మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Nagarkurnool - Sep 09, 2020 , 07:30:35

ఇక అవినీతి, అక్రమాలకు చెల్లు చీటీ

ఇక అవినీతి, అక్రమాలకు చెల్లు చీటీ

  • నేడు శాసన సభలో రద్దు బిల్లు
  • నూతన చట్టంపై ప్రజల హర్షం
  • ధర్మగంటతో ఏడాది కిందటే ‘నమస్తే’ గళం

నాగర్‌కర్నూల్‌, నమస్తే తెలంగాణ : వీఆర్‌వో వ్యవస్థ రద్దుపై ప్రజలతో పాటుగా రాజకీయ పార్టీల నుంచి సానుకూల స్పందన వస్తోంది. గ్రామ స్థాయిలో భూ రికార్డుల నిర్వహణను చేపట్టే ఈ వీఆర్‌వో వ్యవస్థ అవినీతిలో కూరుకుపోయింది. దీనివల్ల సామాన్యులు ఆర్థికంగా చితికిపోవడంతో పాటుగా భూములను నష్టపోవడం, ప్రాణాలను కోల్పోయే పరిస్థితులు సర్వసామాన్యంగా మారాయి. దశాబ్దాలుగా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న ఈ వ్యవస్థను నూతనంగా వ్యవస్థీకరించేందుకు సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై కేబినెట్‌లో తీర్మానించిన

ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నది. కాగా ఈ నిర్ణయంపై జిల్లాలో రాజకీయ పార్టీలతో పాటుగా మేధావులు, రెవెన్యూ వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంతో పాటుగా పలు గ్రామాల్లోనూ భూ రికార్డుల నిర్వహణలో వీఆర్‌వోలు వివాదాస్పదులుగా మారారు. విద్యార్థులకు కులం, ఆదాయం సర్టిఫికెట్ల నుంచి విరాసత్‌, మ్యూటేషన్‌, పాస్‌బుక్కులు, తదితర పనుల కోసం వీఆర్‌వోలు ప్రజలను కాళ్లరిగేలా తిప్పుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో విసిగి వేసారిన పలువురు ఏసీబీని ఆశ్రయించగా జిల్లాలోని తెలకపల్లి, నాగర్‌కర్నూల్‌, అచ్చంపేట, బల్మూర్‌, లింగాలలాంటి పలు ప్రాంతాల్లో గతంలో వీఆర్‌వోలు ఏసీబీకి పట్టుబడిన సంఘటనలు ఉన్నాయి. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం తాసిల్దార్లు, కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు, రాస్తారోకోలు కూడా చేపట్టారు. ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే భూ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో రెవెన్యూ వ్యవస్థపై ఏడాది కిందట ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక ధర్మగంట మోగించింది. దీనికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది.

తమ భూ సమస్యల పరిష్కారం కోసం ఎందరో ధర్మగంటను ఆశ్రయించారు. ఈ కథనాలు ప్రచురితం కావడంతో రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు స్పందించి చర్యలు చేపట్టారు. ఈ ధర్మగంట రెవెన్యూ శాఖలో అక్రమాలను బట్టబయలు చేసింది. కలెక్టరేట్‌లోనూ ప్రత్యేకంగా ఓ అధికారిని నియమించి ఈ కథనాల్లో వచ్చే సమస్యల పరిష్కారంపై చర్యలు తీసుకొన్నారు. ఇలా ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనలో గొంతుకగా మారింది. మొత్తం మీద రెవెన్యూ శాఖ ప్రక్షాళనతో పాటుగా వీఆర్‌వో వ్యవస్థ రద్దుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అన్ని వర్గాల ప్రజల నుంచి సానుకూలత వ్యక్తమవుతోంది.logo