మంగళవారం 27 అక్టోబర్ 2020
Nagarkurnool - Sep 27, 2020 , 07:12:15

లింగాలలో 92.4 మి.మీటర్లు

లింగాలలో 92.4 మి.మీటర్లు

  • 20 మండలాల్లో భారీ వర్షపాతం నమోదు
  • పదరలో అత్యల్పంగా  10.9 మి.మీ.

నాగర్‌కర్నూల్‌ టౌన్‌: జిల్లాలో మరోసారి భారీ వర్షం కురిసింది. శుక్రవారం రాత్రి కురిసిన వర్షంతో లింగాల మండలంలో అత్యధికంగా 92.4 మిల్లీ మీటర్లు, అత్యల్పంగా పదర మండలంలో 10.9 మి.మీ వర్షపాతం నమోదైంది. 20 మండలాల్లో కురిసిన వర్షంతో సగటున 46.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. తిమ్మాజిపేట మండలంలో 51, బిజినేపల్లిలో 39.8, నాగర్‌కర్నూల్‌లో 52, తాడూరులో 35.6, ఊర్కొండలో 32.5, వెల్దండలో 88.1, చారకొండలో 29.8, వంగూరులో 41.5, కల్వకుర్తిలో 49.8, తెలకపల్లిలో 52.5, ఉప్పునుంతలలో 39.5, అచ్చంపేటలో 24.2, అమ్రాబాద్‌లో 16.2, బల్మూర్‌లో 51.4, పెద్దకొత్తపల్లిలో 84.7, కోడేరులో 40.2, కొల్లాపూర్‌లో 65, పెంట్లవెల్లిలో 38.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖాధికారులు వెల్లడించారు. 

గతంలో పోలిస్తే ఈసారి అధికం..

జిల్లాలో ఈసారి వర్షాలు అధికంగా కురిశాయి. ఐదేండ్లతో పోలిస్తే 2020-21లో అత్యధిక వర్షపాతం నమోదైంది. వర్షాకాలం ప్రారంభమైన నాలుగు నెలల కాలంలో ఇంత భారీ వర్షపాతం ఎప్పుడూ నమోదు కాలేదు. 2016-17లో సెప్టెంబర్‌లో సగటున 178.5 మి.మీ వర్షపాతం నమోదుకాగా, 2017-18 సెప్టెంబర్‌లో 123.3 మి.మీ, 2018-19 సెప్టెంబర్‌లో 54.2 మి.మీ, 2019-20 సెప్టెంబర్‌లో 146.5 మి.మీ వర్షపాతం నమోదైంది. కాగా ఈసారి సెప్టెంబర్‌ 26వ తేదీ నాటికి అత్యధికంగా 263.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో సగటున 642.3 మి.మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఈసారి ఇప్పటికే 803.8 మి.మీ అత్యధికంగా నమోదైంది. 

 నీట మునిగిన పంటలు

కందనూలు : జిల్లా వ్యాప్తంగా శుక్రవారం రాత్రి నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. దీంతో చెరువులు, కుంటలు అలుగులు పారుతున్నాయి. రహదారులపై ప్రవహిస్తున్న నీటితో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తూడుకుర్తి, నాగనూల్‌, ఎండ్లబెట్ల, శ్రీపురం, వనపట్ల తదితర గ్రామాల్లోని చెరువులు అలుగలు పారుతున్నాయి. పంట చేతికందే తరుణంలో మళ్లీ భారీ వర్షం కురవడంతో పంటలు నీటమునిగాయి.

తిమ్మాజిపేటలో భారీ వర్షం 

తిమ్మాజిపేట : మండలంలో శనివారం మరోసారి భారీ వర్షం కురిసింది. దీంతో పలు గ్రామాల్లో చెరువులు మళ్లీ అలుగులు పారాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన వర్షం, దాదాపు పది గంటల పాటు కురిసింది. ఈ వర్షానికి పది రోజుల వ్యవధిలోనే చెరువులు రెండో సారి అలుగులు పారాయి. తిమ్మాజిపేట, చేగుంట, గొరిట, గుమ్మకొండ తదితర గ్రామాల్లో చెరువులు అలుగెళ్లాయి. పలు గ్రామల్లో రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. మండలంలో ఉదయం 8:30 గంటల వరకు 5.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తాసిల్దార్‌ సరస్వతి తెలిపారు. 

అలుగుపారిన చెరువులు

బిజినేపల్లి : మండలంలోని పాలెం, బిజినేపల్లి, ఖానాపూర్‌ గ్రామాల్లోని చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయి. శనివారం కురిసిన వర్షానికి అలుగు పారాయి. చిన్నారులు చెరువులు, కుంటల వద్దకు చేరుకొని కేరింతలు కొడుతూ ఆనందం వ్యక్తం చేశారు. 

ఉధృతంగా పారుతున్న దుందుభీ

తిమ్మాజిపేట : భారీ వర్షాలతో దుందుభీ నది ఉప్పొంగుతున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి నది పరవళ్లు తొక్కుతున్నది. సుమారు ఆరు అడుగులకు పైగా నీరు ప్రవహిస్తున్నది. నది నిండుగా పారుతుండంతో తిమ్మాజిపేట, మిడ్జిల్‌, జడ్చర్ల, తాడూర్‌ మండలంలోని పరీవాహక ప్రాంత రైతులకు సాగునీటి ఇబ్బందులు తొలగనున్నాయి.

తెలకపల్లిలో..

తెలకపల్లి : మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం వరకు మోస్తరు వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో పంటలకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. 


logo