గురువారం 29 అక్టోబర్ 2020
Nagarkurnool - Sep 28, 2020 , 06:04:36

ప్లాస్మాతో ప్రాణం

ప్లాస్మాతో ప్రాణం

  •  కరోనా బాధితులకు వరం ప్లాస్మా థెరపీ
  • అవగాహన కల్పిస్తోన్న  వైద్య, ఆరోగ్య శాఖ
  • కందనూలు జిల్లాలో ముందుకొస్తున్న యువత
  • 200 మంది పేర్లు నమోదు..దాతలుగా 25 మంది
  • రోగుల జీవితాల్లో  వెలుగులు

 ప్లాస్మా థెరపీ.. ఇప్పుడు ఏ నలుగురు గుమిగూడినా ఇదే చర్చ.. నిన్నటి దాకా రక్తదానం.. మహాదానం అనే మాట ఉండగా.. నేడు ప్లాస్మా దానం.. ప్రాణదానం తాజా నినాదం. కరోనా  రోజురోజుకూ విజృంభిస్తున్న నేపథ్యంలో బాధితుల సంఖ్య వేలల్లో ఉంటోంది. వైరస్‌ బారిన పడిన  వారిని కాపాడేందుకు వైద్యులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ  సూచన మేరకు ప్లాస్మా థెరపీ చేస్తున్నారు. మందులు లేని మహమ్మారి పాలిట సంజీవనిలా  ప్లాస్మా పనిచేస్తున్నది. కరోనా తీవ్రతతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తులను  కాపాడేందుకు కొవిడ్‌ నుంచి కోలుకున్న వ్యక్తులు ప్లాస్మా దానం చేసేందుకు  ఆసక్తి చూపుతున్నారు. స్వచ్ఛందంగా ప్లాస్మా దానానికి ముందుకు  వస్తుండటం విశేషం.

-  నాగర్‌కర్నూల్‌, నమస్తే తెలంగాణ

రక్తదానం మాదిరిగా ప్లాస్మా దానానికి ఎప్పుడూ సిద్ధమే.. 


ప్లాస్మాదానంతో నలుగురి ప్రాణాలు కాపాడవచ్చు. నాకు కరోనా వచ్చాక ఎలాంటి లక్షణాలూ కనిపించలేదు. వైద్యుల సూచనతో 17 రోజులు హోంక్వారంటైన్‌లో ఉన్నా.తర్వాత వైరస్‌ తగ్గాక రెడ్‌క్రాస్‌ సభ్యులు ప్లాస్మా దానం గురించి అవగాహన కల్పించారు. మా కుటుంబ సభ్యులకు దీనిపై వివరించి హైదరాబాద్‌లో ప్లాస్మాదానం చేశా. ఇప్పుడు నాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. మళ్లీ కావాలన్నా చేస్తా..

-  సతీష్‌, మున్సిపల్‌ ఉద్యోగి, నాగర్‌కర్నూల్‌


ఉమ్మడి జిల్లాలో దాదాపుగా 20వేల మంది కరోనాకు గురయ్యారు. 11వేల మంది వరకు రికవరీ కాగా దాదాపు 9వేల మంది వివిధ దశల్లో చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం కరోనా సాధారణంగా మారింది. తొలిదశలో చాలా మంది భయాందోళనకు గురయ్యారు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. రోజూ జిల్లాల్లో వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇలా వ్యాధి సాధారణంగా మారి ప్రజల ఆందోళన సైతం తగ్గింది. వ్యాధి వచ్చిన వ్యక్తుల్లో మానసిక శక్తితోపాటు నిరోధక శక్తితో సులభంగా గట్టెక్కుతున్నారు. అయితే రోగ నిరోధకశక్తి లేని వ్యక్తులపై కరోనా ప్రభావం చూపుతున్నది. మనుషుల్లో ఈ రోగ నిరోధక శక్తి ఒకే రకంగా ఉండదు. రోగ నిరోధకశక్తిలో కీలకమైనది ప్లాస్మా. ఈ ప్లాస్మా అధికంగా ఉన్న వ్యక్తులు కరోనా నుంచి సులువుగా గట్టెక్కుతున్నారు. రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వ్యక్తులపై కరోనా ప్రభావం చూపుతున్నది. దీంతో రోగ నిరోధకశక్తిని పెంచే ఆహార పదార్థాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వ్యక్తుల్లో కొద్ది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. శ్వాస సమస్యలు ఏర్పడుతున్నాయి. వెంటిలేటర్‌పై చికిత్స తీసుకునే స్థాయికి చేరుతున్నారు. ఇలాంటి రోగులకు ఔషధంలా ప్లాస్మా పని చేస్తున్నది. దీంతో ప్లాస్మాదానంపై వైద్యశాఖ ప్రజలకు ముఖ్యంగా యువతకు అవగాహన కల్పించే చర్యలు చేపడుతున్నది. దీనివల్ల చాలామంది యువత ప్లాస్మా దానానికి ముందుకొస్తున్నారు. దీంతో నిన్నటి రక్తదానం మహాదానం అనే స్థానంలో ప్లాస్మా దానం ప్రాణదానం అనే కొత్త నినాదం వినిపిస్తున్నది. 

