శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Nagarkurnool - Jan 23, 2021 , 00:16:41

బడులు సిద్దం చేయాలి

బడులు సిద్దం చేయాలి

  • విలేకరుల సమావేశంలో కలెక్టర్‌ శర్మన్‌

కందనూలు, జనవరి 22: పాఠశాలలను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్‌ శర్మన్‌ ఆదేశాలు జారీ చేశారు. ఫిబ్రవరి 1 నుంచి పాఠశాలలు ప్రారంభం కానుండగా కేవలం 9, ఆపై తరగతుల వారికే పాఠాలు బోధిస్తారని చెప్పారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో శుక్రవారం విలేకరులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు.  పాఠశాలల పరిశుభ్రత విషయంలో రాజీ పడేదిలేదని చెప్పారు. అవసరమైతే పంచాయతీ, మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులను వినియోగించుకోవాలన్నారు. విద్యార్థులు పాఠశాలలకు వచ్చే సమయంలో ఇంటి నుంచే మాస్కులు ధరించి, తప్పకుండా తల్లిదండ్రుల నుంచి అంగీకార పత్రాన్ని తీసుకు వచ్చేలా ఉపాధ్యాయులు వివరించాలని చెప్పారు. ప్రతి గదిలో 20 మంది విద్యార్థులు కూర్చునేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. మధ్యాహ్న భోజనంలో తాజా సరుకులు మాత్రమే వాడాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ మనుచౌదరి, డీఈవో గోవిందరాజులు, సెక్టోరియల్‌ అధికారి నారాయణ పాల్గొన్నారు.

రోడ్డుపై చెత్త వేస్తే రూ.500 జరిమానా

ప్రజలు రోడ్డుపై చెత్త వేస్తే సెక్షన్‌ 52 ప్రకారం రూ.500 జరిమానా విధిస్తామని కలెక్టర్‌ శర్మన్‌ పేర్కొన్నారు. అదనపు కలెక్టర్‌ మనుచౌదరితో కలిసి శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రజలు తమ ఇంటికి వచ్చే చెత్త సేకరణ వాహనాల్లోనే తడి, పొడి చెత్తను వేరు చేసి వేయాలని చెప్పారు. రహదారులపై మురుగు వదిలితే వారికి రూ.500 నుంచి రూ.5వేల వరకు జరిమానా విధిస్తామన్నారు. నెలలోగా మున్సిపాలిటీలో స్త్రీ, పురుషులకు మూత్రశాలలు నిర్మించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. 

కొవిడ్‌ టీకాపై అపోహలొద్దు 

కొవిడ్‌ వ్యాక్సిన్‌పై అపోహలు పెట్టుకోకుండా అందరూ టీకాలు వేయించుకోవాలని కలెక్టర్‌ శర్మన్‌ కోరారు. మండల వైద్యాధికారి దశరథం ఆధ్వర్యంలో మండలంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీకా వేయించుకోవడం వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ జరుగవని చెప్పారు. అనంతరం దవఖానలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ గదులను పరిశీలించారు. అనంతరం కలెక్టర్‌ సమక్షంలో మండల వైద్యాధికారి కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నారు.


VIDEOS

logo