శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Nagarkurnool - Sep 16, 2020 , 05:45:00

ప్రతి గడప మెచ్చే నాయకులు కావాలి

ప్రతి గడప మెచ్చే నాయకులు కావాలి

  • పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అద్భుత ఫలితాలు రావాలి 
  • ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌  

మహబూబ్‌నగర్‌ :  టీఆర్‌ఎస్‌లో ప్రతి గడప మెచ్చే నాయకులు కావాలని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ శ్రేణులను సమాయత్తం చేసేందుకు మంగళవారం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి మంత్రి హాజరై మాట్లాడారు. పార్టీలో ఉండి ఎవరూ మోసం చేయకూడదన్నారు. ప్రజలకు మంచి చేయాలనే తపన ఉన్న నేతలు గులాబీ పార్టీలో ఉన్నారని తెలిపారు. సేవ చేసే వారిని పార్టీ ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకుంటుందని, అవకాశం వచ్చిన సమయంలో గుర్తింపు లభించనున్నట్లు చెప్పారు.  ప్రతి వార్డులో, ప్రతి గ్రామం, మండలంలో ఉన్న త చదువులు చదివిన వారి వివరాలను పూర్తిస్థాయిలో సేకరించాలన్నారు. టీఆర్‌ఎస్‌కు పట్టం కడితే ఎంత మేలు జరుగుతుందనే విషయాలను సవివరంగా వివరించాలన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌తోపాటు కౌన్సిలర్లు, పార్టీ నాయకులు  పూర్తిస్థాయి బాధ్యతను తీసుకోవాలన్నారు. 

మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పేరు ప్రకటన 

  మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవీ కాలం ముగిసిన తర్వాత నూతన చైర్మన్‌గా అమరేందర్‌ పేరును మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ప్రకటించారు. ఈ మేరకు పార్టీ నాయకులతో పూర్తిస్థాయి చర్చలు జరిపిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పలువురు ముందస్తుగా అమరేందర్‌కు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ నర్సింహులు, డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ కొరమోని వెంకటయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు రాజేశ్వర్‌గౌడ్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ తాటి గణేశ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కాడం ఆంజనేయులు,  టీఆర్‌ఎస్‌ కార్యదర్శి ఇంతియాజ్‌ ఇసాక్‌, నాయకులు రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.  


logo