గురువారం 06 ఆగస్టు 2020
Nagarkurnool - Aug 02, 2020 , 08:12:02

మంత్రాలమ్మ మ‌హిమ‌

మంత్రాలమ్మ మ‌హిమ‌

  •  జనుంపల్లిలో ఇంటికో మంత్రాలమ్మ, మంత్రాలయ్య
  •  గ్రామ దేవత పేరుతో నామకరణం
  •  కొన్నేండ్లుగా  కొనసాగుతున్న ఆచారం
  •  అమ్మవారి మహత్యమే అంటున్న గ్రామస్తులు

అక్కడివారంతా తమ మొక్కులు తీర్చే గ్రామ దేవతనే విశ్వసిస్తారు.  అమ్మవారి మంత్రాలమ్మ పేరు వచ్చేట్లుగానే పేర్లు పెడుతుంటారు. నాటి నుంచి నేటి వరకు ‘మ’ అక్షరంతోనే పేరు పెట్టుకోవడం ఆ గ్రామ ప్రజలు ఆచారంగా భావిస్తున్నారు. మంత్రాలమ్మ, మంతయ్య, మంతమ్మ అనే పేర్లు దాదాపు ప్రతి ఇంటిలో ఒకరికి ఉంటాయి. గ్రామ దేవతపై ఉన్న భక్తి.. అమ్మవారి మహత్యం వల్లే పేర్లు పెట్టుకుంటామని చెబుతున్నారు జనుంపల్లివాసులు. అక్కడి పేర్ల ప్రత్యేకతపై ఆదివారం కథనం.

- కోడేరు


నాగర్‌కర్నూల్‌ జిల్లా కోడేరు మండలం జనుంపల్లి గ్రామంలో అత్యధికంగా గ్రామస్తులు తమ బిడ్డలకు మంత్రాలమ్మ, మంత్రాలయ్య అనే పేర్లు పెట్టుకున్నారు. గ్రామ శివారులో వెలసిన మంత్రాలమ్మ దేవతను ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మార్చి మాసాల్లో ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. మంత్రాలమ్మ దేవతపై ఆ గ్రామ ప్రజలకు ఉన్న భక్తి విశ్వాసాలకు నిదర్శనంగా గ్రామంలోని ప్రతి ఇంట్లో ఒకరికి దేవత పేరు కలిసివచ్చేటట్లు నామకరణం చేస్తుంటారు. గ్రామ జనాభా 2,640 మంది ఉన్నారు. ఇందులో 1,340మంది పురుషులు 1300 మంది మహిళలు ఉన్నారు. ఇందులో 93 మంది పురుషులు మంత్రాలయ్య, మంతయ్య, పెద్దమంతయ్య, నడిపిమంతయ్య, అనే పేర్లు ఉండగా మరో 135 మంది మహిళల పేర్లు కూడా మంత్రాలమ్మ, మంతమ్మ, చిన్నమంతమ్మ, పెద్దమంతమ్మ, నడిపిమంతమ్మ అనే పేర్లతో పిలువబడుతున్నారు. వీరే గాకుండా ఇంకా 18ఏళ్ల వయస్సులోపు బాలబాలికలు కూడా సుమారు 50మంది వరకు ఉన్నారు. మంత్రాలమ్మ దేవతపై ఉన్న భక్తి విశ్వాసంలోనే తమ పిల్లలలకు అమ్మవారి పేరు వచ్చేటట్లు నామకరణం చేస్తున్నామని గ్రామ ప్రజలు చెబుతున్నారు. గ్రామ దేవత పేరుతో తమ పిల్లలకు పేర్లు పెట్టుకోవడం ఆ దేవతపై ఉన్న భక్తి భావమేనని పేర్కొంటున్నారు.

అమ్మవారి దీవెనలు

మంత్రాలమ్మ దీవెనలు ఉండాలనే నాకు మంత్రాలయ్య పేరు వెట్టిన్రు. మాఊళ్ల శానా మందికి పేర్లు ఇట్లే ఉంటయి. అమ్మవారి పేరు వచ్చేటట్లే పెడ్తరు.. ఇంట్ల ఒక్కరికైనా అమ్మవారి పేర్వెడ్తరు.

- జోగు మంత్రాలయ్య, జనుంపల్లి

 logo