గురువారం 29 అక్టోబర్ 2020
Nagarkurnool - Sep 26, 2020 , 06:23:50

గ్రామాల్లోని సమస్యలను స్థ్ధానికంగా పరిష్కరించాలి

గ్రామాల్లోని సమస్యలను స్థ్ధానికంగా పరిష్కరించాలి

  • ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యుడు చిలకమర్రి నర్సింహ
  • కల్వకుర్తిలో సర్పంచులు, ఎంపీటీసీలకు అవగాహన 

కల్వకుర్తి రూరల్‌ : గ్రామాల్లోని సమస్యలను స్థ్ధానికంగా పరిష్కరించాలని, సర్పంచులు, ఎంపీటీసీలు రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా వ్యవహరిస్తూ తమ హక్కులు, అధికారాలను సద్వినియోగం చేసుకోవాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యుడు చిలకమర్రి నర్సింహ కోరారు. శుక్రవారం పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలోని ధ్యాప గోపాల్‌రెడ్డి సమావేశ మందిరంలో మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలకు  ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం, పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రపతి నుంచి వార్డు సభ్యుల వరకు అందరికీ రాజకీయ హక్కులు సమానంగా ఉంటాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నిమ్న జాతి ప్రజలకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ఒక బ్రహ్మాస్త్రం లాంటిదన్నారు. డీఎస్పీ గిరిబాబు, ఆర్డీవో రాజేశ్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. గ్రామాలలో గొడవలు చెలరేగితే వాటిని సమన్వయంతో పరిష్కరించాలన్నారు. కల్వకుర్తి మున్సిపాలిటీలోని మూడు వార్డుల్లో ఎస్సీ రిజర్వేషన్‌కు చెందిన ఎస్‌ఎఫ్‌సీ నిధులను వేరే వార్డులను కేటాయించారని.., ఆ నిధులను తిరిగి తమ వార్డులకే ఇవ్వాలని కోరుతూ కౌన్సిలర్లు శ్రీనివాసులు, రవీందర్‌, పద్మ కమిషన్‌ సభ్యుడికి వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సునీత, తాసిల్దార్‌ రాంరెడ్డి, సర్పంచ్‌ల సంఘం మండలాధ్యక్షుడు జంగయ్య, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. 

సర్పంచుకు పరామర్శ

రెండు రోజుల కిందట ఆత్మహత్యాయత్నానికి పాల్పడి.., కల్వకుర్తి పట్టణంలోని ప్రైవేట్‌ దవాఖానలో చికిత్స పొందుతున్న వంగూరు మండలం రంగాపూర్‌ సర్పంచ్‌ ఝాన్సీని కమిషన్‌ సభ్యుడు పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అధైర్యపడొద్దని, న్యాయం చేస్తానని బాధితురాలికి హామీ ఇచ్చారు. గ్రామంలో అభివృద్ధికి అడ్డుపడిన ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. సర్పంచ్‌ ఫిర్యాదును పట్టించుకోని ఎస్సైపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. logo