శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Nagarkurnool - Aug 14, 2020 , 04:13:20

ప్రతి పల్లెలో మార్పురావాలి

ప్రతి పల్లెలో మార్పురావాలి

  • l స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలి
  • l అధికారులకు సూచనలు చేసిన కలెక్టర్‌ శర్మన్‌
  • l ఆర్డీవో, తాసిల్దార్‌ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీ

కల్వకుర్తి రూరల్‌ : జిల్లాలోని ప్రతి పల్లెలో మార్పులు రావాలని, స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కలెక్టర్‌ శర్మన్‌ అధికారులకు సూచించారు. కల్వకుర్తి పట్టణంలోని ఆర్డీవో కార్యాలయాన్ని ఆయన గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్డీవో రాజేశ్‌కుమార్‌, తాసిల్దార్‌ రాంరెడ్డి కలెక్టర్‌కు స్వాగతం పలికారు. అనంతరం మున్సిపల్‌ కమిషనర్‌ జాకీర్‌ అహ్మద్‌, ఎంపీడీవో బాలచంద్రసృజన్‌తో కలిసి హరితహారం, అభివృద్ధి పనులపైన సమీక్ష నిర్వహించారు. కల్వకుర్తి మున్సిపాలిటీని హరితమయంగా, ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు. పట్టణంలో రహదారుల వెంట, డివైడర్ల మధ్యలో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. అనంతరం ఎంపీడీవోతో మాట్లాడుతూ గ్రామాలను ఎప్పటికపుడు పర్యవేక్షిస్తూ అభివృద్ధి పథంలో నడిపించాలని సూచించారు. అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు.

తాసిల్దార్‌ కార్యాలయంలో తనిఖీ

వెల్దండ: ప్రభుత్వం చేపడుతున్న  అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు  అధికారులు కంకణబద్ధులు కావాలని కలెక్టర్‌ శర్మన్‌ పేర్కొన్నారు. వెల్దండ తాసిల్దార్‌ కార్యాలయాన్ని కలెక్టర్‌ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరీశీలించారు.  శ్మశానవాటికలు, డంపింగ్‌యార్డుల నిర్మాణాల్లో అలసత్వం సహించేది లేదన్నారు. కరోనాపై సిబ్బంది జాగ్రత్తలు పాటించాలన్నారు. ఆయన వెంట ఆర్డీవో రాజేశ్‌కుమార్‌ ఉన్నారు. తాసిల్దార్‌ కార్యాలయం ఎదుట ఏపుగా పెరిగిన చెట్లను చూసిన కలెక్టర్‌ బండపై మొక్కలు పెట్టి పెంచడం అభినందనీయమని, అందుకు కారణమైన తాసిల్దార్‌ సైదులును కలెక్టర్‌ ‘శభాష్‌' అంటూ ప్రశంసించారు. రాళ్ల గుట్టపై మొక్కలు పెంచడం ఎలా సాధ్య పడిందని అడిగి తెలుసుకున్నారు. 

అభివృద్ధిలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

చారకొండ: గ్రామాల అభివృద్ధిలో ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్‌ శర్మన్‌  హెచ్చరించారు. మండల కేంద్రంలో కలెక్టర్‌ గురువారం ఆకస్మికంగా పర్యటించి తాసిల్దార్‌ కార్యాలయంలో పల్లెప్రగతి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.  గ్రామాల్లో శ్మశానవాటిక, డంపింగ్‌యార్డు, కంపోస్టుషెడ్‌, పల్లెప్రకృతి వనం, రైతువేదిక నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. రోడ్డుకు ఇరువైపులా  మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. గ్రామాల్లో పారిశుధ్య పను లు నిరంతరం చేపట్టాలన్నారు. ప్రతి ఇంటికి ఇంకుడుగుంత నిర్మించుకునేలా ప్రోత్సహించాలని, సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలన్నారు.  సమావేశంలో సర్పంచ్‌ విజేందర్‌గౌడ్‌, ఆర్డీవో రాజేశ్‌కుమార్‌, డీఏవో వెంకటేశ్వర్లు, ఎంపీడీవో జయసుధ, ఉప తాసిల్దార్‌ మహ్మద్‌ అలీ, ఏవో చిన్నహుస్సేన్‌, ఎస్సై కృష్ణదేవ, ఏపీవో వాసుదేవ్‌  పాల్గొన్నారు.

పనులు సకాలంలో పూర్తికావాలి

వంగూరు: గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులు సకాలంలో పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్‌ శర్మన్‌ అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలోని తాసిల్దార్‌ కార్యాలయాన్ని కలెక్టర్‌ శర్మన్‌ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్మాణంలో ఉన్న శ్మశానవాటిక, డంపింగ్‌యార్డులు, ప్రకృతి వనాలు, కల్లాలు నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. రైతువేదిక భవనాలు రెండు నెలల్లో పూర్తి చేసి సిద్ధంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని తాసిల్దార్‌ను ఆదేశించారు. కలెక్టర్‌ వెంట ఆర్డీవో రాజేశ్‌కుమార్‌ ఉన్నారు.logo