ప్లాస్మాదానం ఇలా..

మనుషుల రక్తంలో తెల్ల, ఎర్ర రక్తకణాలు తొలగించిన తర్వాత ఉండే ద్రవమే ప్లాస్మా. ఇది  పసుపు పచ్చ రంగులో ఉంటుంది. శరీరంలో రక్తాన్ని గడ్డ కట్టించడంతోపాటు వ్యాధులను ఎదుర్కోవడంలో ఉపయోగకారిగా ఉంటుంది. మానవుల రక్త కణాల్లో 55శాతం ప్లాస్మా, 45శాతం కణాలు ప్లాస్మా ఉంటుంది.  మన కణాల్లో ఎర్ర రక్తకణాలు, తెల ్లరక్తకణాలు, ప్లేట్‌లెట్లు ఉంటాయి. మిగతాది ప్లాస్మా.. ఇందులో లవణాలు, ఎంజైములు, కాల్షియం, బైకార్బోనైట్స్‌, ఎలక్ట్రోలైట్లులాంటి 92శాతం నీటితో కూడి ఉంటుంది. కొందరిలో ఆంటీ బాడీలు కూడా ఉంటాయి. కరోనా, జ్వరంలాంటి ఇతర వైరల్‌ వ్యాధులు వచ్చిన మనుషుల్లో ఈ యాంటీ బాడీస్‌ ఉత్పత్తి అవుతాయి. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులు ప్లాస్మా ఇవ్వడం వల్ల కరోనా రోగుల్లో రోగ నిరోధక శక్తిని పెంచుతున్నది. ఇంతకు ముందు కూడా ప్లాస్మా దానాలు ఇచ్చిన సంఘటనలు ఉన్నాయి.  2003లో సార్స్‌, 2013ఎబోలా వ్యాధులు ప్రబలినప్పుడు ప్లాస్మాతో చాలామందికి చికిత్సలు చేయడం జరిగింది. కరోనా సోకిన గుండె, కిడ్నీ వ్యాధిగ్రస్థులకూ ఈ ప్లాస్మాను ఉపయోగించడం జరిగింది. ఇది రక్తదానం లాంటిదే. ఓ సూదిని గుచ్చి రక్తం తీయడం జరుగుతుంది. ఈ రక్తాన్ని ప్లాస్మాను సేకరించే యంత్రంలోకి పంపించి ప్రత్యేకంగా వేరు చేస్తారు. దీనికి రెండు గంటల సమయం పడుతుంది. ఓసారి ప్లాస్మా ఇచ్చిన వ్యక్తి రెండు వారాలకు ఒకసారి ఇవ్వవచ్చు. అదే రక్తదానం అయితే 8వారాల తర్వాత ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా కరోనా వచ్చాక దాని నుంచి రికవరీ అయ్యి ఉండాలి. దగ్గు, జ్వరంలాంటి ఎలాంటి కరోనా లక్షణాలు ఉంకూడదు. కరోనా వచ్చి 14రోజుల సమయం దాటిన తర్వాత మరోసారి పరీక్ష చేయించుకోవాలి. అదే 28రోజులు దాటితే ఎలాంటి  పరీక్షలు అవసరం లేకుండా ప్లాస్మా దానం చేయవచ్చు.

