబ్బురపరిచారు. మిగిలిన 12ఎకరాల్లో మామిడి సాగు చేశాడు. దేశంలోని ఆయా రాష్ర్టాల్లో ప్రఖ్యాతి గాంచిన మామిడి పండ్ల రకాల మొక్కలను సాగు చేశాడు. మామిడి తోటకు 13ఏండ్లుగా డ్రిప్‌ ద్వారా నీటిని అందించడంతోపాటుగా సమయానికి ఎరువులు అందిస్తూ పంటలకు తెగుళ్లు రాకుండా చర్యలు తీసుకోవడంతో దిగుబడి బాగుందని తెలిపారు. ఈ ఏడాది దాదాపు 80క్వింటాళ్ల మామిడి పండ్లు కాయడంతో మంచి ఆదాయం సమకూరనున్నట్లు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.

12ఎకరాల్లో మామిడి సాగు
ప్రవీణ్‌కుమార్‌రెడ్డి చేసే వ్యవసాయంలో వైవిధ్యం ఉంటుంది. అందరిలా కాకుండా వినూత్నంగా చేయడం ఆయన ప్రత్యేకత. తన మామిడి క్షేత్రంలో ఏకంగా 18రకాల మామిడి చెట్లను సాగు చేశారు. బొబ్బిలి పునాస, బేనీసా(బంగినపల్లి), మల్లిక రకం, దశేరి, నీలం, చిన్నరసం, తెల్లగులాబీ, పెద్దరసాలు, అమ్రపాలి, తోతాపూరి, హిమాయత్‌, కేసరి, జలాల్‌, వనరాజా, మంజీరా, మైమూదా, ఫజిలి ఇలా పలు రకాల చెట్లను సాగు చేశారు. మామిడి చెట్లకు ఈదురుగాలుల నుంచి పూత, కాయలు రాలిపోకుండా ఉండేందుకుగానూ పొలం నలువైపులా టేకు, కొబ్బరి, ఇతర చెట్లను సాగు చేశారు. వీటి ద్వారా ఈదురుగాలులకు, భారీ వర్షాలకు తక్కువ నష్టం జరిగేందుకు అవకాశం ఉంటుంది. ఈ ఏడాది వాతావరణం అనుకూలంగా ఉండడంతో ఒక్కో చెట్టుకు గెలల కొద్దీ, వందకుపైగా ఒక్కో కాయ సుమారుగా 800గ్రాముల నుంచి 1000 గ్రాములకు పైబడి ఉండడం ప్రత్యేకత. ముఖ్యంగా ఉత్తర దక్షిణ భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన పండ్లను ఒకే క్షేత్రంలో సాగుచేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోందని చూసిన ప్రతి రైతూ చెబుతున్నాడు.

అభినందనల వెల్లువ
రఘుపతిపేట గ్రామంలోని అనంత లక్ష్మారెడ్డి కృషివనాన్ని సందర్శించిన ప్రతిఒక్కరూ ప్రవీణ్‌రెడ్డిని అభినందించక మానరు. తన వ్యవసాయక్షేత్రంలో పంటలు పండించినా.., తోటలను సాగుచేసినా వైవిధ్యమే. వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి ప్రతిసారి శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు పంట దిగుబడిని చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాకుండా పంట దిగుబడి, పంట సాగుపై తోటి రైతులకు మెళకువలు చెబుతుండడంతో ఆయన క్షేత్రాన్ని పరిసర గ్రామాల రైతులు సందర్శిస్తుంటారు. ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పీజీలో వృక్షశాస్త్రం చదవడంతో వ్యవసాయంలో శాస్త్రవేత్తలు సూచించిన విధంగా పంటలను సాగుచేస్తూ అధిక దిగుబడి సాధిస్తున్నారు. కృషివనాన్ని సందర్శించిన శాస్త్రవేత్తలు ఇది మరో పరిశోధనా కేంద్రంలా ఉందంటూ కితాబునిస్తున్నారు. ఉదయం, సాయంత్రం, సెలవు దినాల్లో వ్యవసాయక్షేత్రంలో తన సమయాన్ని కేటాయిస్తూ పంట దిగుబడికి, మొక్కల ఎదుగుదలకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. 12ఎకరాల మామిడితోటలో ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, ఉత్తరాది రాష్ర్టాల్లో ప్రఖ్యాతిగాంచిన మామిడి తోటను సాగు చేయడంపై ఆయనను పలువురు అభినందిస్తూ ఆదర్శంగా తీసుకుంటున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వ్యవసాయంలో నూతన విప్లవాన్ని సృష్టిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు

ట్రెండింగ్‌

Advertisement