గురువారం 24 సెప్టెంబర్ 2020
Nagarkurnool - Aug 03, 2020 , 02:53:15

వ‌చ్చే వాన‌కాలానికి పాల‌మూరు నీళ్లు

వ‌చ్చే వాన‌కాలానికి పాల‌మూరు నీళ్లు

  • 70 శాతం పూర్తయిన పీఆర్‌ఎల్‌ఐ ప్రాజెక్టు 
  • వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి
  • ఎంజీకేఎల్‌ఐ లిఫ్ట్‌-3 నుంచి ప్యాకేజీ 29, 30లకు నీటి విడుదల 
  • హాజరైన జెడ్పీ చైర్‌పర్సన్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ

  వచ్చే వానకాలం నాటికి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం  నాగర్‌కర్నూల్‌ జిల్లా గుడిపల్లి వద్ద ఎంజీకేఎల్‌ఐ లిఫ్ట్‌-3లోనిరిజర్వాయర్‌కు కృష్ణానది నుంచి భారీగా నీళ్లు రాగా.. రిజర్వాయర్‌ నుంచి 29, 30వ ప్యాకేజీలకు విప్‌ గువ్వల బాలరాజు, జెడ్పీ చైర్‌పర్సన్‌ పద్మావతి బంగారయ్య, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, జైపాల్‌ యాదవ్‌, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి మంత్రి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటికే 70 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. వందేండ్ల ముందు చూపుతో సీఎం కేసీఆర్‌ పాలన కొసాగిస్తున్నారని చెప్పారు. ఆదాయం రాకున్నా రైతులను ఆదుకున్నామన్నారు. 


నాగర్‌కర్నూల్‌, నమస్తే తెలంగాణ : వచ్చే వానాకాలం నాటికి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా తొలివిడుతలో ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. నాగర్‌కర్నూల్‌ మండలం గుడిపల్లి శివారులో నిర్మించిన ఎంజీకేఎల్‌ఐ మూడో రిజర్వాయర్‌ను ఆదివారం మంత్రి సందర్శించారు. అనంతరం  మంత్రి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో కలిసి నాగర్‌కర్నూల్‌, కల్వకుర్తి, అచ్చంపేట ప్రాంతాలకు సాగునీరు విడుదల చేసి మాట్లాడారు. గతేడాది జూలై, ఆగస్టులో ఎంజీకేఎల్‌ఐ ద్వారా ఉమ్మడి పాలమూరులోని చెరువులకు నీళ్లు వదలడం జరిగిందన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ వరకూ ఆ నీళ్లు పారాయన్నారు. ప్రస్తుతం చెరువుల్లో నీళ్లు సమృద్ధిగా ఉన్నాయన్నారు

. కృష్ణానది వరద జలాలను సద్వినియోగం చేసుకునేందుకు సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో ప్రభుత్వం ప్రాజెక్టులను శరవేగంగా చేపడుతుందన్నారు. రైతులు చెరువులు, కాల్వలకు గండి పెట్టొద్దని కోరారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రెండేండ్లలో పూర్తిచేసి తీరుతామన్నారు. ప్రాజెక్టు పనులు దాదాపు 70శాతం పూర్తైందన్నారు. ప్రాజెక్టు పరిధిలోని ఏదుల, వట్టెం రిజర్వాయర్ల పనులు 90శాతానికిపైగా పూర్తి కావడం విశేషమన్నారు. ఎంజీకేఎల్‌ఐ ప్యాకేజీ 29, 30 ద్వారా కృష్ణా జలాలను విడుదల చేయడం సంతోషకరంగా ఉందన్నారు. అనంతరం ప్యాకేజీ 30 వద్ద మొక్కలు నాటారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, జెడ్పీ చైర్‌ పర్సన్‌ పద్మావతిబంగారయ్య, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్‌, ఎంజీకేఎల్‌ఐ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

నియంత్రిత సాగుతోనే లాభాలు

కల్వకుర్తి : నియంత్రిత సాగు రైతులకు మేలు చేకూరుస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కల్వకుర్తిలోని 99 సర్వే నెంబర్‌ ప్రభుత్వ భూమిలో నిర్మించనున్న రైతు వేదిక భవన నిర్మాణానికి ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు, నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌, కలెక్టర్‌ శర్మన్‌తో కలిసి మంత్రి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సాంప్రదాయ పంటలతో రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని అన్నారు. జాతీయ, అంతర్జాతీయంగా డిమాండ్‌ ఉన్న పంటలు పండిస్తేనే రైతులకు మేలు జరుగుతుందన్నారు. ఉదాహరణగా నియంత్రిత వ్యవసాయంతో ఇతర దేశాలు ప్రపంచాన్ని శాసిస్తున్నాయని మంత్రి సింగిరెడ్డి వివరించారు. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా అంతిమంగా ప్రజల మేలు కోసమేనన్న విషయాన్ని గుర్తెరగాలని మంత్రి పేర్కొన్నారు. రైతు వేదికల ద్వారా రైతులకు ఎనలేని ప్రయోజనాలు చేకూరుతాయని, రైతులు సంఘటితం అయ్యేందుకు వేదికలు ఉపకరిస్తామని మంత్రి చెప్పారు. అంతకుముందు ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ మాట్లాడారు. ప్రభుత్వం రైతుల సంక్షేమానికి చేపడుతున్న తీరును వివరించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌ చైర్మన్‌ బాలాజీసింగ్‌, సింగిల్‌ విండో అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ ఎడ్మ సత్యం, వైస్‌ చైర్మన్‌ షాహెద్‌, మార్కెట్‌ చైర్మన్‌ బాలయ్య, వైస్‌ చైర్మన్‌ విజయ్‌గౌడ్‌, ఎంపీపీ సునీత, వైస్‌ ఎంపీపీ గోవర్ధన్‌, రైతు బంధు సమితి అధ్యక్షుడు వర్కాల భాస్కర్‌రెడ్డి, కౌన్సిలర్లు సూర్యప్రకాశ్‌, శ్రీశైలం, బోజిరెడ్డి, రాంరెడ్డి, కిశోర్‌రెడ్డి,   సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.


logo