శనివారం 31 అక్టోబర్ 2020
Nagarkurnool - Oct 01, 2020 , 02:20:19

పోషకాహార లోపం లేకుండా చూడాలి

 పోషకాహార లోపం లేకుండా చూడాలి

  • జిల్లాస్థాయి ఉత్తమ పురస్కారాలు అందజేత 

నాగర్‌కర్నూల్‌ టౌన్‌: అధికారులు సమన్వయంతో పనిచేసి పోషణ్‌ అభియాన్‌ కార్యక్రమంలో తల్లీపిల్లల్లో పోషకాహార లోపం లేకుండా చూసుకోవాలని అదనపు కలెక్టర్‌ మనుచౌదరి అన్నారు. కలెక్టరేట్‌లోని ప్రజావాణి మీటింగ్‌ హాల్‌లో కేంద్ర ప్రభుత్వ పోషణ్‌ అభియాన్‌ 2018-19 సంవత్సరానికి గానూ రాష్ట్ర, జిల్లాస్థాయి ఉత్తమ పురస్కారాల కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ముందుగా 2018-19లో పోషణ్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రశంసాపత్రాలకు ఎంపికైన వారిని అభినందించారు. అన్ని శాఖలు సమన్వయంతో నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని ఆదేశించారు. జిల్లాలోని చిన్నారులు, గర్భిణులు, కిశోర బాలికల్లో పోషక లోపాలు గుర్తించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. రక్తహీనత ఉన్న అందరికీ ఐరన్‌ సప్లిమెంట్‌ అందించాలన్నారు. శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో కూరగాయల మొక్కలు పెంచుతూ అందుకు అవసరమైన వసతులను జీపీల ద్వారా వినియోగించుకోవాలన్నారు.

కిశోర బాలికలకు పోషకాహారంపై అవగాహన కల్పించి బాల్య వివాహాలు, విద్యాహక్కు చట్టంపై అవగాహన కల్పించాలన్నారు. అనంతరం పోషణ్‌ అభియాన్‌ కార్యక్రమంలో ఉత్తమ సేవలు అందించి రాష్ట్రస్థాయిలోగుర్తింపు పొందిన సీడీపీవో శాఖ ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కొల్లాపూర్‌ అధికారిణి వెంకటరమణమ్మ, వైద్యారోగ్యశాఖ పెంట్లవెల్లి పీహెచ్‌సీ వైద్యుడు చంద్రశేఖర్‌, పంచాయతీరాజ్‌ శాఖ కొల్లాపూర్‌ ఎంపీడీవో గంగామోహన్‌కు పురస్కారాలు అందజేశారు. అదేవిధంగా జిల్లా స్థాయిలో పురస్కారాలు పొందిన 25 మందికి, అచ్చంపేట, బల్మూర్‌, కల్వకుర్తి, కొల్లాపూర్‌, నాగర్‌కర్నూల్‌ మండలాలకు సంబంధించిన అంగన్‌వాడీ సెంటర్ల నుంచి అంగన్‌వాడీ టీచర్‌, హెల్పర్‌, ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్తలు, ఐసీడీఎస్‌ మహిళా సూపర్‌వైజర్లకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో శిక్షణ సహాయ కలెక్టర్‌ చిత్రమిశ్రా, జిల్లా మహిళా శిశుసంక్షేమశాఖ అధికారి ప్రజ్వల, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి సురేశ్‌మోహన్‌, డీఈవో గోవిందరాజులు, పోషణ్‌ అభియాన్‌ సమన్వయకర్త విజ్ఞాన్‌ తదితరులు పాల్గొన్నారు.