గురువారం 03 డిసెంబర్ 2020
Nagarkurnool - Nov 01, 2020 , 03:14:46

ఉద్యోగులు పునరంకితం కావాలి

ఉద్యోగులు పునరంకితం కావాలి

నాగర్‌కర్నూల్‌ టౌన్‌ : సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఆశయసాధనకు ఉద్యోగులు పునరంకితులు కావాలని అదనపు కలెక్టర్‌ మనుచౌదరి అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో పటేల్‌ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ దేశంలో 600 సంస్థానాలను విలీనం చేస్తూ నిరంకుశ రాజరీక పాలనను అంతమొందించడంలో ఆయన కీలకపాత్ర పోషించారన్నారు. ఉక్కు మనిషి జీవితం నేటి యువతకు ఆదర్శమన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ హనుమంతురెడ్డి, డీఆర్‌వో మధుసూదన్‌నాయక్‌, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి అనిల్‌ప్రకాశ్‌, డీఎస్‌వో మోహన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

నాగర్‌కర్నూల్‌ పట్టణంలో.. 

నాగర్‌కర్నూల్‌ పట్టణంలోని రెండో వార్డులో శనివారం సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతిని నిర్వహించారు. కౌన్సిలర్‌ కే సుమలత పటేల్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.కార్యక్రమంలో నాగయ్య, గంగాధర్‌, కాంగ్రెస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

తాడూరులో..

తాడూరు : ఉక్కు మనిషి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతిని శనివారం ఘనంగా జరుపుకొన్నారు. మండలంలోని ఆకునెల్లికుదురు ప్రభుత్వ పాఠశాలలో పటేల్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం జ్యోతి మాట్లాడుతూ పటేల్‌ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు. 

బిజినేపల్లిలో..

బిజినేపల్లి : సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి, జాతీయ ఐక్యత దినోత్సవాన్ని శనివారం మండలంలోని గంగారం, కార్కొండతండా పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు జాతీయ ఐక్యత దినోత్సవ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో శ్రీధర్‌, రాజారాంప్రకాశ్‌, సురేశ్‌, యాకూబ్‌, మహ్మద్‌, శ్రీహరి, ప్రసన్నలక్ష్మి, నరహరి, రామకృష్ణ, వీరేశ్‌ తదితరులు పాల్గొన్నారు.