శనివారం 19 సెప్టెంబర్ 2020
Nagarkurnool - Aug 15, 2020 , 07:12:38

వాగులో పడి ఇద్దరు బాలురు మృతి

వాగులో పడి  ఇద్దరు బాలురు మృతి

  • గుబ్బలమంగి వాగు వద్ద ఘటన.. 
  • గొర్రెపేట వాగులో మరో మహిళ గల్లంతు

పర్ణశాల: చేపలు పట్టేందుకు వెళ్లి గుబ్బలమంగి ప్రాజెక్టులో పడి ఇద్దరు గిరిజన యువకులు మృతిచెందిన సంఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. దుమ్ముగూడెం మండలం తాటివారిగూడెం గ్రామానికి చెందిన గొంది కిరణ్‌ (17), జిన్నెలగూడెం గ్రామానికి చెందిన పొడియం రవికుమార్‌ (13) గుబ్బలమంగి ప్రాజెక్టు వద్ద వాగులో చేపలు పట్టేందుకు సాయంత్రం 4 గంటల సమయంలో వెళ్లారు. వాగులో చేపల కోసం వలవేసి ఒడ్డుపై కూర్చున్నారు. వలలో చేపలు పడ్డాయా? లేవా? అని చూడటానికి వాగులోకి దిగారు. చిన్నగుబ్బలమంగి వాగు అప్పటికే ఉధృతంగా ప్రవహిస్తోంది. యువకులు అందులోకి వెళ్లగానే ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో వారు అందులోనే మునిగారు. ఈత రాకపోవడంతో అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాలు వాగులో వేసిన వలకు చిక్కుకోగా స్థానికులు బయటకు తీశారు. ఎంపీపీ రేసు లక్ష్మి, దుమ్ముగూడెం తహసీల్దార్‌ రాంనరేశ్‌, ఎంపీడీవో ముత్యాలరావు, గౌరారం సర్పంచ్‌ జ్యోతి సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. 

గొర్రెపేటవాగులో మహిళ గల్లంతు

మణుగూరు రూరల్‌: బుగ్గ పంచాయతీ పరిధిలో ప్రవహించే గొర్రెపేట వాగులో మహిళ గల్లంతైంది. బుగ్గ పంచాయతీకి చెందిన వట్టం పాపమ్మ (50) తన కుటుంబసభ్యులతో కలిసి పగిడేరులో పని నిమిత్తం వెళ్లింది. తిరుగు ప్రయాణంలో గొర్రెపేటవాగు దాటే క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ముగ్గురూ గల్లంతయ్యారు. ఇద్దరు ఒడ్డుకు చేరుకోగా.. మహిళ ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. సాయంత్రం 6 గంటల సమయం వరకు వెతికినా ప్రయోజనం లేకపోయింది. గొర్రెపేటవాగు ఉధృతంగా ప్రవహించడంతో కుటుంబ సభ్యులు వెనుదిరిగారు.


logo