మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Nagarkurnool - Aug 05, 2020 , 02:08:06

సివిల్స్‌లో మనోళ్లు

సివిల్స్‌లో మనోళ్లు

నారాయణపేట: మంగళవారం వెలువడిన సివిల్స్‌ ఫలితాల్లో నారాయణపేటకు చెందిన 27 ఏండ్ల యువకుడు రాహుల్‌ సివిల్స్‌కు ఎంపికయ్యాడు. అది కూడా తొలి ప్రయత్నంలోనే.. ఓపెన్‌ కేటాగిరీలో ఆల్‌ ఇండియా స్థాయిలో 272వ ర్యాంక్‌ సాధించారు. అటు విద్యుత్‌ శాఖ ఏఈగా ఇప్పటికే విధులు చేపడుతూనే మరో వైపు సివిల్స్‌కు ప్రిపేరై విజయం సాధించారు. నారాయణపేట పట్టణం నుంచి సివిల్స్‌కు ఎంపికైన మొదటి వ్యక్తిగా నిలువగా.. నారాయణపేట జిల్లాలో (నారాయణరెడ్డి కలెక్టర్‌) తర్వాత రెండో వాడిగా నిలిచారు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం లక్ష్మీపూర్‌కు చెందిన బొంత నర్సింహులు, బొంత శశికళ నారాయణపేటలోని పర్మారెడ్డి కాలనీలో స్థిరనివాసం ఉంటున్నారు. నర్సింహులు స్థానిక దయానంద విద్యా మందిర్‌లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందాడు. ఆయన భార్య శశికళ పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తున్నది. వీరికి పుష్యమి, రాహుల్‌ ఇద్దరు పిల్లలు. పుష్యమి పాలిటెక్నిక్‌ విద్యను అభ్యసించగా ఆమెకు వివాహం చేశారు. రాహుల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసి నారాయణపేటలోనే ప్రభుత్వ విద్యుత్‌ శాఖ ఏఈగా విధులు నిర్వర్తిస్తున్నాడు. మధ్యలో ఉద్యోగానికి లాంగ్‌ లీవ్‌ పెట్టి సివిల్స్‌కు ప్రిపేరయ్యారు. ఇలా మొదటి ప్రయత్నంలోనే సివిల్స్‌కు ఎంపిక కావడంపై కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మంగళవారం వెలువడిన సివిల్స్‌ ఫలితాల్లో ఆల్‌ ఇండియా స్థాయిలో 272 ర్యాంక్‌ సాధించిన విషయం తెలుసుకున్న ఆయన స్నేహితులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున ఇంటికి చేరుకొని సన్మానించి, అభినందనలు తెలిపారు. ఫలితాలు వెలువడిన నుంచి రాత్రి వరకు రాహుల్‌ ఇల్లు అభినందనలు చెప్పే వారితో కళకళలాడుతూ దర్శనమిచ్చింది. రాహుల్‌కు ఆల్‌ ఇండియా 272 ర్యాంకు రావడంతో నారాయణపేట కలెక్టర్‌ హరిచందన, ఎస్పీ చేతన అభినందనలు తెలిపారు. 

విద్యాభ్యాసం : 

 1 నుంచి పదో తరగతి వరకు నారాయణపేట జిల్లా కేంద్రంలోని దయానంద విద్యామందిర్‌ ఉన్నత పాఠశాలలో చదివారు. 600 మార్కులకుగానూ 566 మార్కులు సాధించాడు

 ఇంటర్మీడియట్‌ హైదరాబాద్‌లోని మాదాపూర్‌ శ్రీ చైతన్య కళాశాలలో చదివారు. ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకుగానూ 970 మార్కులు సాధించాడు.

 ఎంసెట్‌లో 196వ ర్యాంక్‌ సాధించాడు.

 ఏఐఈఈఈలో ఆల్‌ ఇండియా స్థాయిలో 2314 ర్యాంక్‌ సాధించాడు.

 వరంగల్‌ నిట్‌లో ఇంజినీరింగ్‌ విద్యను అభ్యసించాడు.

ఉద్యోగం 

 వరంగల్‌ నిట్‌లో చదువుతుండగానే ప్లేస్‌మెంట్‌లో రెడ్డిస్‌ ల్యాబ్‌కు ఎంపికయ్యాడు. అక్కడ ఆరు నెలల పాటు ఉద్యోగం చేశాడు.

 2015లో విద్యుత్‌ శాఖలో జరిగిన ఏఈ పరీక్షకు హాజరై విద్యుత్‌ శాఖ ఏఈగా ఎంపికయ్యాడు.

 మొట్టమొదటి ప్రభుత్వ ఉద్యోగాన్ని 2016లో హైదరాబాద్‌లోని మింట్‌ కాంపౌండ్‌లో ఏఈగా చేపట్టాడు. 

 2016 నుంచి జూలై 2018 వరకు విధులకు సెలవు పెట్టి వాజీరాం ఇనిస్టిట్యూట్‌లో రెండేండ్ల పాటు సివిల్స్‌ కోచింగ్‌ తీసుకున్నారు.

 జూన్‌ 2019న ప్రిలిమ్స్‌, సెప్టెంబర్‌లో మెయిన్స్‌ రాసి.. ఫిబ్రవరి 27, 2020న ఢిల్లీలో జరిగిన ఇంటర్వ్యూకు హాజరయ్యారు.

 మంగళవారం వెలువడిన యూపీఎస్‌సీ పరీక్షల్లో ఆల్‌ ఇండియా స్థాయిలో 272వ ర్యాంక్‌ సాధించాడు.  

ఘనంగా అభినందన ర్యాలీ

యూపీఎస్సీ ఫలితాల్లో తమ స్నేహితుడు ఆల్‌ ఇండియా స్థాయిలో 272వ ర్యాంక్‌ రావడంతో స్నేహితులు నారాయణపేట పట్టణంలో అభినందన ర్యాలీ నిర్వహించారు. నారాయణపేట పట్టణంలోని పర్మారెడ్డి కాలనీ నుంచి ఓపెన్‌ టాప్‌ జీపులో రాహుల్‌ను నిల్చోబెట్టి, ముందు భాగంలో ద్విచక్ర వాహనాల్లో ఆయన స్నేహితులు బ్యాండ్‌ మేళాలతో పట్టణ పుర వీధుల గుండా ర్యాలీ నిర్వహించి స్వీట్లు తినిపించారు. సివిల్‌ ర్యాంక్‌ సాధించిన రాహుల్‌ను వార్డు కౌన్సిలర్‌ శిరీష చెన్నారెడ్డి, కాలనీ వాసులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, వ్యాయమ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు శాలువా, పూలమాలతో సన్మానించారు.logo