గురువారం 06 ఆగస్టు 2020
Nagarkurnool - Jun 23, 2020 , 01:59:34

చెరువులకు మహర్దశ

చెరువులకు మహర్దశ

చెరువుల మరమ్మతులకు ప్రభుత్వం మరోసారి సిద్ధమైంది. పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తితో సాగునీటి లభ్యత పెరిగింది. దీంతో చెరువులను నింపుతూ రైతులకు ప్రభుత్వం సాగునీరు అందిస్తున్నది. ఇప్పటికే మిషన్‌ కాకతీయ పథకం ద్వారా చేపట్టిన పనులకు తోడుగా తాజాగా ఉపాధి హామీతో అనుసంధానం చేసి మరోసారి చెరువుల మరమ్మతులు చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించడం గమనార్హం. దీంతో రైతులతో పాటు ఉపాధి హామీ కూలీలకు పని కల్పించేలా తీసుకున్న నిర్ణయంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

   ఉపాధి హామీతో చెరువుల మరమ్మతులకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవలే సీఎం కేసీఆర్‌ దీనిపై ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సాగునీరు, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగా ఎంజీకేఎల్‌ఐతో పాటు పలు ప్రాజెక్టులను పూర్తి చేసింది. దీనివల్ల ఉమ్మడి జిల్లాలోనూ వ్యవసాయ రంగం ప్రగతి సాధిస్తున్నది. ఇక ప్రాజెక్టులతో నీటి వనరులు పెరుగడంతో చెరువులను పునరుద్ధరించింది. మిషన్‌ కాకతీయతో నాలుగేండ్లపాటు ఒక్క నాగర్‌కర్నూల్‌ జిల్లాలోనే దాదాపు 1500వరకు చెరువుల మరమ్మతులు చేయడం విశేషం. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఎంజీకేఎల్‌ఐ ద్వారా వచ్చే నీళ్లను అదనపు రిజర్వాయర్లు లేకపోవడంతో ప్రతి సీజన్‌లో 400వరకు చెరువులు నింపుతున్నారు. ఇలా 50వేల ఎకరాలకు సాగునీరు అందించడం జరుగుతున్నది. ఇదిలా ఉంటే ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోని చెరువులకు మరోసారి మరమ్మతులు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేసి ఈ పనులను చేపట్టేందుకు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో చెరువులను పూర్తిస్థాయిలో స్థిరీకరించడం జరుగుతున్నది. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 372 చెరువులను ఆధునికీకరించేందుకు ఇరిగేషన్‌ శాఖ కార్యాచరణ రూపొందించింది. అందుకు గానూ రూ.43కోట్లు ఖర్చు కానున్నదని అంచనాలు రూపొందించారు. అంచనా వ్యయాన్ని ప్రభుత్వానికి నివేదించనున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే పనులు చేపట్టేందుకు ఇరిగేషన్‌ శాఖ సన్నద్ధమవుతున్నది. కరోనా కారణంగా ఉపాధి పనులు కోల్పోయిన రైతులకు ఆర్థికంగా చేయూత అందించడం కూడా ఈ విధానానికి కారణం. జిల్లాలో ఉపాధి హామీ పథకంలో భాగంగా 82.039 కుటుంబాల్లోని 1,35,552మంది కూలీలకు 38.13లక్షల పనిదినాలు కల్పించడమే లక్ష్యంగా ఉన్నది. అయితే కరోనా నేపథ్యంలో 35లక్షల వరకే దాదాపుగా 65శాతం పనుల కల్పన జరిగింది. ఉపాధి పనులు లేక చాలా మంది పేదలకు ఆర్థికంగా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. దీనికితోడు ప్రస్తుతం వానకాలం రావడంతో సాధారణ పనులు చేపట్టేందుకు వీలు కాదు. దీంతో ఆ కూలీలకు పని దినాలు కల్పించి కూలీలను కూడా ఆదుకోవడమే ప్రభుత్వ విధానం. ఇలా మిగతా 13లక్షల పనిదినాలను ఈ చెరువుల పనులతో చేపట్టనున్నారు. ఉపాధి హామీతో చేపట్టనున్న చెరువుల మరమ్మతు పనులు ఇటు రైతులు.. అటు కూలీలకు లబ్ధ్ది చేకూరనున్నది.

రూ. 43కోట్ల అంచనా 

ఉపాధి హామీ పథకంలో భాగంగా రూ.43కోట్లతో జిల్లాలో 372చెరువులను 582 కిలోమీటర్ల పొడవున మరమ్మతులు చేయించేందుకు ప్రాథమిక అంచనాలు రూపొందించడం జరిగింది. దీనికి సంబంధించి ప్రభుత్వానికి నివేదికలు అందజేస్తాం. అనుమతులు వచ్చిన వెంటనే పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటాం.  - రమేశ్‌, డీఈ, నాగర్‌కర్నూల్‌ 


logo