అధనపు బండ!

- పెరిగిన సబ్సిడీ గ్యాస్ ధరలు
- ఒక్క సిలిండర్‌పై రూ.50 పెంపు
- పట్టించుకోని కేంద్రం, సామాన్యులకు గుదిబండ
- కందనూలు జిల్లాలో 2.45 లక్షల కనెక్షన్లు
- రూ.1.22 కోట్ల అదనపు భారం
సబ్సిడీ సిలిండర్ ధరలు అమాంతం పెరిగాయి. ఒక్కో గ్యాస్ సిలిండర్‌పై రూ.50 చొప్పున పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయించాయి. నియంత్రించాల్సిన కేంద్ర ప్రభుత్వం నిమ్మకుండి పోయింది. సామాన్యులకు గుదిబండగా మారింది. దీంతో ఇప్పటికే నిత్యావసరాల ధరలతో తల్లడిల్లుతున్న పేదల ఇండ్లల్లో సబ్సిడీ సిలిండర్ల ధరలు మంటలు రేపుతున్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలో 66 గ్యాస్ ఏజెన్సీలు ఉండగా వీటి పరిధిలో 2,45,196 సబ్సిడీ కనెక్షన్లు, 911 వాణిజ్య కనెక్షన్లు ఉన్నాయి. వీరిపై రూ.1.22 కోట్ల అదనపు భారం పడనున్నది.
- నాగర్‌కర్నూల్, నమస్తే తెలంగాణ
నాగర్‌కర్నూల్, నమస్తే తెలంగాణ : సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల ధరలు అమాంతం పెరిగాయి. ఒక్కో సిలిండర్‌పై రూ.50 చొప్పున పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. పెరిగిన ధరలు వెంటనే అందుబాటులోకి వస్తున్నట్లుగా పేర్కొన్నాయి. కరోనా నేపథ్యంలో నిత్యావసరాలు, కూరగాయలు తదితర ధరలు పెరిగాయి. ఈ క్రమంలో సబ్సిడీ సిలిండర్ల ధరలు కూడా పెరగడం పేదలకు అశనిపాతంలా మారాయి.
నిత్యావసరాల ధరలతో తల్లడిల్లుతున్న పేదల ఇండ్లల్లో సబ్సిడీ సిలిండర్ల ధరలు మంటలు రేపుతున్నాయి. గృహ అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్‌పై రాయితీ కల్పిస్తున్నది. వినియోగదారులు సంవత్సరానికి 12 సిలిండర్ల వరకు రాయితీతో కొనుగోలు చేయొచ్చు. రాయితీ మొత్తాన్ని కేంద్రం నేరుగా వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నది. 12 సిలిండర్ల కంటే ఎక్కువ కావాలంటే మార్కెట్ ధరను చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో చమురు సంస్థలు సబ్సిడీ సిలిండర్ల ధరలను ఒక్కసారిగా పెంచి పేదలను కష్టాల్లోకి నెడుతున్నది. ఐదు నెలలుగా స్థిరంగా ఉన్న సిలిండర్ ధరలు ఈ నెల నుంచే పెరగడం గమనార్హం. ఇప్పటికే డీజిల్, పెట్రోల్ ధరలు ప్రతి రోజూ పెరుగుతున్నాయి. కేంద్రం ధరల నియంత్రణను పట్టించుకోవడం లేదు. ఫలితంగా నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరుగుతున్నాయి.
కిలో ఉల్లిగడ్డ రూ.80కి చేరుకున్నది. ఇప్పుడు సిలిండర్ల ధరలు కూడా పెరగడంతో రానున్న రోజుల్లో పేదల ఇండ్లల్లో కాకను రేపుతున్నాయి. ప్రస్తుతం సబ్సిడీ సిలిండర్ ధర ఆయా చమురు సంస్థలను బట్టి, సిలిండర్లను ఇంటికి చేరవేసే దూరాలను బట్టి వేర్వేరుగా ఉన్నాయి. జిల్లాలో హెచ్‌పీ, ఇండియన్, భారత్‌గ్యాస్ వంటి పలు సంస్థల ఆధ్వర్యంలో ప్రజలకు సిలిండర్ల పంపిణీ జరుగుతున్నది. 14.2 కిలోలు ఉన్న ఒక్కో సిలిండర్ ధర రూ.665పైగానే ఉన్నది. ఇదిలా ఉండగా, చమురు సంస్థలు ఇలా ధరలు పెంచినా కేంద్రం నియంత్రించకపోవడంతో పేద మహిళలకు వంటింటి కష్టాలు ఏర్పడనున్నాయి. ప్రస్తుతం దాదాపు 70 నుంచి 80 శాతం మంది ప్రజలు సిలిండర్లనే వాడుతున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో మొత్తం 66 గ్యాస్ ఏజెన్సీలు ఉండగా, 2,45,196 సబ్సిడీ గ్యాస్ కనెక్షన్లు, 911 వాణిజ్య సిలిండర్లు ఉన్నాయి. ప్రస్తుతం పెరిగిన ధరలతో జిల్లాలో సామాన్యులపై రూ.1,22,59,800 మేర భారం పడనున్నది. ఇకపై పెరిగిన ధరల ప్రకారమే ప్రజలు పెరిగిన సిలిండర్లకు ధరలు చెల్లించాల్సి ఉంటుంది. కేంద్రం సిలిండర్ల ధరలను నియంత్రించకపోవడంపై సామాన్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఒక్కో సిలిండర్‌పై రూ.50 పెంపు..
ఒక్కో సబ్సిడీ గ్యాస్ సిలిండర్‌పై రూ.50 చొప్పున పెరిగాయి. జిల్లాలో 1.22 లక్షల సబ్సిడీ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. పెరిగిన ధరలతో 1.22 కోట్ల భారం పడనున్నది. తక్షణమే పెరిగిన ధరలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రజలు సబ్సిడీ సిలిండర్లకు ఇకపై రూ.50చొప్పున అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
- మోహన్‌బాబు, డీసీవో, నాగర్‌కర్నూల్
తాజావార్తలు
- ట్రాక్టర్ పరేడ్ : మెట్రో స్టేషన్ల మూసివేత
- అడ్డుకున్న పోలీసులపైకి కత్తి దూసిన రైతు
- నిలకడగానే శశికళ ఆరోగ్యం: వైద్యులు
- ఘనంగా గణతంత్ర వేడుకలు
- 55 లక్షలు ఖర్చుపెట్టి 2 ఇంచులు పెరిగాడు..
- సచివాలయ నిర్మాణ పనులు పరిశీలించిన సీఎం కేసీఆర్
- సైకిల్‌పై ౩౩ అంతస్తులు..౩౦ నిమిషాల్లో..
- కరోనా ఆంక్షలు.. నెదర్లాండ్స్‌లో భారీ హింస
- ఆరు మిలియన్ల ఫాలోవర్స్ సొంతం చేసుకున్న ప్రభాస్
- కూతుళ్ల హత్య కేసు.. తల్లికి వదలని క్షుద్రపిచ్చి..