శనివారం 31 అక్టోబర్ 2020
Nagarkurnool - Sep 25, 2020 , 05:37:17

రోడ్డుపై మహిళ ప్రసవం

రోడ్డుపై మహిళ ప్రసవం

  • దవాఖానకు చేరేలోపే బిడ్డ మృతి

నాగర్‌కర్నూల్‌ క్రైం: ఓ మహిళ రోడ్డుపై ప్రసవించిన సంఘటన నాగర్‌కర్నూల్‌ మున్సిపల్‌ పరిధిలోని దేశిటిక్యాల గ్రామంలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. దేశిటిక్యాలకు చెందిన లక్ష్మిదుర్గ కాన్పుకోసం పురుటినొప్పులతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు ఫోన్‌ చేశారు. చాలా సేపటి వరకు అంబులెన్స్‌ రాకపోవడంతో దవాఖానకు వచ్చేందుకు ఇంటి నుంచి రోడ్డు వరకు వచ్చింది. ఇదే క్రమంలో మున్సిపల్‌లో స్వీపర్‌గా పనిచేస్తున్న జ్యోతి ఆమెను నాగర్‌కర్నూల్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేసినా వాహనాలేవీ ఆపకపోవడంతో రోడ్డుపైనే ప్రసవించింది. ఇంతలో నాగర్‌కర్నూల్‌ నుంచి పెద్దకొత్తపల్లి మండలం మారెడుమాన్‌దిన్నె గ్రామానికి చెందిన శివుడు అనే యువకుడు సంఘటనను చూసి చలించిపోయి బాలింతను, మగ బిడ్డను తన ఆటోలో నాగర్‌కర్నూల్‌ ప్రభుత్వ దవాఖానకు తరలించేందుకు సహకరించాడు. పరీక్షించిన డాక్టర్లు బిడ్డ అప్పటికే మృతి చెందినట్లు గుర్తించి బాలింత లక్ష్మిదుర్గకు వైద్యం అందిస్తున్నారు. ఇదిలావుండగా 108 అంబులెన్స్‌ సిబ్బంది స్పందించి సమయానికి వచ్చి ఉంటే బిడ్డ బతికి ఉండేవాడని గ్రామస్తులు పేర్కొంటున్నారు.