గురువారం 26 నవంబర్ 2020
Nagarkurnool - Oct 31, 2020 , 06:49:44

గ్రామాలకు నవశకం

గ్రామాలకు నవశకం

  •  ట్రాక్టర్ల కొనుగోలుతో పనులు వేగవంతం..
  •  గ్రామాల్లో పరిశుభ్రతకు తొలి ప్రాధాన్యం..
  • ఎటుచూసినా పచ్చదనం.. పరిశుభ్రత..

కల్వకుర్తి రూరల్‌: రాష్ట్ర విభజనకు పూర్వం అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న గ్రామాలు, పల్లెలు ప్రస్తుతం అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామాలకు ఇతోధికంగా నిధులు ఇవ్వడంతో పల్లెలకు పునర్జీవం లభించినైట్లెంది. దీనికి తోడు సీఎం కేసీఆర్‌ గ్రామాలను అభివృద్ధిలో పరుగులు పెట్టించేందుకు గానూ గతేడాది పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అంతటితో గ్రామాభివృద్ధి నిలిచిపోకుండా.. గ్రామాలు పరిశుభ్రంగా ఉండేందుకు గ్రామ పంచాయతీ నిధులతో ప్రతి గ్రామానికి ట్రాక్టర్లను అందజేశారు. ట్రాక్టర్లు రావడంతో గ్రామాలకు నవశకం ప్రారంభమైంది. ట్రాక్టర్లను గ్రామాభివృద్ధికి విస్తృతంగా వినియోగిస్తూ తమ గ్రామాల రూపు రేఖలు మార్చుకుంటున్నారు ప్రజాప్రతినిధులు, గ్రామాల ప్రజలు.. గతంలో వారం పదిరోజులకోసారి చెత్తను తరలించే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ట్రాక్టర్‌లు రావడంతో నిత్యం చెత్తా చెదారాన్ని ట్రాక్టర్‌ సహాయంతో డంపింగ్‌యార్డుకు తరలించి గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దే పనిలో పడ్డారు. 

పరిశుభ్రతకే తొలి ప్రాధాన్యత..

గ్రామ పంచాయతీ రాజ్‌ చట్టం 2018 ప్రకారం.. గ్రామాల్లో ప్రతి యేటా రెండు మూడు సార్లు.. అవసరాన్ని బట్టి మరిన్ని సార్లు గ్రామసభలు నిర్వహించుకుని సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలను చర్చించుకుని ప్రతిపాదించుకోవాలి. గ్రామాలకు ప్రధానంగా పారిశుధ్యం, రక్షిత తాగునీటి సరఫరా, చెత్త సేకరణ, చెత్త తరలింపు కార్యక్రమం నిత్యం నిర్వహించుకోవాలి. అంతేకాకుండా పారిశుధ్యానికి తొలి ప్రాధాన్యతను ఇస్తున్నారు. గ్రామం ఎంత పరిశుభ్రంగా ఉంటే ప్రజలు అంత ఆరోగ్యంగా ఉంటారనే ఉద్దేశంతో స్వచ్ఛత దిశగా సర్పంచులు కృషి చేస్తున్నారు. ట్రాక్టర్‌ రావడంతో ప్రతి ఇంటికీ చెత్త బుట్టలను అందించి.. చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించడంతో ప్రజలు కూడా చెత్తను ట్రాక్టర్లలోనే వేస్తున్నారు.  కల్వకుర్తి మండలంలోని 24 గ్రామ పంచాయతీల్లో 24 ట్రాక్టర్లు, ట్రాలీ, ట్యాంకర్లు కొనుగోలు చేశారు. వాటితో పాటు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు, గ్రామ అవసరాల నిమిత్తం డోజర్లను కొనుగోలు చేస్తున్నారు.

ఎటూచూసినా పచ్చదనం...

గ్రామాల్లో హరితహారంలో నాటిన మొక్కలు చక్కటి ఫలితాలను ఇస్తున్నాయి. రహదారులకు ఇరువైపులా నాటిన మొక్కలను ప్రజలు బాధ్యతగా సంరక్షించుకోవడంతో ఎటూ చూసినా పచ్చదనమే కనిపిస్తోంది. దీనికితోడు నూతన జీపీ చట్టం అనేక విధివిధానాలు రూపొందించడంతో గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు హరితహారంలో భాగంగా లక్ష్యాలను చేరేందుకు  కృషి చేస్తున్నారు. నాటిన మొక్కలను మూగజీవాలు మేయకుండా వాటికి ట్రీగార్డులు ఏర్పాటు చేసి సంరక్షిస్తున్నారు. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తూ మొక్కలను సంరక్షిస్తుండడంతో హరిత గ్రామాలుగా మారుతున్నాయి. గ్రామాల్లో నాటిన మొక్కల్లో ఎనభైఐదు శాతం మొక్కలను బతికించాలనే నిబంధన ఉండడంతో ప్రజాప్రతినిధులు అనునిత్యం మొక్కల సంరక్షణకు ప్రాధాన్యతనిస్తున్నారు. దీనికితోడు జిల్లా అధికారులు, రాష్ట్ర స్థాయి ప్రత్యేకాధికారులు గ్రామాలను ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రజాప్రతినిధులకు సూచనలు చేస్తున్నారు. గ్రామాల్లోని ఖాళీ స్థలాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పొలాల గట్లు, గుట్టల వెంట మొక్కలను నాటుతూ ప్రజాప్రతినిధులు, ప్రజలు గ్రామాలను హరితతోరణంతో అలంకరింపజేస్తున్నారు.