అలాగే బ్లడ్‌ గ్రూప్‌ ఒకటే అయి ఉండాలి. ప్లాస్మా ఇచ్చే వ్యక్తుల వయస్సు 18నుంచి 60సంవత్సరాల్లోపు ఉండాలి. ప్లాస్మా దాత 55కిలోల కన్నా ఎక్కువ బరువు ఉండాలి. హిమోగ్లోబిన్‌ 12.5గ్రాములు ఉండాలి. బీపీ, షుగర్‌ ఉంటే కంట్రోల్‌లో ఉండాలి. ఇన్సులిన్‌ తీసుకునే వ్యక్తుల నుంచి ప్లాస్మా సేకరించడం జరుగదు. గర్భిణులు, చిన్న పిల్లలు ఉన్న మహిళల ప్లాస్మా డొనేట్‌ చేయరాదు. బీపీ కనీసం 100.60 నుంచి 150.90మధ్య ఉండాలి. ఆరు నెలల్లో ఎలాంటి ఆపరేషన్లు జరిగి ఉండకూడదు. అదేవిధంగా శ్వాస సంబంధ వ్యాధులు, గుండె, కిడ్నీ జబ్బులు ఉండొద్దు.  ప్లాస్మా ఇచ్చిన వ్యక్తి పండ్ల రసాలు తీసుకోవాలి. ఎక్కువ వ్యాయామం చేయరాదు. కళ్లు తిరిగినట్లు అనిపిస్తే వెళ్లకిలా పడుకొని కాళ్లు కాస్త పైకి ఎత్తాలి. దీనివల్ల రక్తం మెదడుకు చేరుకొని ఉపశమనం కలుగుతుంది. రక్తం తీసుకున్న ప్రాంతంలో బ్యాండ్‌ ఎయిడ్‌ వేసుకోవాలి. నొప్పి ఉంటే పారాసిటమాల్‌.. 30నిమిషాల వరకు సిగరెట్‌, బీడీలు తాగరాదు. 5గంటల వరకు మద్యం తీసుకోవద్దు. బీన్స్‌, పాలు, గుడ్లు, చికెన్‌లాంటి పోషకాహారం తీసుకోవాలి. రక్తం ఇవ్వడం, ప్లాస్మా ఇవ్వడం వల్ల నీరసం వస్తుందనే అపోహలు సరికావని వైద్యులు పేర్కొంటున్నారు. ఇది ఇవ్వడం వల్ల మరింత ఆరోగ్యం వస్తుంది. కొత్త హుషారు వస్తుంది. ప్లాస్మా ఇచ్చిన రోజే వ్యాయామం కాస్త తగ్గించాలి. వెజిటేరియన్లు కూడా రక్తదానం చేయవచ్చు. ప్లాస్మా ఇచ్చిన వ్యక్తుల్లో 24గంటల నుంచి 48గంటల్లో ఎప్పటిలాగే తయారవుతుంది. ఒకసారి ప్లాస్మా ఇచ్చిన వ్యక్తి సంవత్సరంలో దాదాపు 13సార్లు ఇవ్వవచ్చు. ఒక వ్యక్తి నుచి 800మిల్లీ లీటర్ల ప్లాస్మాను తీయడం జరుగుతుంది. దీనిని  కరోనా సోకిన ఒక్కొక్కరికి 200మిల్లీ లీటర్ల చొప్పున ఎక్కిస్తారు. అలాగే డోనర్‌, పేషెంట్ల బ్లడ్‌ గ్రూపు కూడా కలువాలి. సాధారణ జలుబు, జ్వరం, దగ్గులాంటి ఉన్న కరోనా బాధితులకు ఈ ప్లాస్మా అవసరం ఉండదు. ఆరోగ్యం బాగా క్షీణించి ఆక్సిజన్‌ తీసుకోలేని స్థితికి చేరి వెంటిలేటర్‌పై ఆధారపడిన వ్యక్తులకే ఈ ప్లాస్మాను ఇవ్వడం జరుగుతుంది. కరోనా తీసుకున్న వ్యక్తులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు. అరుదుగా మాత్రమే చిన్నచిన్న సమస్యలు వస్తాయి. మొత్తం మీద ఇలా ఒక వ్యక్తి రక్తదానంతో ఒకరినే కాపాడగలిగితే అదే ప్లాస్మాతో ఏకంగా ఎనిమిది మందికి ప్రాణదానం చేయవచ్చు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 4వేల మంది వరకు కరోనా సోకగా వెయ్యి మంది చికిత్స పొందుతున్నారు. జిల్లాలో కరోనాపై వైద్యశాఖ, రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో అవగాహన చేపడుతున్నారు. రక్తదాతలను ప్రోత్సహిస్తున్నారు. జిల్లా కేంద్రంలో సమావేశం సైతం నిర్వహించడం జరిగింది. ప్లాస్మా దాతలను ఎమ్మెల్యే, కలెక్టర్లు అభినందించారు.
logo