గురువారం 01 అక్టోబర్ 2020
Nagarkurnool - Sep 02, 2020 , 02:48:22

భూ క్రమబద్ధీకరణకు పచ్చజెండా

భూ క్రమబద్ధీకరణకు పచ్చజెండా

భూ క్రమబద్ధీకరణకు సర్కార్‌ మరోసారి పచ్చజెండా ఊపింది. మున్సిపాలిటీలతో పాటు గ్రామ పంచాయతీల్లోనూ అనుమతి లేని లే అవుట్లు, ప్లాట్లను రెగ్యులరైజ్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఇటీవలే లే అవుట్లు లేని ప్లాట్ల రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం తాజాగా భూ క్రమబద్ధీకరణ చేసుకునేందుకు పుర, పంచాయతీలకు ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్‌ 15వ తేదీ వరకు క్రమబద్ధీకరణ చేసుకునేందుకు గడువు ఇవ్వగా ఆయా కార్యాలయాల్లో అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేపడుతున్నది.

నాగర్‌కర్నూల్‌, నమస్తే తెలంగాణ/మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ : అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఈ మేరకు మంగళవారం జీవోను విడుదల చేసింది. అక్టోబర్‌ 15వ తేదీ వరకు రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ లు, మున్సిపాలిటీల పరిధిలోని లే అవుట్లు, ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవచ్చు. ఇటీవలే ప్రభుత్వం అనధికారిక అనుమతులు ఉన్న ప్లాట్లు, భూముల రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా తాజాగా భూ క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించడం గమనార్హం. 

‘రియల్‌' దందా..

తెలంగాణ ఏర్పడిన తర్వాత కొత్త జిల్లాలు ఏ ర్పాటు చేశారు. జిల్లా కేంద్రాల శివారుతోపాటు ము న్సిపాలిటీలు, పంచాయతీల పరిధిలో ప్రధాన రోడ్ల వెంట రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు పెద్ద ఎత్తున వెం చర్లు ఏర్పాటు చేశారు. అయితే, ఇందులో చాలా వెం చర్లను మున్సిపాలిటీలు, పంచాయతీల అనుమతులు లేకుండానే ప్లాట్లుగా చేసి విక్రయించారు. దీంతో ప్లాట్లు కొనుగోలు చేసిన తర్వాత ఇండ్ల నిర్మాణాల అ నుమతులకు, బ్యాంకు రుణాలకు వెళ్లిన వారికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇంటి నెంబర్లు ఇవ్వడం లే దు. నిబంధనల ప్రకారం వెంచర్లలో 10 శాతం భూమిని పంచాయతీలు, మున్సిపాలిటీలకు దాఖలు చేయాలి. రోడ్లు, మురుగు కాల్వలు, కమ్యూనిటీ భవనాలు, విద్యుత్‌, నీటిసరఫరా వంటి సౌకర్యాలు కల్పించాలి. ఇవేవీ పట్టించుకోని వ్యాపారులు ప్రజలను పలు రకాలుగా ఆకర్షిస్తూ ప్లాట్లను కట్టబెడుతున్నారు. ప్రభుత్వ భూములు, చెరువు శిఖం భూముల్లోనూ అక్రమ లేఅవుట్లు వేస్తూ కొందరు రియల్‌ వ్యాపారు లు సొమ్ము చేసుకుంటుండగా సామాన్యులు నష్టపోతున్నారు. ఇబ్బందులు పడుతున్నా విక్రేతలు మాత్రం పట్టించుకోవడం లేదు. 

పారదర్శకత కోసం..

ఇబ్బందులను గమనించిన ప్రభుత్వం ప్రజలకు పారదర్శకంగా ఉండేందుకు లే అవుట్లు, ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు మరోసారి అవకాశం కల్పించింది. అక్టోబర్‌ 15వ తేదీ వరకు లే అవుట్‌, ప్లాట్లను క్రమబద్ధీకరణ చేసుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసిం ది. ఉమ్మడి జిల్లాలో వందల సంఖ్యలో వెంచర్లు వెలిశాయి. ఇందులో వేలాది మంది ప్లాట్లు కొనుగోలు చే శారు. ఇప్పటికీ లే అవుట్లు చేయించుకోలేని వెంచర్ల వ్యాపారులకు, రిజిస్ట్రేషన్లు చేయించుకోలేని పరిస్థితు లు ఉన్న ప్రజలకు ఈ నిర్ణయం కాస్త ఊరట కలిగిస్తున్నది. మూడు నుంచి ఐదేండ్లకోసారి మార్కెట్‌ ధరలు మారుతుంటాయి. ఈ నేపథ్యంలో కొనుగోళ్లు, అమ్మకాలకు రెగ్యులరైజ్‌ చేసుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయంతో మున్సిపాలిటీలు, పంచాయతీల్లో భూ క్రమబద్ధీకరణ చేపట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 26వ తే దీ వరకు ప్లాట్లు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నవారికి ఈ పథకం వర్తించనున్నది. అక్టోబర్‌ 15 నాటికి దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఇచ్చింది. ముందుగా రూ.1000 ఆన్‌లైన్‌లో చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. తరువాత ప్లాట్‌ విస్తీర్ణం బట్టి ఫీజు నిర్ణయిస్తుంది.

పెరగనున్న పురపాలిక ఆదాయం..

క్రమబద్ధీకరణతో మున్సిపాలిటీల్లో ఆదాయం బా గా పెరగనున్నది. మహబూబ్‌నగర్‌ పట్టణంలో దాదా పు 15 వేల వరకు ప్లాట్లు ఉన్నట్లు అధికారులు అం చనా వేశారు. గతంలో క్రమబద్ధీకరణకు అవకాశం ఇ వ్వగా, దాదాపు 8 వేల ప్లాట్లు క్రమబద్ధీకరించారు. దీం తోపాటు జడ్చర్ల, భూత్పూర్‌ మున్సిపాలిటీల్లో 8 వేల వరకు అనుమతి లేని ప్లాట్లు ఉన్నాయి. ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా పారదర్శకత పెరగనున్నది. పక్కాగా నిబంధన లు పాటించిన వారికే రిజిస్ట్రేషన్‌ చేయనున్నారు.

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఇలా..

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో అనుమతులు తీసుకున్న వెంచర్లకన్నా.. అనధికారిక లే అవుట్లే అధికంగా ఉన్నా యి. నాగర్‌కర్నూల్‌ మున్సిపాలిటీ పరిధిలో ఇలా 22 వెంచర్లు వెలిశాయి. అచ్చంపేటలో 20, కల్వకుర్తిలో 15, కొల్లాపూర్‌లో 13 అక్రమ వెంచర్లు ఉండటం గ మనార్హం. ఇక గ్రామ పంచాయతీల విషయానికి వస్తే 10 వెంచర్లకు మాత్రమే అనుమతి ఉండగా 81 అక్రమంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికే మున్సిపల్‌ అధికారులు ఈ వెంచర్లలోని రాళ్లను, ఇతర నిర్మాణాలను తొలగించారు. ఈ భూమిని తాకట్టు పెట్టుకునేందుకు కూడా అవకాశం ఉంటుంది. భూ క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించడంతో ఇ టీవలే నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు కూడా తిరిగి ఊపందుకోనున్నాయి. జిల్లా లో రోజూ 200 నుంచి 250 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా.. రిజిస్ట్రేషన్ల నిలిపివేతతో వంద కూడా దాటడం లేదు.


logo