శుక్రవారం 04 డిసెంబర్ 2020
Nagarkurnool - Oct 27, 2020 , 04:16:49

ఘనంగా విజయదశమి

ఘనంగా విజయదశమి

కల్వకుర్తి:  కల్వకుర్తి నియోజకవర్గంలో దసరా ఉత్సవాలను ఘనంగా జరుపుకొన్నారు. జమ్మిచెట్టుకు పూజలు నిర్వహించి పాలపిట్టను దర్శించుకున్నారు. కల్వకుర్తి పట్టణంలో నిర్వహించిన దసరా ఉత్సవాల్లో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ పాల్గొన్నారు. స్థానిక సీతారామాంజనేయస్వామి దేవాలయంలో పూజలు నిర్వహించారు. దసరా ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీ మున్సిపల్‌ కార్యాలయం వద్దకు చేరగానే ఉత్సవాలను ప్రారంభించారు. కొవిడ్‌ నిబంధనలు అనుసరిస్తూ ఉత్సవాలు నిర్వహించారు. మున్సిపల్‌ కార్యాయలం వద్ద జమ్మిచెట్టుకు పూజలు నిర్వహించి జమ్మి ఆకులు పంచుకొని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ ఎడ్మ సత్యం, కౌన్సిలర్లు శ్రీశైలం, సూర్యప్రకాశ్‌రావు, మనోహర్‌రెడ్డితో పాటు కల్వకుర్తి ప్రజలు పాల్గొన్నారు.

వివిధ గ్రామాల్లో..

కల్వకుర్తి రూరల్‌: కల్వకుర్తి మండలంలోని అన్ని గ్రామాల్లో విజయ దశమి పర్వదినాన్ని ఘనంగా జరుపుకొన్నారు. ప్రజలు నూతన వస్ర్తాలను ధరించి సాయంత్రం గ్రామంలో పాలపిట్టల దర్శించుకున్నారు.  జమ్మిచెట్టు వద్దకు శోభాయాత్రగా వెళ్ళి పూజలు నిర్వహించారు. జమ్మిఆకును ఒకరికొకరు పంచుకొని పండుగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. ఆలయాలను సందర్శించుకున్నారు.  అదే విధంగా గ్రామాలలో  దేవీ శరన్నవ రాత్రుల ముగింపు సందర్భంగా అమ్మవారి విగ్రహాలను నిమజ్జనం చేశారు.  

చారకొండలో..

చారకొండ: మండల కేంద్రంతోపాటు అన్ని గ్రామాల్లో దసరా ఉత్సవాలను ఆదివారం ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. సాయంత్రం ప్రజలు జమ్మి చెట్టు వద్ద పూజలు చేశారు. జమ్మి ఆకును పంచుకొని ఒకరికొకరు దసరా శుభాకాంక్షాలు తెలియజేసుకున్నారు. దుర్గామాతను భక్తి శ్రద్ధలతో పూజించి ఊరేగింపు అనంతరం నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ గుండె నిర్మలవిజేందర్‌గౌడ్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ గురువయ్యగౌడ్‌,  వైస్‌ ఎంపీపీ బక్కమ్మ,  రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు గజ్జెయాదయ్యగౌడ్‌, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఘనంగా నిమజ్జనోత్సవం

కల్వకుర్తి రూరల్‌: కల్వకుర్తి  మండంలంలోని మార్చాల, తర్నికల్‌, పంజుగుల, ఎల్లికట్ట, గుండూర్‌ రఘుపతిపేట తదితర గ్రామాల్లో బుధవారం ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో అమ్మవారిని  ఊరేగించి ఘనంగా నిమజ్జనోత్సవం నిర్వహించారు.  నవరాత్రుల్లో అమ్మవారికి అలంకరించిన వస్ర్తాలకు, పూజా సామగ్రికి వేలం నిర్వహించారు.అనంతరం కోలాటాలు, భజనలు చేసుకుంటూ శోభాయాత్ర నిర్వహించి అమ్మవారి విగ్రహాలను నిమజ్జనం చేశారు.

వెల్దండలో..

వెల్దండ: మండల కేంద్రంతోపాటు మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో ప్రజలు విజయదశమి వేడుకలు ఆదివారం ఘనంగా జరుపుకొన్నారు. ప్రజలు చిన్న పెద్ద తేడా లే కుండా ఆలయ్‌ బలయ్‌ తీసుకొని దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. గ్రామాల్లో ఆడపడుచుల సందడితో పండుగ వైభవం ఉట్టి పడింది. ప్రజలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. పెద్దలకు నైవేద్యాలు పెట్టారు.  దసరా సంబురాల్లో ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ప్రజలు పాల్గొన్నారు.

వంగూరులో..

వంగూరు: మండలంలోని వివిధ గ్రామాల్లో ఆదివారం దసరా వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. కరో నా నేపథ్యంలో ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమిస్తూ ప్రజలు దసరాను జరుపుకోవడం విశేషం. ఉదయాన్నే కొత్త బట్టలు ధరించిన ప్రజలు సాయంత్రం జమ్మిచెట్టు వద్దకు డప్పు వాయిద్యాలు, బతుకమ్మ ఆట పాటలతో వెళ్లి పూజలు చేశారు. అనంతరం జమ్మి ఆకును తీసుకుని ఒకరికొకరు అలాయ్‌ బలాయ్‌ తీసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. వివిధ గ్రామాల్లో పట్టు వస్ర్తాలు ధరించిన మహిళలు వివిధ రకాల పూలతో అలంకరించిన  బతుకమ్మ చుట్టూ ఆడుతూ సమీప చెరు వుల్లో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో ప్రజా ప్రతి నిధులు, మహిళలు పాల్గొన్నారు.