శనివారం 19 సెప్టెంబర్ 2020
Nagarkurnool - Aug 31, 2020 , 05:03:29

అభివృద్ధి పథంలో కొల్లాపూర్‌

అభివృద్ధి పథంలో కొల్లాపూర్‌

  • సింగోటం- గోపల్‌దిన్నె లింక్‌ కెనాల్‌కు రూ.147.10కోట్లు
  • పర్యాటక కేంద్రంగా సోమశిల
  • రైతుల కోసం రూ.11కోట్లతో 56 రైతు వేదికలు
  • సమస్యల పరిష్కారంపై ఎమ్మెల్యే బీరం ప్రత్యేక దృష్టి

అభివృద్ధి పథంలో కొల్లాపూర్‌ నియోజకవర్గం దూసుకెళ్తున్నది. సమైక్య రాష్ట్రంలో సాగునీటికి నోచుకోని ఈ ప్రాంతంఎంజీకేఎల్‌తో బీడు భూముల్లో కృష్ణమ్మపరుగులు పెడుతుండటంతో బంగారు పంటలు పండుతున్నాయి. భవిష్యత్‌లో మరో కోనసీమగా మారనున్నది. ఇక సోమశిల పర్యాటక హబ్‌గా రూపుదిద్దుకుంటున్నది.ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి వినతి మేరకు సింగోటం రిజర్వాయర్‌ నుంచి గ్రావిటీ కెనాల్‌ ద్వారా గోపల్‌దిన్నె రిజర్వాయర్‌కు కృష్ణమ్మను తరలించేందుకు సీఎం కేసీఆర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. రూ.147.10 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వ పాలన అనుమతులు జారీ చేశారు. కొల్లాపూర్‌ పట్టణం సుందరీకరణకు నిధులు మంజూరవగా త్వరలో టెండర్లు పిలువనున్నారు. - కొల్లాపూర్‌

కొల్లాపూర్‌: కొల్లాపూర్‌ నియోజకవర్గం అభివృద్ధికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తున్నది. సమీపంలోనే కృష్ణానది ఉన్నా సమైక్య రాష్ట్రంలో సాగునీటికి నోచుకోని ఈ ప్రాంతం ప్రస్తుతం బంగారు పంటలకు నిలయంగా మారింది. అన్ని ప్రాజెక్టులకు ముఖ ద్వారంగా ఉన్న కొల్లాపూర్‌ భవిష్యత్‌లో మరో కోనసీమగా మారనున్నది. పర్యాటకంగానూ సోమశిల, సింగోటం రూపంలో కొల్లాపూర్‌కు ప్రత్యేక స్థానం లభిస్తున్నది. మామిడి పండ్లు అంటేనే కొల్లాపూర్‌ గుర్తుకు వస్తుంది. అలాంటి మామిడి రైతుకు మార్కెటింగ్‌ సమస్య త్వరలో తీరి వ్యాపారులే ఇక్కడికి వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సోమశిల- సిద్ధేశ్వరం బ్రిడ్జి నిర్మాణం కోసం స్థానిక ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గాన్ని భవిష్యత్‌లో మరింత అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఎమ్మెల్యే చొరవతో  రూ.147.10కోట్లు మంజూరు

జూరాల, భీమా కెనాల్‌ ద్వారా వీపనగండ్ల, చిన్నంబావి మండలాల పరిధిలో చివరి ఆయకట్టు సుమారు 35వేల ఎకరాలకు సాగునీరందక రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితి నుంచి రైతులకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే బీరం కోరిక మేరకు సింగోటం రిజర్వాయర్‌ నుంచి గ్రావిటీ కెనాల్‌ ద్వారా కృష్ణానది నీటిని గోపల్‌దిన్నె రిజర్వాయర్‌కు మళ్లించేందుకు సీఎం కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ నెల మొదటి వారంలో రూ.147.10 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. త్వరలో పనులకు టెండర్లు పిలువనున్నారు. 

పర్యాటకానికి కేరాఫ్‌ అడ్రస్‌

కొల్లాపూర్‌ నియోజకవర్గం పర్యాటకానికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. ఎకో టూరిజంలో భాగంగా సోమశిల వద్ద ప్రత్యేకంగా హరిత హోటల్‌, కాటేజీలు, లాంచీ సౌకర్యం ఏర్పాటు చేయడంతో పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివస్తున్నారు. సోమశిల నుంచి శ్రీశైలం లాంచీ ప్రయాణం మరో పాపికొండల పర్యటనను తలపిస్తున్నది. హైదరాబాద్‌కు సమీపంలో ఉండటం వల్ల వారాంతపు పర్యాటకం మరింతగా పెరిగే అవకాశం ఉన్నది. నల్లమల అందాలు, కృష్ణానది హొయలు చూసేందుకు టూరిస్టులు భవిష్యత్‌లో క్యూ కట్టేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉపాధి అవకాశాలు మరింతగా పెరిగేందుకు అవకాశం ఏర్పడింది. 

