రైతులకు ఇబ్బంది కలిగించొద్దు

- తాసిల్దార్ రాంరెడ్డి
కల్వకుర్తి రూరల్: జిన్నింగ్ మిల్లుల వద్ద పత్తి విక్రయించేందుకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని తాసిల్దార్ రాంరెడ్డి సీసీఐ అధికారులు, మిల్లుల యజమానులకు సూచించారు. కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్‌కు సంబంధించిన అధికారులు సకాలంలో రాకపోవడాన్ని నిరసిస్తూ మండలంలోని తాండ్ర గేట్ సమీపంలోని జిన్నింగ్ మిల్లు వద్ద శ్రీశైలం- కల్వకుర్తి ప్రధాన రహదారిపై రైతులు ధర్నా నిర్వహించారు. ఉదయం 8 గంటలకు రావాల్సిన అధికారులు 11 గంటలు దాటినా రాకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం తెలుసుకున్న సీఐ సైదులు, ఎస్సైలు నర్సింహ, బాలకృష్ణ అక్కడికి చేరుకుని రైతులకు అధికారులు మిల్లు వద్దకు వస్తున్నారని చెప్పి ధర్నాను విరమింపజేశారు. రెండు గంటల గడిచినా అధికారులు రాకపోవడంతో వారు మళ్లీ ధర్నా చేపట్టారు. ఆర్డీవో రాజేశ్‌కుమార్, తాసిల్దార్ రాంరెడ్డి అక్కడికి చేరుకుని రైతులను శాంతింపజేసి అధికారులు వచ్చి వెంటనే కొనుగోళ్లు ప్రారంభిస్తారని చెప్పి రైతులకు నచ్చజెప్పారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు.