‘1 నేనొక్కడినే’ సినిమాతో వెండితెరకు పరిచయమైన నటి కృతి సనన్. తర్వాత ‘దోచెయ్’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఢిల్లీ నుంచి టాలీవుడ్‌కు వచ్చిన ఈ పంజాబీ భామ, తర్వాత బాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీ అయింది. కమర్షియల్ మూవీల్లో సత్తా చాటుతూ సక్సెస్‌కు కేరాఫ్‌గా నిలుస్తున్నది. ఈ పాండమిక్ సమయంలోనూ చేతినిండా సినిమాలతో బిజీబిజీగా ఉన్న కృతి సనన్ జీవితానుభవాలు ఆమె మాటల్లోనే..
మా ఇంట్లో నేనే పెద్ద. కాస్త నిదానంగా ఉండేదాన్ని. చిన్నచిన్న విషయాలకు కూడా తెగ భయపడేదాన్ని. ఇప్పటికీ అంతే! కానీ, ఎవరైనా నాతో వాదనకు దిగితే మాత్రం వెనక్కి తగ్గను. విషయంపై పూర్తి అవగాహన ఉంటే గానీ మాట్లాడను. కానీ, ఎవరైనా కఠినంగా మాట్లాడితే మాత్రం టపటపా కన్నీళ్లు వచ్చేస్తాయి. నా వ్యక్తిత్వం ఏంటో నాకన్నా, మా ఇంట్లో వాళ్లకు బాగా తెలుసు. అందుకే నాపై మాట పడనిచ్చేవారు కాదు. అన్ని విషయాల్లో ప్రోత్సహించేవాళ్లు. విమర్శించే వాళ్లు చిన్నప్పుడూ ఉన్నారు, ఇప్పుడూ ఉన్నారు. వాళ్లను అప్పుడూ పట్టించుకోలేదు, ఇప్పుడూ పట్టించుకోవడం లేదు.
పెంపుడు జంతువులంటే నాకు ప్రాణం. డ్యాన్స్ అన్నా మహా ఇష్టం. ముచ్చటగా మాట్లాడుకుంటున్న ముదుసలి జంటను చూస్తే చాలా తృప్తిగా ఉంటుంది. ఎంత జీవితం చూసుంటారు, ఎన్ని జ్ఞాపకాలను ప్రోది చేసుకుని ఉంటారు. అందుకే, హ్యాపీగా ఉన్న ఓల్డ్ కపుల్‌ను చూస్తే సంతోషం అనిపిస్తుంది.
ఆడపిల్లల మీద అకృత్యాల గురించి వింటుంటే రక్తం ఉడికిపోతుంది. మహిళల విషయంలో అందరిదీ పెత్తనమే! చివరికి ఏ డ్రెస్ వేసుకోవాలో, ఏది వేసుకోకూడదో నిర్ణయించేస్తుంటారు. తాతల కాలం నుంచీ వస్తున్న ఈ ధోరణి నేటి యువతరానికీ సోకింది. ఇప్పటికైనా పిల్లలకు చిన్నప్పటి నుంచి ఆడ-మగ ఇద్దరూ సమానం అని చెప్పాలి. అప్పుడే సమానత్వ భావన కలుగుతుంది.
మా అమ్మకు గార్డెనింగ్ అంటే ప్రాణం. పచ్చని చెట్ల మధ్య కూర్చొని టీ తాగాలనుకుంటుంది. తన కోసం హోమ్ గార్డెనింగ్ చేయాలని భావిస్తున్నా. స్కై డైవింగ్ చేయాలన్నది ఎప్పట్నుంచో కల. అది కూడా నెరవేర్చుకుంటా. ఉత్తమనటిగా నేషనల్ అవార్డు గెలువాలన్నది నా యాంబిషన్. ఈ మూడు కోరికలతోపాటు ఓ అందమైన బయోపిక్‌లో నటించాలని కూడా ఉంది.
కరోనా లాక్డౌన్ కారణంగా షాపింగ్ మిస్ అవుతున్నా. తొందర్లోనే పరిస్థితులు మారాలని కోరుకుంటున్నా. ఈ పాండమిక్ టైమ్‌లోనూ రెండు సినిమాల్లో నటించడం ఆనందంగా ఉంది. మరిన్ని చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. త్వరలోనే ఒక పెద్ద ఫ్లాట్‌లోకి మారబోతున్నా! మొత్తానికి గతేడాది బిజీబిజీగానే గడిచింది. ఈ సంవత్సరం కూడా అలాగే ఉంటుందని ఆశిస్తున్నా!
సినిమాల్లోకి వచ్చాక రకరకాల పాత్రలు పోషించక తప్పదు. తాజాగా, ఓ సినిమాలో బైక్ నడపాల్సి వచ్చింది. మామూలుగా అయితే, ఇలాంటి సాహసాలు నాకు సెట్ కావు. కానీ, తప్పదు! గత లాక్డౌన్లో వంట నేర్చుకున్నా. ఒక్కసారి మొదలుపెట్టాక మాత్రం చాలా ప్రయోగాలు చేసేస్తున్నా. బనానా బ్రెడ్, గార్లిక్ బ్రెడ్, చికెన్ స్టఫ్డ్ పప్స్ యమ్మీగా చేస్తున్నా.
అనుకున్నట్టుగా సాగితే అది జీవితం ఎలా అవుతుంది? మా అమ్మ ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్. నాన్న చార్ట్టర్డ్ అకౌంటెంట్. తెలిసింది కదా! చదువు విషయంలో స్ట్రిక్ట్. నేనూ బాగా చదువుకున్నా. ఇంజినీరింగ్ పూర్తి చేశా. అనుకోకుండా సినిమాల్లోకి వెళ్లాలనుకున్నా. ఆ విషయం ఇంట్లో చెబితే ఒప్పుకొంటారా! అమ్మావాళ్లూ ‘ఎందుకు ఈ సినిమాలు?’ అన్నారు. విదేశాల్లో చదువు కొనసాగించ మన్నారు. జీమ్యాట్ ఎగ్జామ్‌లో మంచి స్కోర్ సాధించాను కూడా! ఆ స్కోర్‌కు ఐదేండ్ల వ్యాలిడిటీ ఉంటుంది. ఈలోపు సినిమాల్లో ప్రయత్నిస్తానని ఇంట్లో చెప్పి ముంబయికి వచ్చాను.
అవకాశాలు ఎప్పుడు తలుపు తడతాయో ఎవరం ఊహించలేం. మనం చేయాల్సింది తలుపులు తెరిచి వాటిని స్వాగతించడమే! ప్రతిదీ డెస్టినీ అనే భావిస్తాను. నేను ఇంజినీరింగ్ చదువుతానని అనుకోలేదు. అది పూర్తయ్యాక సినిమాల్లోకి వస్తానని అస్సలు అనుకోలేదు. అనుకోకుండా మోడలింగ్‌లోకి రావడం, పలు పోటీల్లో విజయం సాధించడం, సినిమా అవకాశాలు రావడం.. ఇవన్నీ డెస్టినీ అనే అనిపిస్తుంటుంది. అయితే, అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. ఎంత రాసిపెట్టి ఉన్నా పట్టుదలతో
ప్రయత్నిస్తేనే విజయం సాధించగలం.
సినిమా అవకాశాల కోసం ఇండస్ట్రీకి వచ్చాను. కానీ, ఇక్కడంతా కొత్తే! ఏడేండ్ల సినిమా ప్రస్థానంలో సక్సెస్‌లు చూశాను. ఫెయిల్యూర్స్ కూడా పలకరించాయి. ఫెయిల్యూర్స్‌లో ఉన్నప్పుడు మనం తీసుకునే కొన్ని నిర్ణయాలు ఇబ్బందులపాలు చేస్తాయి. గెలుపు, ఓటములకు ప్రభావితం కాకుండా ధైర్యంగా ఉండాలి. ఈ ధైర్యం లేకనే సినిమా అవకాశాల కోసం ముంబయికి వచ్చిన చాలామంది సమస్యల పాలవుతుంటారు.
చిన్నప్పుడైతే నేను చాలా సిగ్గరిని. పెద్దయ్యాక కూడా మారలేదు. కానీ, నేను ఎంచుకున్న రంగంలో బిడియం పనికిరాదు. నలుగురితో కలవాల్సి ఉంటుంది. పైగా, సినిమా ఇండస్ట్రీ గురించి చాలామందికి దురభిప్రాయం ఉంది. మా తల్లిదండ్రులకూ అంతే! చాలా భయపడేవాళ్లు. నిమిష నిమిషానికి ఫోన్ చేసేవారు. నా మొదటి సినిమా రిలీజయ్యాక గానీ, వాళ్లకు ఎంతో కొంత నమ్మకం ఏర్పడలేదు.