గురువారం 22 అక్టోబర్ 2020
Nagarkurnool - Oct 18, 2020 , 00:43:32

దేశంలోనే నంబర్‌వన్‌ చేస్తాం

దేశంలోనే  నంబర్‌వన్‌ చేస్తాం

  • రాష్ట్ర అటవీశాఖ ముఖ్య కార్యదర్శి శోభ
  •  అమ్రాబాద్‌ టైగర్‌రిజర్వు ఫారెస్ట్‌లో పర్యటన

   అమ్రాబాద్‌ : అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ను దేశంలోనే నంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్‌ శోభ అన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు ఫారెస్ట్‌ అభయారణ్యంలో రెండ్రోజుల పర్యటనలో భాగంగా శనివారం మన్ననూర్‌లో మహిళా ఉద్యోగులు ఏర్పాటు చేసిన బతుకమ్మకు వేడుకల్లో పాల్గొని బతుకమ్మ ఆడారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎంతో చరిత్ర ఉన్న నల్లమలను పర్యావరణ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ప్రతాపరుద్రుడి కోటను నెలలోనే సఫారీ కేంద్రంగా తయారుచేసి పర్యాటకులకు అందుబాటులోకి తెస్తామన్నారు. అడవుల అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమన్నారు. అడవిలో గడ్డిక్షేత్రాలపై ఆరా తీశారు. రంగాపూర్‌ పరిధిలో మొక్కల పెంపకం క్షేత్రాలను సందర్శించి మొక్కలను నాటారు.

అటవీ ప్రాంతంలో వెళ్లే వాహనదారులు నెమ్మదిగా వెళ్లాలని, జంతువులకు హాని తలపెట్టవద్దని సూచించారు. హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో సంచరిస్తున్న చిరుతను బంధించి నల్లమల అడవిలో వదిలివెళ్లారని తెలిపారు. అడవుల అభివృద్ధిలో అధికారులు తీసుకుంటున్న చర్యలను ఆమె పరిశీలించారు. అనంతరం రాత్రికి దోమలపెంట విశ్రాంతి భవనంలో బస చేశారు. ఆదివారం కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలో పర్యటించనున్నట్లు ఆమె తెలిపారు. ఆమె వెంట హైదరాబాద్‌ జూ క్యూరేటర్‌ క్షితిజ, అడిషినల్‌ పీసీసీఎఫ్‌ ఏకే సిన్హా, జిల్లా అటవీశాఖ అధికారి కిష్టగౌడ్‌, ఎఫ్‌డీవో సుధాకర్‌రావు, రాజశేఖర్‌ రేంజర్లు ప్రభాకర్‌, రవిమోహన్‌, హైదరాబాద్‌ టైగర్‌ కన్జర్వేటర్‌ అథారిటీ ప్రతినిధులు మహేందర్‌రెడ్డి, బాపురెడ్డి, బీట్‌, సెక్షన్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. logo