బుధవారం 30 సెప్టెంబర్ 2020
Nagarkurnool - Aug 14, 2020 , 00:45:40

యార్డుల్లో కొనుగోళ్ల‌కు శ్రీకారం

యార్డుల్లో కొనుగోళ్ల‌కు శ్రీకారం

  • n ‘వన్‌ నేషన్‌-వన్‌ మార్కెట్‌'తో నిష్ప్రయోజనం
  • n ఉపాధి కోల్పోయిన ఉద్యోగులు, హమాలీలు
  • n రూ.కోట్లల్లో చేజారిన ఆదాయం
  • n మార్కెట్‌ యార్డుల పునర్‌వైభవానికి శ్రీకారం
  • n జీవో 376ను జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
  • n మార్కెట్‌ ఉద్యోగులు, పాలకమండళ్ల హర్షం

మార్కెట్‌ యార్డులు బలోపేతం కానున్నాయి.. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జీవో 376ను విడుదల చేసింది.. దీంతో కేంద్రం ప్రవేశపెట్టిన ‘వన్‌ నేషన్‌-వన్‌ మార్కెట్‌' విధానంతో కుదేలైన మార్కెట్‌ యార్డులను తిరిగి గాడిలో పెట్టే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది.. ఈ క్రమంలో తీసుకొచ్చిన జీవో మార్కెట్‌ పాలక మండళ్లలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నది.. ఉపాధి కోల్పోయిన వందలాది మందికి పని దొరకనున్నది.. ఫలితంగా రానున్న సీజన్‌లో మార్కెట్‌ యార్డుల్లోనూ ధాన్యం కొనుగోలు చేసేలా పాలక మండళ్లు, అధికారులు చర్యలు తీసుకోనున్నారు..

- నాగర్‌కర్నూల్‌, నమస్తే తెలంగాణ

మార్కెట్‌ యార్డులను బలోపేతం చేసేందుకు తీసుకొచ్చిన జీవో 376తో కమిటీలు, ఉద్యోగులకు పూర్వ వైభవం రానున్నది. రైతులు ధాన్యాన్ని మార్కెట్‌ యార్డులకు తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. కాగా, గత సీజన్‌కు ముందు కేంద్ర ప్రభుత్వం వన్‌ నేషన్‌-వన్‌ మార్కెట్‌ విధానాన్ని తీసుకొచ్చింది. ధాన్యాన్ని మార్కెట్‌ యార్డులతో పని లేకుండా ఆన్‌లైన్‌ ద్వారా ఎక్కడి నుంచైనా, ఎక్కడికైనా విక్రయించుకోవచ్చని పేర్కొంది. అయితే, గ్రామీణ స్థాయిలో ఈ విధానం రైతులకు చేరలేదు. సాంకేతికంగా అవగాహన లేకపోవడం, రవాణా సమస్యల వల్ల వన్‌ నేషన్‌-వన్‌ మార్కెట్‌ విధానం కేవలం పేరుకే మిగిలిపోయింది. దీంతో రైతులు దళారులకు అమ్మి వారి చేతిలో మోసపోయారు. ఐకేపీ, మెప్మా, సింగిల్‌విండోలు రైతుల నుంచి కూడా ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నాయి. ఫలితంగా మార్కెట్‌ యార్డులు కూడా ఆదాయం కోల్పోయే పరిస్థితులు వచ్చాయి. మార్కెట్‌ కమిటీలు మార్కెట్‌ ఫీజును కోల్పోయాయి. పంట ఉత్పత్తులపై ఒక శాతం మార్కెట్‌ ఫీజులను నష్టపోయాయి. ఈ నిధులతో కమిటీల ద్వారా రైతులకు గోదాంల నిర్మాణాలు చేపట్టి మేలు కల్పించేలా చర్యలు చేపట్టేవారు. మార్కెట్‌ చెక్‌ పోస్టులు కూడా నిరుపయోగంగా మారాయి.

కోల్పోతున్న ఆదాయం..

