గురువారం 13 ఆగస్టు 2020
Nagarkurnool - Jul 02, 2020 , 01:26:10

రుణ ప్రణాళిక రూ.3,474 కోట్లు

రుణ ప్రణాళిక రూ.3,474 కోట్లు

  • రూ.2424 కోట్లతో పంట రుణాలు
  • బ్యాంకర్లకు లక్ష్యం నిర్దేశన
  • వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత
  • రూ.3,247కోట్లతో 93 శాతం కేటాయింపులు
  • వందశాతం చేరుకునేలా ఆదేశాలు

 నాగర్‌కర్నూల్‌, నమస్తే తెలంగాణ  :   నాగర్‌కర్నూల్‌ జిల్లా వార్షిక రుణ ప్రణాళిక ఖరారైంది. కొవిడ్‌-19  నేపథ్యంలో ఆలస్యంగా జిల్లా యంత్రా ంగం ఈ ప్రణాళికను రూపొందించింది. గతేడాది రూ.3,170 కోట్లను ఖరారు చేయగా 57.66 శాతంతో రూ.1,827.81 కోట్ల రుణాలను అందించారు. ఇందు లో మహిళా సంఘాలకు రూ.163 కోట్ల లక్ష్యానికిగానూ రూ.కోటి అదనంగా రూ.164 కోట్లు కేటాయించడం గమనార్హం. మిగతా రంగాల్లోనూ 50 శాతంతో ఆయా రంగాలకు రుణాల కేటాయింపులు జరిగాయి. ఇదే క్రమంలో 2020-2021ఆర్థిక సంవత్సరానికిగానూ రూ.3,474 కోట్లతో వార్షిక రుణ ప్రణాళికను అధికారులు తయారు చేశారు. ఇందులో రూ.3,474 కోట్లు ప్రాధాన్యత రంగానికి చెందినవి ఉన్నా యి. కాగా పంట రుణాల కింద రైతులకు రూ.2,424 కోట్లను కేటాయించారు. ప్రస్తుతం వానకాలం పంట సీజన్‌ ప్రారంభం కావడంతో రైతులకు రుణాలను అందించేందుకు మార్గం సుగమమైంది. జిల్లాలో ఈఏడాది 5.60 లక్షల ఎకరాల్లో వరి, పత్తి, కందులు, ఇతర పంటలను సాగు చేయనున్నారు. ఇప్పటికే 2.61లక్షల మంది అన్నదాతలకు ప్రభుత్వం రూ.365 కోట్లతో రైతుబంధు పెట్టుబడుల సాయం అందిస్తోంది. ఈ క్రమంలో రైతులకు ప్రాధాన్యతనిస్తూ పంట రుణాల కోసం రూ.2 వేల కోట్లకుపైగా ఆయా బ్యాంకుల ద్వారా అందించేందుకు నిర్ణయించడం విశేషం. ఆయా బ్యాంకర్లకు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించారు. ప్రతి బ్యాంకు వంద శాతం రుణ ప్రణాళికను అమలు చేయాలని సూచించారు. 

  దీనికి సంబంధించిన బ్రోచర్‌ పుస్తకాలను జిల్లా అధికారులు, బ్యాంకర్ల సమక్షంలో విడుదల చేశారు. వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత కేటాయించడంతో పాటుగా ఎంఎస్‌ఎంఈ ద్వారా చిన్న తరహా పరిశ్రమలకు, అలాగే విద్య, హౌసింగ్‌ రుణాలను కూడా ఖరారు చేశారు. ఆయా రంగాలను బట్టి వ్యవసాయ దీర్ఘ, మధ్యకాలిక రుణాలతో పాటుగా సూ క్ష్మ, చిన్న మధ్య తరహా రంగానికి రూ.80.94 కోట్ల కేటాయింపులు జరిగాయి. అలాగే ఇతర ప్రాధాన్యత, అప్రాధాన్యత రంగాలకు సైతం రుణ ప్రణాళికలు కేటాయించబడ్డాయి. మొత్తం రుణ ప్రణాళికలలో అత్యధికంగా 93 శాతం వ్యవసాయ రంగానిదే కావడం గమనార్హం.

వందశాతం లక్ష్యం నిర్ధేశించాం 

  జిల్లాలో ఈ సంవత్సరం వార్షిక రుణ ప్రణాళికను రూ.3,474 కోట్లతో తయారు చేశాం. కరోనా నేపథ్యంలో కాస్త జాప్యం జరిగింది. వ్యవసాయానికి 93 శాతంతో తొలి ప్రాధాన్యత ఇచ్చాం. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత దృష్ట్యా బ్యాంకర్లకు వందశాతం లక్ష్యం చేరాలని ఆదేశించాం. ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసే నగదును బ్యాంకర్లు లోన్ల కింద జమ చేసుకోవద్దని స్పష్టంగా తెలియజేశాం.

- రామకృష్ణారెడ్డి, ఎల్‌డీఎం, నాగర్‌కర్నూల్‌

రంగాల వారీగా రుణ ప్రణాళిక

రంగం                                    కేటాయిపులు(రూ.కోట్లల్లో)     

పంట రుణాలు, అగ్రికల్చర్‌ టర్మ్‌ లోన్లు          2,886.00

అగ్రికల్చర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, సహకార లోన్లు     361.00

వ్యవసాయ రంగం                                          3,247.00

సూక్ష్మచిన్న సంస్థలు                           80.94

విద్యా రుణాలు                                    9.56

ఇంటి రుణాలు                                           65.02

ఇతర ప్రాధాన్యత రంగాలు                           10.94

ఇతర అప్రాధాన్యత రంగాలు                   60.59

మొత్తం                                                          3474.00


logo