ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Nagarkurnool - Aug 08, 2020 , 03:46:25

స‌న్న‌కారు రైతుల‌ను ఆదుకోవాలి

స‌న్న‌కారు రైతుల‌ను ఆదుకోవాలి

l జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు ఆచారి   

l ఆయకట్టు రైతులకు న్యాయం చేస్తాం   

l బఫర్‌ జోన్‌ పరిధిలోని అక్రమ కట్టడాలు తొలగిస్తాం 

 l ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులతో సమావేశంలో కలెక్టర్‌ శర్మన్‌   

నాగర్‌కర్నూల్‌ టౌన్‌: నాగర్‌కర్నూల్‌ పట్టణ కేసరి సముద్రం చెరువు ఆయకట్టు పరిధిలోని సన్నకారు రైతులను ఆదుకోవాలని జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు ఆచారి అన్నారు. నాగర్‌కర్నూల్‌, ఎండబెట్ల, ఉయ్యాలవాడ, తిర్మలాపూర్‌ గ్రామాల రైతుల సమస్యల ఫిర్యాదులపై కేసరి సముద్రం చెరువును ఆచారి శుక్రవారం పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులతో కలెక్టర్‌ శర్మన్‌తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆచారి మాట్లాడుతూ.. కేసరిసముద్రం ప్రస్తుతం ఎత్తిపోతల పథకం ద్వారా 365 రోజులు నీటితో నిండి ఉంటోంది. దీంతో బఫర్‌ జోన్‌లోకి నీరు రావడం వల్ల చిన్న, సన్నకారు రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వెంటనే చెరువులోని నీటి నిల్వను తగ్గించి రైతులకు న్యాయం చేయాలని అధికారులకు సూచించారు. నీటి శాతం తగ్గిస్తే బఫర్‌జోన్‌ పరిధిలోని రైతులు కూరగాయలు పండించి జీవనం కొనసాగించేందుకు వీలవుతుందన్నారు. అలా కాని పక్షంలో పట్టా ఉన్న రైతులతో మార్కెట్‌ ధర ప్రకారం భూమిని కొనుగోలు చేసి చెరువును అభివృద్ధి పరచాలని సూచించారు. అనంతరం కలెక్టర్‌ శర్మన్‌ మాట్లాడుతూ.. చెరువు ఆయకట్టు రైతులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. బఫర్‌ జోన్‌ పరిధిలో నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగిస్తామని చెప్పారు. అదేవిధంగా కొల్లాపూర్‌ మండలం సోమశిల గ్రామంలో ఉన్న 110 రైతుల ఫారెస్టు, రెవెన్యూ పరిధిలో ఉన్న భూమిని సర్వే చేయించి నిజమైన పట్టాదారులను భూసర్వే పట్టాలో అప్‌డేట్‌ చేయాలని ఆచారి సూచించారు. సర్వే చివరి దశకు చేరుకుందని, ఈ నెలాఖరులోగా 110 మంది రైతులకు డిజిటల్‌ సంతకాలు చేసి పాసు పుస్తకాలను అందజేస్తామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా భూనిర్వాసితులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని ఆచారి కోరారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్‌నాయక్‌, నీటిపారుదల శాఖ అధికారి మురళి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ శ్రీరాములు, నీటిపారుదల శాఖ ఇంజినీరింగ్‌ అధికారులు, నాగర్‌కర్నూల్‌ తాసిల్దార్‌ గోపాల్‌, నాలుగు గ్రామాల రైతులు పాల్గొన్నారు. 

భూములు కోల్పోయిన వారికి పరిహారం ఇప్పించండి

వెల్దండ: ఎంజీకేఎల్‌ఐ కాల్వ నిర్మాణంలో భూములు కోల్పోయిన కల్వకుర్తి రైతులకు త్వరితగతిన పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు ఆచారి, కలెక్టర్‌ శర్మన్‌ను బీజేపీ మండల అధ్యక్షుడు విజేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రామస్వామి కోరారు. ఈమేరకు శుక్రవారం వారు కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు. వినతి ఇచ్చిన వారిలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గాప్రసాద్‌, రాంరెడ్డి, రవిగౌడ్‌, రైతులు వెంకటయ్య, అల్వాల్‌, యాదయ్య తదితరులు ఉన్నారు.logo