అనేక అభివృద్ధి పనులు

కొల్లాపూర్‌ పట్టణ సుందరీకరణకు ప్రభుత్వం రూ.7కోట్ల నిధులు మంజారు చేసింది. చిన్నమారూర్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ నిర్వహణకు రూ.4.5కోట్లు మంజారు కాగా త్వరలో టెండర్లు పిలుస్తారు. రూ.6.8కోట్లతో పాన్‌గల్‌, మారెడుమాన్‌దిన్నె వద్ద రెండు చెక్‌డ్యాంల నిర్మాణం ప్రారంభమైంది. నార్లాపూర్‌, సింగవట్నం గ్రామాల్లో విద్యుత్‌సబ్‌స్టేషన్లు ప్రారంభమయ్యాయి. సీఎం సహాయనిధి కింద నియోజకవర్గంలో మొత్తం 455 మందికి రూ.4.5కోట్లు మంజూరయ్యాయి. ఎంజీకేఎల్‌ఐ రెండో లిఫ్ట్‌ జొన్నలబొగుడ రిజర్వాయర్‌ నుంచి బాచారం హైలెవల్‌ కెనాల్‌ ఏర్పాటు ప్రక్రియ ప్రభుత్వం ఆమోదం దశలో ఉన్నది. కొల్లాపూర్‌ ప్రాంతంలో అధికంగా మామిడి సాగు కావడంతో రైతుల మార్కెటింగ్‌ సమస్య తీర్చేందుకు కొల్లాపూర్‌ మండలం మాచినేనిపల్లి సమీపంలో150 ఎకరాలలో మ్యాంగో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కేంద్రం మంజూరుకు ప్రతిపాదనలు పంపారు. 

రూ.కోట్లతో 50 రైతు వేదికలు

నియోజకవర్గంలోని కొల్లాపూర్‌, పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి, కోడేరు, వీపనగండ్ల, చిన్నంబావి, పాన్‌గల్‌ మండలాల్లో రైతులకు సాగు విధానంలో నూతన మెళకువలపై తర్ఫీదునిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి క్లస్టర్‌కు ఒక రైతు వేదిక భవనం మంజూరు చేసింది. 56 రైతు భవనాలకు రూ.11కోట్లు మంజూరయ్యాయి. వ్యవసాయ శాస్త్రవేత్తలు సాగులో ఆధునిక పద్ధతులపై రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు.

ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి జన్మదిన వేడుకలకు ఏర్పాట్లు

సోమవారం ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి జన్మదినం సందర్భంగా పట్టణంలోని ప్రధాన కూడళ్లలో భారీ ఎత్తున  ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఉదయం 10గంటలకు పట్టణంలోని ఎన్టీఆర్‌ చౌరస్తాలో పార్టీ శ్రేణులు భారీ కేక్‌ కట్‌ చేయనున్నారు.  అదే చౌరస్తాలో ఓ  భవనానికి ఎమ్మెల్యే ఫొటోతో కూడిన బెలూన్‌ను ఆకాశంలో ఎగురవేశారు. పట్టణంలో మొక్కలు నాటి, దవాఖానలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేయనున్నారు.

అభివృద్ధికి చిరునామాగా కొల్లాపూర్‌

సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ఆశీర్వాదంతో ఈ ప్రాంత చిరకాల కల సోమశిల- సిద్ధేశ్వరం బ్రిడ్జి నిర్మాణం, శ్రీశైలం నిర్వాసితుల సమస్యకు శాశ్వత పరిష్కారం సాధించాలనేది నా తపన. సీఎం కేసీఆర్‌, మంత్రి నిరంజన్‌రెడ్డి సహకారంతో మామిడి మార్కెట్‌ ఏర్పాటు, సోమశిలలో వీకెండ్‌ టూరిజం అభివృద్ధి చేస్తాం. సింగోటం- గోపల్‌ దిన్నె లింక్‌ కెనాల్‌కు మార్గం సుగమం చేయడంతో వీపనగండ్ల, చిన్నంబావి రైతుల సమస్యకు పరిష్కారం చూపించాం. కొల్లాపూర్‌ అంటేనే అభివృద్ధికి చిరునామా అన్నట్లుగా మార్చి చూపిస్తున్నాం. 

- బీరం హర్షవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్యే, కొల్లాపూర్‌logo