మంగళవారం 02 మార్చి 2021
Nagarkurnool - Jan 24, 2021 , 00:56:54

బాలికలకు వరం ‘సుకన్య యోజన’

బాలికలకు వరం ‘సుకన్య యోజన’

  • కలెక్టర్‌ శర్మన్‌చౌహాన్‌

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, జనవరి 23: బేటీ బచావో.. బేటీ పడావో అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం బాలికల కోసం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన పథకం వరం లాంటిదని, ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ శర్మన్‌చౌహాన్‌ అన్నారు. పట్టణంలోని తపాలా కార్యాలయంలో సుకన్య సమృద్ధి యోజన కౌంటర్‌ను శనివారం కలెక్టర్‌ ప్రారంభించి మాట్లాడారు. బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు ఆడపిల్లల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని ఖాతాలు ప్రారంభిస్తే ఆడపిల్లలు అదృష్టలక్ష్మిలుగా మారుతారన్నారు. తల్లిదండ్రులు వెంటనే ఖాతా ప్రారంభించాలన్నారు. పదేండ్లలోపు బాలికల పేరు మీద తల్లి, తండ్రి, సంరక్షకుడు సుకన్య సమృద్ధి ఖాతాను తపాలాశాఖలో ఖాతా తెరువొచ్చన్నారు. ఒక బాలికకు ఒక ఖాతా తెరిచేందుకు అనుమతి ఉందన్నారు. సంరక్షకుడు గరిష్ఠంగా ఇద్దరు బాలికల పేర్లమీద మాత్రమే ఖాతా తీయొచ్చని, ప్రైవేట్‌, ప్రభుత్వ ఉద్యోగులతోపాటు దినసరి కూలీలు ఎవరైనా ఇందులో ఖాతాదారులు కావచ్చన్నారు. జమ చేసే పద్ధతి సమీప పోస్టాఫీసులు, బ్యాంకుల్లో సుకన్య సమృద్ధి ఖాతాను తెరువొచ్చన్నారు. ఖాతా ప్రారంభంలో రూ.1000 చెల్లించాలని, తర్వాత రూ.100పైబడిన మొత్తాన్ని జమ చేయవచ్చన్నారు. ఒక ఆర్థిక సంవత్సరంలో కనీస డిపాజిట్‌ రూ.1000 నుంచి రూ.1.50 లక్షల వరకు ఒకేసారి లేదా వేర్వేరుగానైనా జమ చేయవచ్చన్నారు. ఖాతా ప్రారంభించిన నాటి నుంచి నేరుగా అత్యధికంగా 14ఏండ్ల వరకు జమ చేసుకోవచ్చన్నారు. అనంతరం కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో తపాలా అధికారి సైదానాయక్‌, సిబ్బంది, ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు.

పొదుపు భవిష్యత్‌కు అండ

కల్వకుర్తి రూరల్‌, జనవరి 23: చిన్న మొత్తాల పొదుపు బాలికల భవిష్యత్‌కు అండగా నిలుస్తుందని కల్వకుర్తి సివిల్‌ కోర్టు జడ్జి అర్పితామారంరెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని పోస్టాఫీస్‌లో సుకన్య సమృద్ధి ఖాతా ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ఖాతా పాస్‌పుస్తకాలను అందజేసి మాట్లాడారు. పేద, మధ్య తరగతి కుటుంబాల బాలికల ఉన్నత చదువులకు, వివాహాలకు ఇబ్బంది కలుగకుండా ప్రతి నెలా చేసే పొదుపు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జడ్చర్ల ఏఎస్‌వో భూమయ్య, కల్వకుర్తి పీఎం సక్రూనాయక్‌, సిబ్బంది సత్యపాల్‌, అశోక్‌, రాఘవేందర్‌, నిరంజన్‌, మురళి, శ్రీను, పరశురాములు తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo