శనివారం 05 డిసెంబర్ 2020
Nagarkurnool - Oct 22, 2020 , 03:22:50

పూర్తిస్థాయి నివేదికకు ఆదేశిస్తాం

పూర్తిస్థాయి నివేదికకు ఆదేశిస్తాం

  •  జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు ఆచారి
  • ఎంజీకేఎల్‌ఐ లిఫ్ట్‌వద్ద పంప్‌హౌస్‌ పరిశీలన

కొల్లాపూర్‌ రూరల్‌: ఎంజీకేఎల్‌ఐ పంపుహౌస్‌ మునకకు సంబంధించి పూర్తిస్థాయి నివేదిక కోసం అధికారులను ఆదేశిస్తామని జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు ఆచారి అన్నారు. బుధవారం ఎల్లూరు పంప్‌హౌస్‌ను పరిశీలించారు. అనంతరం కొల్లాపూర్‌ ఎంపీడీవో సమావేశ మందిరంలో విలేకరులతో మాట్లాడారు. సంఘటన చోటుచేసుకున్నప్పుడు పంప్‌హౌస్‌ వద్ద చాలామంది కార్మికులు, ఇంజినీరింగ్‌ అధికారులు, సాంకేతిక నిపుణులున్నారు. వారు ఎంతో సాహసోపేతంగా మూడో పంపు నుంచి వస్తున్న లీకేజీ నీటిని ఆపేందుకు ప్రయత్నించారని కితాబిచ్చారు. ప్రస్తుతం పంప్‌హౌస్‌ వద్ద వరద నీటిని తోడివేసేందుకు అధికారులు, సాంకేతిక నిపుణులు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. సాధ్యమైనంత త్వరగా పంపులు యథావిధిగా పనిచేయడానికి అధికారులు కృషి చేయాలన్నారు. నీళ్లను పూర్తిగా తోడిన తర్వాతగానీ ఏమైందో చెప్పలేమన్నారు. పంపులో వాచర్లు పోయాయా, లేక పాలమూరు-రంగారెడ్డి పథకం పనుల్లో పేలుళ్ల వల్ల పగుళ్లు వచ్చి నీళ్లు పంపుహౌస్‌లోకి వచ్చాయా అనేది మోటర్లు తేలిన తర్వాతనే తెలుస్తుందన్నారు. కాగా కొట్రగ్రామం నుంచి కల్వకుర్తి, నాగర్‌కర్నూల్‌, కొల్లాపూర్‌, సోమశీల కృష్ణానదిపై బ్రిడ్జి నిర్మాణం, నంద్యాల వరకు రూ.765కోట్లతో జాతీయ రహదారిని నిర్మించేందుకు కేంద్రం అనుమతులు జారీచేసిందని ఆచారి తెలిపారు.