మంగళవారం 04 ఆగస్టు 2020
Nagarkurnool - Jul 02, 2020 , 01:46:04

మహిళా సంఘాలు పటిష్టమవ్వాలి

మహిళా సంఘాలు పటిష్టమవ్వాలి

  • బ్యాంకర్లతో మాట్లాడి రుణాలు ఇప్పిస్తా 
  • సమావేశంలో ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు 

అచ్చంపేట: మహిళా సంఘాలు మరింత పటిష్టమై ఆర్థికాభివృద్ధి సాధించాలని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆకాంక్షించారు. బుధవారం సాయంత్రం అచ్చంపేట క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని మండల మహిళా సమాఖ్య, చెంచు సమాఖ్య అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారి, ఏపీఎం, సీసీలతో సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా మహిళా సంఘాల పనితీరు, సంఘాల సంఖ్య, మహిళలు సాధిస్తున్న పురోగతి, రుణాలు పొందిన సంఘాల గురించి చర్చించారు. గ్రామాలు, ఏపీఎంలు, సీసీలు మహిళా సంఘాలను మరింత బలోపేతం చేయాలని విప్‌ గువ్వల సూచించారు. సభ్యులకు ఏమీ తెలీదని ఏపీఎంలు, సీసీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సంఘాలను పనిచేయించడం, రుణాలు ఇప్పించడం, రుణాల చెల్లింపులో అచ్చంపేట జిల్లాలోనే మొదటిస్థానంలో ఉండాలని ఆయన కోరారు. అవసరమైతే బ్యాంకర్లతో మాట్లాడి రుణాలు ఇప్పించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని గువ్వల స్పష్టం చేశారు. మండల సమాఖ్యలో పనిచేసే అధికారులు, ఉద్యోగులు బాధ్యతగా వ్యవహరించాలని, వారిని గైడ్‌ చేసి సంఘాలు పటిష్టం చేసేందుకు కృషి చేయలన్నారు. ఉద్యోగులు తాము పనిచేస్తున్న మండలంలో స్థానికంగా నివాసం ఉండే ప్రయత్నం చేయాలన్నారు. సంఘాలకు తన సహాయం అవసరమైనపుడల్లా ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. సమావేశంలో మున్సిపల్‌ చైర్మన్‌ తులసీరాం నాయకులు నర్సింహగౌడ్‌, రాజేందర్‌, రాజేశ్వర్‌రెడ్డి, అమీనొద్దీన్‌, పర్వతాలు, ఏపీఎంలు విజయ, బాలస్వామి, సైదులు, రాంరెడ్డి, సీసీలు, సంఘాల మహిళలు పాల్గొన్నారు. 

ఆర్డీవో కార్యాలయం ప్రారంభం 

బుధవారం సాయంత్రం అచ్చంపేట ఆర్డీవో కార్యాలయాన్ని విప్‌ గువ్వల బాలరాజు ప్రారంభించారు. పాతభవనానికి మరమ్మతులు చేసి సిద్ధం చేసిన కార్యాలయాన్ని గువ్వల రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రికార్డుల ప్రక్షాళన చేపట్టంతో నియోజకవర్గంలో వానకాలం రూ. 150 కోట్ల రైతుబంధు నిధులు ఇవ్వడం జరిగిందన్నారు. ఆర్డీవో పాండునాయక్‌ నాయకత్వంలో రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు మంచిగానే పనిచేస్తున్నారని అన్నారు. భారత మాజీ ప్రధాని పీవీ కాంగ్రెస్‌ పార్టీ వ్యక్తయినప్పటికీ తెలంగాణ బిడ్డగా భావించిన సీఎం కేసీఆర్‌ పీవీకి శతజయంతి ఉత్సవాలు ఏడాది పాటు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. ఆర్డీవో కార్యాలయం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలని, రైతుల సమస్యలు త్వరితగతిన పరిష్కారం చేయాలని సూచించారు. సమావేశంలో ఆర్డీవో పాండునాయక్‌, డీఎస్పీ నర్సింహులు, తాసిల్దార్లు చంద్రశేఖర్‌, కృష్ణయ్య, రాధాకృష్ణ, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు పోకల మనోహర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ తులసీరాం, నర్సింహగౌడ్‌, రాజేందర్‌, రాజేశ్వర్‌రెడ్డి, అమీనొద్ద్దీన్‌, పర్వతాలు, డీటీ రాములు, ఆర్‌ఐ ఈశ్వర్‌, వీఆర్వోలు కంప శ్రీనివాసులు, రామకృష్ణ, మత్రు పాల్గొన్నారు. 


logo