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో నాలుగు యార్డులు ఉండగా ప్రతి సీజన్‌లో రూ.5కోట్లకు పైగా ఆదాయం సమకూరేది. వన్‌ నేషన్‌ విధానంతో గత సీజన్‌లో రూ.కోటి వరకు మాత్రమే ఆదాయం వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇవే పరిస్థితులు నెలకొనడంతో మార్కెట్‌యార్డుల్లోని ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు. కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితులు వచ్చాయి. కమీషన్‌దారులు, వ్యాపారులు దివాళా తీశారు. చాలా మంది ఇతర వ్యాపారాల వైపు దృష్టి మరల్చారు. ముఖ్యంగా మార్కెట్‌ యార్డులను నమ్ముకొన్న వందలాది మంది హమాలీలు, కూలీలు సైతం ఉపాధికి దూరమయ్యారు. కమిటీ చైర్మన్‌, డైరెక్టర్లు పేరుకు మాత్రమే మిగిలారు. పాలక మండళ్లు అలంకార ప్రాయంగా మారాయి. ఈ కారణాలతో రైతులు మార్కెట్‌ యార్డులకు అడుగు పెట్టడం మర్చిపోయారు. ఈ క్రమంలో మార్కెట్‌ యార్డులకు పునర్‌వైభవం తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుని జీవో 376ను జారీ చేసింది. ఈ జీవో ప్రకారం ఇకపై మార్కెట్‌ కమిటీలు, సబ్‌ మార్కెట్లలో ధాన్యం కొనుగోళ్లు చేసేందుకు వెసులుబాటు కలగనున్నది. ఇలా ధాన్యం కొనుగోళ్లతో, సివిల్‌ సైప్లె ద్వారా వచ్చే కమీషన్లతో మార్కెట్‌ కమిటీలు ఆదాయం సమకూర్చుకోవాలని జీవోలో పేర్కొన్నారు. ఈ వానకాలం నుం చి ధాన్యం కొనుగోలు చేయనుండడంతో ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 376తో మార్కెట్‌ యార్డులకు, మార్కెట్‌ కమిటీలకు పూర్వవైభవం రానున్నది. రైతులతో మార్కెట్‌ యార్డులు కళను సంతరించుకోనున్నాయి. ఈ జీవో విడుదలపై అధికారులు, పాలకమండళ్లు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

376 జీవోతో లాభం..

వన్‌ నేషన్‌-వన్‌ మార్కెట్‌తో రైతులు, మా ర్కెట్‌ యార్డులకు నష్టం కలిగింది. గ్రామ స్థా యిలో రైతులకు లాభం చేకూరలేదు. మార్కెట్‌ యార్డులు ఆదాయాన్ని కోల్పోతున్నాయి. మా ర్కెట్‌కు వచ్చే ఆదాయంతో రైతుల కోసం గో దాంలు, ఇతర ప్రయోజనకర పనులు చేపట్టే వాళ్లం. నష్టాన్ని పూడ్చేలా రాష్ట్ర ప్రభుత్వం జీవో 376 తీసుకురావడం సంతోషకరం. మార్కెట్‌ యార్డులకు పునర్‌వైభవం రానున్నది. 

- దొడ్ల ఈశ్వర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌, నాగర్‌కర్నూల్‌

మార్కెట్‌ యార్డుల్లో కొనుగోళ్లకు చర్యలు..

గతంలో రూ.5.50 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. వన్‌ నేషన్‌-వన్‌ మార్కెట్‌తో జిల్లాలో రూ.కోటి వరకే ఆదాయం వచ్చింది. వరి, పత్తిలాంటి పంటల కొనుగోళ్లన్నీ బయటే జరిగాయి. దీంతో మార్కెట్‌ యార్డులు నష్టాలను చవిచూశాయి. ఇది గుర్తించిన ప్రభుత్వం కొత్తగా 376 జీవోను జారీ చేసింది. దీని ప్రకారం ఈ వానకాలం నుంచి మార్కెట్‌ యార్డుల్లో ధాన్యం కొనుగోళ్లకు చర్యలు తీసుకుంటాం. 

- బాలమణెమ్మ, మార్కెటింగ్‌ ఏడీ, నాగర్‌కర్నూల్‌logo