శుక్రవారం 07 ఆగస్టు 2020
Nagarkurnool - Jun 23, 2020 , 01:55:20

వినూత్న విద్యావిధానం..

వినూత్న విద్యావిధానం..

కందనూలు: విద్యా సంవ్సతరం అంటే జూన్‌ 12 నుంచి ప్రారంభమై ఏప్రిల్‌ 24 వరకు కొనసాగుతున్నది. కానీ,  కరోనా మహమ్మారి పుణ్యమా అంటూ గత విద్యా సంవత్సరం మార్చిలోనే పరీక్షలు లేకుండా ముగిసింది.. ఇలాంటి తరుణంలో ఈ విద్యా సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియదు.. అప్పటివరకు విద్యార్థులు తమ జ్ఞానాన్ని కోల్పోకుండా ఉండేందుకు ప్రభుత్వం, విద్యాధికారులు కలిసి ఓ సరికొత్త విద్యా విధానానికి నాంది పలుకుతున్నారు. విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు బోధించడానికి కూడా సమయం తక్కువగా ఉండొచ్చని భావించి కాలనుగుణంగా విద్యా సంవత్సరాన్ని వినూత్న ప్రక్రియలతో ప్రణాళికలు చేసి ప్రారంభించనున్నారు. అది కేవలం ఈ విద్యా సంవత్సరానికే అని విద్యాధికారులు అంటున్నారు.

చిట్టి చేతులు.. చక్కని రాతలు 

చిట్టి చేతులు.. చక్కని రాతలు పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ఇది ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు సంబంధించిన కార్యక్రమం. ఇందులో విద్యార్థులు తెలుగు, ఆంగ్లం, గణితంలో అభ్యసన సామర్థ్యాలు పెంచే దిశగా అనుభవం కలిగిన ఉపాధ్యాయులతో విద్యాబోధన. ప్రతి విద్యార్థి తెలుగు, ఆంగ్లంలో చదువడం, రాయడం చతుర్వేది ప్రక్రియలు విద్యార్థులు సాధించే దిశగా పర్యవేక్షిస్తారు. ప్రతి వారం విద్యార్థుల ప్రగతిని వారి నోట్‌బుక్‌లో నమోదు చేస్తారు.

మేమూ నేర్చుకుంటాం  

మేమూ నేర్చుకుంటాం.. అనే ప్రోగ్రాం పేరిట ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి చదివే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కార్యక్రమం. ఇందులో విద్యార్థులే స్వతహాగా ఐదు అంశాలు నేర్చుకునేలా ప్రాధాన్యత కల్పించి, బోధనలో విద్యార్థులను భాగస్వాములను చేయడం, నోట్స్‌ రాయించడం, ప్రాజెక్ట్‌ వర్క్స్‌ చేయించడం, గ్రంథాలయ పుస్తకాలు చదివించి సమీక్ష చేయించడం, కెరీర్‌ గైడెన్స్‌పై సూచనలు చేయడం వంటి ఐదు అంశాలపై శిక్షణ ఉంటుంది.

త్రిశూల వ్యూహం

ఇది పదో తరగతి విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన ప్రత్యేక వ్యూహం. ఇందులో విద్యార్థులను ఏ,బీ,సీ గ్రూపులుగా విభజించి వారిని ప్రోత్సహిస్తారు. ఇక్కడ ఏ గ్రూప్‌ అనగా 10/10 జీపీఏ సాధించే విద్యార్థులు, బీ గ్రూప్‌ అనగా కచ్చితంగా ఉత్తీర్ణులయ్యే విద్యార్థులు, సీ గ్రూప్‌ ఫెయిల్‌ అయ్యే అవకాశాలు ఉన్న విద్యార్థులని అర్థం. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థుల ప్రతిభను బట్టి వారిని గ్రూపులుగా విభజించి సానబట్టే విధానమే త్రిశూల వ్యూహం.

వచ్చే విద్యా సంవత్సరంతో స్కూల్‌ కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులు కీలకంగా వ్యవహరిస్తారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని 20 మండలాల పరిధిలోని 57 స్కూల్‌ కాంప్లెక్స్‌ సముదాయలు పనిచేస్తాయని, విద్యలో వెనుకబడిన పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించి వారికి ప్రత్యేక శిక్షణ, తర్ఫీదు ఇస్తుంటారు. ఎప్పటికప్పుడు వారు ప్రతి పాఠశాలపై నిఘా ఉంచుతారు.


logo