శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Nagarkurnool - Aug 08, 2020 , 03:46:27

మాతృ మరణాలను అరికట్టాలి : కలెక్టర్‌

మాతృ మరణాలను అరికట్టాలి : కలెక్టర్‌

నాగర్‌కర్నూల్‌ టౌన్‌ : మాతృ మరణాలను అరికట్టాలని కలెక్టర్‌ శర్మన్‌ సూచించారు. గతనెలలో లింగాల మండలంలో జరిగిన మాతృమరణంపై కలెక్టర్‌ తన చాంబర్‌లో డీఎంహెచ్‌వో సుధాకర్‌లాల్‌తో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. మరణానికి గల పూర్వాపరాలను, చికిత్స నిర్వాహణ తదితర అంశాలపై గైనకాలజిస్టును అడిగి తెలుసుకున్నారు. పలువిధాలా కృషి చేస్తున్నా మాతృ మరణాలను అరికట్టలేక పోతున్నామని, దీనికి గల కారణాలను తెలుసుకుని మాతాశిశు మరణాలను అరికట్టాలని వైద్యాధికారులను ఆదేశించారు. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం అనంతరం శిశువుకు ఏడాది వయస్సు వచ్చేంత వరకు అన్ని విధాలా వైద్య సేవలు అం దించాలన్నారు. మాతృ మరణాలకు గల కారణాలను క్షుణ్ణంగా తెలుసుకొని తగిన చర్యలు చేపడితే మంచి ఫలితాలను రాబట్టొచ్చని అభిప్రాయపడ్డారు. ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న గర్భిణులను గుర్తించి సుఖప్రసవం జరిగేలా చర్యలు తీసుకొని తల్లీబిడ్డ ఆరోగ్యాన్ని సంరక్షించాలన్నారు. దవాఖానలో ప్రసవం జరిగిన తరువాత బాలింతలను కనీసం 24 గంటల సమయం వై ద్యుల పర్యవేక్షణలో పెట్టుకోవాలన్నారు. ఆసుపత్రి నుంచి తల్లీబిడ్డ ఇంటికి చేరుకున్న తర్వాత వైద్య సిబ్బంది, ఆశలు సందర్శించి ఆరోగ్యాన్ని పరిరక్షించాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతంలో గర్భిణుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో డాక్టర్‌ శివరాం, స్త్రీ వైద్య నిపుణురాలు ప్రియాంక, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ను సన్మానించిన విశ్రాంత ఉద్యోగులు

నాగర్‌కర్నూల్‌ టౌన్‌ : గాంధీ గ్లోబల్‌ ఫ్యామిలీ, విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ చేనేత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన కలెక్టర్‌ శర్మన్‌ను ఉద్యోగులు సన్మానించారు. ఈ సందర్భంగా గాంధీ గ్లోబల్‌ ఫ్యామిలీ జిల్లా బాధ్యుడు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఆనాటి చేనేత కళ ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందిందని, అద్భుత పనితనంతో అగ్గిపెట్టెలో పట్టే చీరలు విక్టోరియా మహారాణికి ఇచ్చే స్థాయికి ఎదిగిందన్నారు. చేనేత ప్రోత్సాహకం కోసం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో గాంధీ గ్లోబల్‌ ఫ్యామిలీ జిల్లా బాధ్యుడు శ్రీధర్‌, డీఆర్వో మధుసూదన్‌నాయక్‌, సభ్యులు నరసింహులు, పాండురంగయ్య, పాండు, లింగారెడ్డి పాల్గొన్నారు.


logo