మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Nagarkurnool - Aug 11, 2020 , 03:35:12

వేరుశనగ కేరాఫ్‌ కందనూలు !

వేరుశనగ కేరాఫ్‌ కందనూలు !

  • రైతు ఉత్పత్తి సంస్థల కింద నాగర్‌కర్నూల్‌ జిల్లా ఎంపిక
  • ఐదేండ్లపాటు ప్రత్యేక కార్యాచరణ       
  • ఎఫ్‌పీవో పథకం కింద ప్రణాళిక
  • జిల్లా పంటగా ప్రకటించిన ప్రభుత్వం     
  • వేరుశనగ రైతులకు ప్రయోజనం

నాగర్‌కర్నూల్‌ జిల్లా పంటగా వేరుశనగను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. కేంద్రం ప్రవేశపెట్టిన ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్స్‌ ఆర్గనైజేషన్‌  (ఎఫ్‌పీవో) పథకంలో భాగంగా ఆయా జిల్లాల వారీగా ప్రత్యేక పంటలకు ప్రోత్సాహం అందించనున్నది. ఇందులో భాగంగా వేరుశనగను జిల్లా పంటగా గుర్తించింది. 2019-2020నుంచి 2023-2024వరకు వేరుశనగ పంట సాగునుంచి విక్రయించే వరకు రైతన్నలకు చేయూతనివ్వనున్నది. త్వరలో ఈ పథకానికి సంబంధించి పూర్తిస్థాయి కార్యాచరణను ప్రభుత్వం వెల్లడించనున్నది. దీంతో జిల్లాలో వేరుశనగ రైతులకు మంచి రోజులు రానున్నాయి. 

- నాగర్‌కర్నూల్‌, నమస్తే తెలంగాణ

దేశవ్యాప్తంగా వాతావరణ, భూ పరిస్థితులను బట్టి రకరకాల పంటలు పండిస్తున్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా పంటగా వేరుశనగను ఎంపికచేశారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో పది వేల ఎఫ్‌పీవోలను ఏర్పాటు చేయనున్నది. ఇందులో భాగంగా ఆయా జిల్లాల వారీగా ప్రత్యేకంగా పండించే పంటలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోనున్నది. ఈ పథకాన్ని కొత్త జిల్లాల్లోనూ అమలు చేసేందుకు కేంద్రం నిర్ణయించింది. దీని ఆధారంగా నాగర్‌కర్నూల్‌లో అత్యధికంగా పండించే పంటల్లో ప్రధానమైన వేరుశనగను ఈ పథకం కింద ఎంపిక చేశారు. వేరుశనగను రానున్న ఐదేండ్ల పాటు పండించేలా ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. 2019-20 నుంచి 2023-2024 వరకు ఈ పథకం అమల్లో ఉండనున్నది. ఉమ్మడి జిల్లాలో నాబార్డు ద్వారా ఎఫ్‌పీవో అమలవుతున్నది. దీనిద్వారా వేరుశనగ సాగుకు తగిన ప్రోత్సాహం అందుతుంది. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఎఫ్‌పీవోల ఏర్పాటుపై వ్యవసాయ శాఖ కమిషనర్‌కు అధికారులు ప్రతిపాదనలు పంపించనున్నారు. 

అధికంగా దిగుబడి..

జిల్లాలో ఎంజీకేఎల్‌ఐ ప్రాజెక్టుతో భూగర్భజలాలు పెరిగాయి. చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. దీంతో ప్రతి ఏడాది యాసంగిలో అత్యధిక స్థాయిలో వేరుశనగ సాగు, దిగుబడి జరుగుతోంది. గత మూడేండ్లలో 3.35 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగుచేశారు. ఫలితంగా దాదాపుగా 30 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఇలా మూడేండ్లల్లో దాదాపుగా రూ.1500 కోట్ల ఆదాయం రావడం గమనార్హం. ప్రతి ఏడాది అంతకంతకూ ఆదాయం పెరుగుతూ వస్తున్నది. దీంతో యాసంగిలో వేరుశనగ సాగుపై రైతులు ఆసక్తి పెంచుకుంటున్నారు. అత్యధిక స్థాయిలో ఉత్పత్తి అవుతున్న ఈ పంటతో మార్కెట్‌ యార్డులన్నీ పల్లీతో నిండిపోతున్నాయి. ప్రభుత్వం రైతులకు మద్దతు ధరను ఇచ్చి కొనుగోలు చేస్తోంది. దీనివల్ల సకాలంలో పంట లాభాలు అందుతున్నాయి. ఇది రైతులకు ఎంతో ప్రయోజనం కలిగిస్తోంది. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో వేరుశనగ పంట అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయి. ప్రతి యాసంగిలో అత్యధికంగా సాగయ్యే ఈ పంటకు సంబంధించి సరైన సాగు యాజమాన్యం అందితే మరింత ప్రయోజనం కలిగే అవకాశముంది. ఈ క్రమంలో వ్యవసాయ పంటగా వేరుశనగను ప్రకటించబడటం రైతులకు సంతోషాన్ని కలిగిస్తుంది. నాబార్డు ద్వారా ఈ పథకం నుంచి వేరుశనగ పంట సాగు, దిగుబడి పెంచేందుకు వ్యవసాయ శాఖ సిద్ధమైంది. త్వరలో ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయనున్నది.

మూడేండ్లల్లో సాగైన వేరుశనగ వివరాలు..

సంవత్సరం    సాగైన విస్తీర్ణం దిగుబడి ఆదాయం
(ఎకరాల్లో)  (క్వింటాళ్లలో) (కోట్లల్లో)

2017-18    1,34,368      10,07,756  448.45
2018-19    1,02,965      9,26,685    453.15 
2019-20    1,17,837        11,78,370    599.79

త్వరలో విధి విధానాలు.. 

జిల్లా పంటగా ప్రభుత్వం వేరుశనగను ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎఫ్‌పీవోలు, ప్రోత్సాహం కింద ఈ పంట అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం. కలెక్టర్‌ ఆదేశానుసారం రాష్ట్ర కమిషనర్‌కు నివేదికలు పంపేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఆ తర్వాత కమిషనర్‌ మార్గనిర్దేశకాలను ప్రకటిస్తారు. జిల్లాలో కార్యాచరణపై ప్రణాళికలు తయారుచేస్తాం. 

- వెంకటేశ్వర్లు, డీఏవో, నాగర్‌కర్నూల్‌
logo